తెలంగాణ చరిత్ర - సంస్కృతి (Telangana Ancient History)
తెలంగాణా పరిచయాంశాలు (Telangana History Introduction in Telugu)
రెండు తరాల ప్రజలు ఆరు దశాబ్దాల పాటు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితం మన నూతన తెలంగాణా రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించడం. ఉద్యమ చరిత్రకు పరిసమాప్తి పలికి ఒక నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఈ ప్రాంత ప్రజల మాతృభాష తెలుగైనప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల విషయంలో గానీ, కనీసం పాఠశాల విద్యనభ్యసించడానికి గాని 1948 వరకూ అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే, గ్రామాధికారుల, బడా భూస్వాముల, మత దురహంకారుల దౌష్టాన్ని ఎదిరించి, తమ స్వేచ్భా స్వాతంత్ర్యాలకై తమ ప్రాణాలనే తృణప్రాయంగా అర్చించిన ఘనత తెలంగాణా రైతులు, కౌలు దార్హు, కార్మికులు, తదితర సామాన్య ప్రజలకు దక్కుతుంది. తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా అందరూ ఒకే గొడుకు కిందకు రావాలనే ఆశయాన్ని తెలంగాణా ప్రజలు స్వాగతించినప్పటికీ మంత్రివర్గ పదవుల్లో, ఉద్యోగ నియామకాల్లో, తెలంగాణా మిగులు నిధులను ఖర్చు చేయడం లాంటి కీలక విషయాల్లో తమ పట్ల, తమ ప్రాంతం పట్ల వివక్షత చూపుతూ, సమాన గౌరవ ప్రతిపత్తులు, ఇవ్వలేదనే ఉక్రోషం, అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో, నాయకుల్లో గట్టిగా నాటుకోవడం జరిగింది. దీని పర్యవసానమే తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం.. నూతన యౌవన ఉత్సాహంతో, నాయకుల దీక్షతో, ప్రజల ఆకాంక్షలతో ఈ రాష్ట్రం తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు చాటుతుందని ఆశిద్దాం.
తెలంగాణా పదోత్పత్తి
తెలంగాణా అనే పదం అత్యంత ప్రాచీనమైందిగా చెప్పాలి. ఒక విధంగా చూస్తే, తెలుగు ప్రజల గుర్తింపు పురాణాల్లోనూ, ఇతర సాహిత్యాధారాల్లో పేర్కొన్న “త్రిలింగ” అనే మాట నుంచి వచ్చిందనే విషయంపై ఇంచుమించు ఏకాభిప్రాయముంది. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశంగా వ్యవహరించబడింది. దీని ప్రకారం, ప్రస్తుత తెలంగాణాను తొలి ఆంధ్రదేశానికి నాందిగా భావించాలి. తెలంగాణాలో జీవ నదైన గోదావరిని 'తెలివాహ నది” గా వ్యవహరించేవారు. తద్వారా, ఈ నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించి, కాలక్రమంలో త్రిలింగ దేశంగానూ, తెలంగాణాగానూ స్థిరపడి ఉండొచ్చు. మలి మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీక్ రచనలు ఇదే పేరును సూచిస్తాయి. ఉదాహరణకు, టాలమీ రచనలను పేర్కొనొచ్చు. రాజ శాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ అనే శబ్దాలను విరివిగా వాడారు. గంగరాజు ఇంద్రవర్మ పుర్లి శాసనం నుంచి మొదలుకొని, వివిధ కాకతీయ శాసనాలు ఈ మూడు పదాలను పర్యాయ పదాలుగా వాడాయి.
తెలంగాణా పదాన్ని సార్ధకం చేసి, స్థిరపరచిన ఘనత కాకతీయానంతర రచయితలకు దక్కుతుంది. కాకతీయుల కాలం నుంచి, ఉత్తర భారతదేశం నుంచి, ఢిల్లీ సుల్తానులు దక్షిణ భారతదేశం మీద చేసిన దండయాత్రలు, ముస్లిం విద్యావేత్తలు, ఆస్థాన రచయితల దృష్టిని తెలంగాణా వైపుకు మళ్లించాయి. ఈ రచనల్లో అనేక చోట్ల ఈ ప్రస్తావన కనిపించి, క్రమంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న 'తెలంగాణా' అనే పేరు స్థిరపడింది. దీనికి అనేక ఉదాహరణలసు పేర్కొనొచ్చు. పి.శ్రీరామశర్మ అభిప్రాయం ప్రకారం, ఆమీర్ ఖుస్రో నుంచి అబుల్ ఫజల్ మధ్య కాలంలో అంటే స్థూలంగా అల్లాఉద్దీన్ ఖిల్జీ నుంచి అక్చర్ కాలం మధ్యలో, తెలంగాణా అనే పేరు వ్యవహారికంగా మారింది. ఈ అభిప్రాయాన్ని శాసనాధారాలు కూడా సమర్థిస్తున్నాయి. “తెలంగాణ” అనే పదం, మెదక్ జిల్లా సంగారెడ్డిలోని తెల్లాపూర్ శాసనం (క్రీ.శ.1417), ప్రతాప రుద్రగణపతి వెలిచర్ల శాసనం, శ్రీకృష్ణదేవరాయల తిరుమల, చిన్న కంచి శాసనాల్లో స్పష్టంగా పేర్కొనబడింది. దీనికి తోడుగా, కొన్ని వర్ణాల, సామాజిక వర్గాల వర్ణనల్లో కూడా తెలంగాణా వాడుక ప్రభావముంది. కాకతీయుల కాలంలో కొన్ని శాఖల బ్రాహ్మణులను 'తెలగాణ్యులు' అంటే, తెలంగాణాకు చెందినవారిగా ప్రస్తావించారు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ వాదంతో ఏకీభవించడం మాత్రమే కాకుండా, 'ఆణెము' అంటే దేశము కాబట్టి, గోలకొండ (గోల్కొండ) స్థాపన సమయంలో కూడా తెలంగాణా వాడుకం ప్రాచుర్యాన్ని చెందిందని చెప్పారు. వీటన్నింటి ఆధారంగా ఇంచుమించు, కాకతీయుల పాలనా కాలం నుంచి, నేటి తెలంగాణా, దాని రూపురేఖలను దిద్దుకొంటూ రావడం జరిగింది. (Telangana History & Culture in Telugu)
తెలంగాణా చారిత్రక ప్రాముఖ్యత
తెలంగాణా చరిత్రకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత చరిత్ర పూర్వయుగం నుంచి సమకాలీన చరిత్ర వరకూ విస్తరించింది. పాత రాతియుగంలోని భారతదేశపు ఇతర ప్రదేశాలతో సరితూగగలిగిన చారిత్రకత, తెలంగాణాకు ఉంది. ఉదాహరణకు, దిగువ పాతరాతి యుగానికి చెందిన అషూలియన్ సాంకేతిక సంప్రదాయానికి, పనిముట్లు, ఆవాస స్థలాలు, రాష్ట్రంలోని పెద్దపల్లి తాలూకా, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. నిశితంగా పరిశీలిస్తే పది జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో లభించిన అవశేషాల వల్ల, మానవ నాగరికతా ప్రగతి పథంలో ప్రధాన భూమిక వహించిన పాత, మధ్య, నవీన శిలాయుగాల సంస్కృతులకు, తెలంగాణా కూడా ఒక కేంద్ర బిందువని చెప్పాలి.
తరవాత, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగిన క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో తెలంగాణా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఆనాటి ప్రముఖ జనపదాలలో ఒకటైన అస్మక జనపదం, నిజామాబాద్ ప్రాంతంలో ఉందని, ఈనాటి బోధన్ దానికి రాజధాని అని చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన గౌతమ బుద్ధుని కాలంలో తెలంగాణా ప్రాంతం విశేషంగా విలసిల్లింది. Importance of Telangana History in Telugu
అర్ధశాస్త్రంలోని అంశాలను విశదీకరిస్తే, మౌర్య సామ్రాజ్య కాలంలో వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన దక్షిణాపథ వర్తక మార్గాల్లో తెలంగాణాకు కూడా ప్రధాన పాత్ర ఉంది. కౌటిల్యుడు మొదట దక్షిణాపథ వర్తక మార్గాలు అంతగా ప్రాముఖ్యత లేనివని చెప్పినా, తరవాతి అధ్యాయాల్లో తన అభిప్రాయాన్ని మార్చుకొని అవి అత్యంత ప్రశస్తమైనవని చెప్పాడు.
మలి మౌర్యుల కాలంలో శాతవాహనులు సాధించిన ఘనతలో, ఆంధ్ర ప్రాంతానికి ఇంతవరకూ చరిత్రకారులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, తెలంగాణాపై తక్కువ దృష్టిని పెట్టారు. కాని, ఆచార్య పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, తెలంగాణాలోని నిజామాబాదు ప్రాంతం శాతవాహనుల జన్మస్థలం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొదట ఇక్కడ స్థిరపడిన తరవాతే వీరు ధాన్యకటకం లేదా ధరణికోట, అమరావతి ప్రాంతాలకు వెళ్లారనే వాదానికి చాలా బలం క్రమంగా చేకూరుతోంది. ఈ అంశంపై మరింత పరిశోధన చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఆర్థికపరంగా కూడా తెలంగాణా శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రముఖ పాత్ర పోషించింది. ప్రసిద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ చెప్పిన దాని ప్రకారం, తెలంగాణాలోని కొండాపురం శాతవాహనుల టంకశాల నగరం. వరంగల్లు సమీపంలో కూడా సాద్వవాహన పేరుతో కొన్ని నాణేలు లభ్యం కావడం గమనార్హం. శాతవాహనుల అనంతరం పాలించిన రాజవంశాలకూ, తెలంగాణాకు విశిష్ట సంబంధం ఉంది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాగార్జున కొండ సమీపంలోని విజయపురి రాజధానిగా పరిపాలించిన ఇక్ష్వాకులు, దక్షిణ తెలంగాణాలోని కొన్ని ప్రస్తుత జిల్లాలపై ఆధిపత్యం చెలాయించారని, వారి వంశస్థుడైన శాంతమూలుడు అస్మక, ములక (ప్రాచీన తెలంగాణా నామధేయులు) ప్రాంతాలను జయించాడని బి. ఎన్. శాస్త్రి గారు తెలిపారు. ఇక్ష్వాకుల అనంతర కాలంలో ప్రస్తుతం ఉన్న గ్రంథాల్లో తెలంగాణా ప్రాంతాన్ని విస్మరించారని చెప్పక తప్పదు. అయితే, స్థూలంగా ఇక్ష్వాకులకు సమకాలీనంగాను, వారి అనంతరం ఉత్తర తెలంగాణా వాకాటకుల ఆధిపత్యంలోకి వెళ్లి ఉంటుందనేది ప్రధాన భావం.
వారి అనంతరం విష్ణుకుండుల యుగంలో తెలంగాణా ప్రాంత ప్రాభవం పెరిగింది. ఈ రాష్ట్రంలో క్రీ.శ. నాలుగో శతాబ్ది చివరలో విష్ణుకుండులు అధికారానికి వచ్చారనే విషయంలో సందేహం లేదు. రాజ్య విస్తరణలో భాగంగా, వీరు క్రమంగా తమ స్వస్థలమైన తెలంగాణాను వదిలి, మహబూభ్‌నగర్, నల్గొండ ప్రాంతం నుంచి తూర్పు దిశగా, వేంగీ వైపుగా అంటే, ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పట్టణం దిశగా వ్యాప్తి చెందారు.
విష్ణుకుండుల అనంతరం, బాదామి చాళుక్యుల పరిపాలనలో తెలంగాణా ప్రాంతం ఉండేదనడానికి ఆధారాలున్నాయి. కర్నూలు - మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లో దొరికిన రెండో పులకేశి శాసనంలో, చాళుక్య విషయాలు (విషయం అంటే ప్రాంతం లేదా ఒక పరిపాలనా విభాగం) ప్రస్తావించబడ్డాయి. చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన భవభూతి క్రీ.శ.7-8 శతాబ్దాల్లో తెలంగాణా ప్రాంతంలోనే వర్ధిల్లాడు. వీరి తరవాత కాలంలో రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యులు (క్రీ.శ. 750-978) మధ్య కాలంలో బోధన్, వేములవాడ కేంద్రాలుగా పశ్చిమోత్తర తెలంగాణా ప్రాంతంలో పరిపాలించారు. దీన్ని 'సంపాద లక్షదేశం” గా వ్యవహరించేవారు. గోదావరి నదికి దక్షిణాన, మంజీరా నది నుంచి మహాకాళేశ్వరం వరకూ వ్యాపించిన భూభాగాన్ని “పోదనపాడు' అని వ్యవహరించారు. దీనికి గల మరొక పేరే సంపాద లక్షదేశం. ఈ ప్రాంతాలన్నీ వేములవాడ చాళుక్యుల ప్రాంతంలో ఉండేవి.
వీరి తదనంతరం, కందూరు చోడులు, కల్యాణీ చాళుక్యుల కాలంలో, సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణా ప్రాంతం అఖభివృద్ధి చెందింది. నల్గొండ దుర్గం, కొలనుపాక, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వంటి ప్రాంతాల ప్రస్తావన నాటి శాసనాల్లో విరివిగా ఉంది. వీటన్నింటి ఫలితంగా తెలంగాణా రాజకీయంగా, సాంస్కృతికంగా విశేష గుర్తింపు పొందిందని చెప్పొచ్చు. కల్యాణీ చాళుక్యుల పతనం నుంచి కాకతీయ సామ్రాజ్య ఆవిర్భావం వరకూ తొలి కాకతీయులతో పాటు, ముదిగొండ చాళుక్యులు,. పొలవాస నాయకులు, కందూరి చోడులు తెలంగాణాలోని వివిధ ప్రాంతాలను పరిపాలించారు.
అదృష్టవశాత్తు కాకతీయ యుగం నుంచి కుతుబ్‌షాహీలు, ఆసఫ్ జాహీల పరిపాలనా కాలాంతం వరకు, తెలంగాణా చరిత్ర, చరిత్రకారుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఈ కాలంలో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు తెలంగాణాకు తిరుగులేని చారిత్రక ఉనికి, ప్రాధాన్యతను సంతరించిపెట్టాయి. వీటిపై కొన్ని రచనలు జరిగినా, నాటి పారశీక, ఉర్జూ భాషల్లో ఉన్న రాతప్రతుల ఆధారంగా చేసుకొని, పలు అంశాలపై పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పైన చర్చించిన విషయాలాధారంగా, చరిత్ర పూర్వయుగం నుంచి ఆధునిక కాలం వరకూ, తెలంగాణా చరిత్రకు గర్వించదగ్గ విశిష్టత ఉందని తెలుస్తోంది. సమకాలీన చరిత్రలో కూడా తొలిసారిగా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణా నూతనోత్సాహంతో కొత్త పుంతలను తొక్కుతూ ప్రగతి పథంలో పయనిస్తోంది.
తెలంగాణా చరిత్ర ఆధారాలు
చరిత్ర రచన ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరుగుతుంది. చరిత్రను పునర్నిర్మించడానికి గల ఆధారాలను ప్రధానంగా లిఖిత పూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలుగా విభజించొచ్చు. మానవజాతి నాగరికతా సంస్కృతుల అభివృద్ధి క్రమానుగతంగా జరిగింది. ఈ దశకు చేరడానికి ముందు భాష, లిపి లేకుండా అనేక వేల సంవత్సరాలు మానవులు మనుగడ సాగించారు. ఇటువంటి లిపి లేని దశను చరిత్ర పూర్వయుగంగా వ్యవహరిస్తారు. ఈ కాలానికి సంబంధించిన వివరాలను తెలుసుకొనేందుకు కేవలం పురావస్తు ఆధారాలపై మాత్రమే ఆధారపడాల్సి వస్తుంది. నివాస స్థలాలకు సంబంధించిన అవశేషాలు లేదా కట్టడాలు, శాసనాలు, నాణేలను పురావస్తు ఆధారాలుగా వ్యవహరిస్తారు. Telangana History Proofs
సాహిత్య ఆధారాలు
సాహిత్య లేదా లిఖిత పూర్వక ఆధారాలు ఏ ప్రాంతపు చరిత్రకైనా చాలా ముఖ్యమైన ఆధారాలు. వీటినే స్వదేశీ, విదేశీ రచనలుగాను, స్వదేశీ రచనలను లౌకిక, మతపరమైన గ్రంథాలుగాను వ్యవహరిస్తారు. మతపరమైన గ్రంథాలలో వైదిక, బౌద్ధ, జైన మత గ్రంథాలు ప్రాచీన తెలంగాణా చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. ఉదాహరణకు, ఆచార్య నాగార్జునుని రచనలు, ఇతర జైన, బౌద్ధమత గ్రంథాలను, వేములవాడ చాళుక్య రాజు రెండో అరికేసరి ఆస్థాన కవి అయిన 'పంప' రచించిన ప్రముఖ గ్రంథం “ఆది పురాణాల' ను పేర్కొనొచ్చు.
అలాగే మతేతర లేదా లౌకిక గ్రంథాల ద్వారా ఆనాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు, పరిపాలనాంశాలు తెలుస్తాయి. 'హాలుడు' అనే శాతవాహన రాజు రచించిన “గాథా సప్తశతి" కొంత శృంగార పూర్వకమైన గ్రంథమైనప్పటికీ సమాజ స్థితిగతులకు దర్పణం పడుతుంది. పంప కవి రచించిన 'విక్రమార్క విజయం', విద్యానాథుడు రచించిన 'ప్రతాపరుద్ర యశోభూషణం' ఈ కోవకు చెందినవే. కౌటిల్యుని "అర్ధశాస్త్రం" లోని అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తే దక్షిణాపథ వర్తక వ్యాపారాలను గూర్చి ప్రస్తావించిన అధ్యాయాల్లో, తెలంగాణాకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కనిపిస్తాయి.
ఇక విదేశీ రచనల విషాయనికొస్తే, క్రీ.శ. తొలి శతాబ్దాల్లో వచ్చిన గ్రీకు రచనలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వివరాలను తెలియచేస్తాయి. ఉదాహరణకు, “ఎర్ర సముద్రపు దినచర్య” అనే అజ్ఞాత నావికుడు రచించిన గ్రంథంలో తెలంగాణా ప్రాంతం నుంచి ఆంధ్రా కోస్తా ప్రాంతానికి ఏ విధంగా వస్తువుల ఎగుమతులు, దిగుమతులు జరిగేవో పరోక్షంగా ప్రస్తావించబడింది. ఈ అంశాలపై లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణా మధ్యయుగ చారిత్రకాధారాలకు సంబంధించి సాహిత్యపరమైన ఆధారాల్లో, ప్రొఫెసర్ హెచ్.కె. షేర్వానీ రచించిన 'ది కుతుబ్‌షాహీస్ ఆఫ్ గోల్కొండ', డా. హీరానందశాస్త్రి విరచిత షితాబ్‌ఖాన్ ఆఫ్ వరంగల్, ప్రొసీడింగ్స్ ఆఫ్ ది. హైదరాబాద్ ఆర్కియోలాజికల్ & హిస్టారికల్ సొసైటి, జనవరి నుంచి ఆగస్ట్, 1941; డా. యన్. వెంకటరమణయ్య & శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ అందించిన 'ది కాకతీయాస్ ఆఫ్ వరంగల్'; బి.యాజ్దానీ (ఎడిటెడ్) ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్, సంపుటి-II, భాగం-IX లో; మారేమండ రామారావ్ (ఎడిటెడ్) కాకతీయ సంచిక (ఆంధ్రా: హిస్టారికల్ రీసెర్చి సొసైటి, రాజమండ్రి, 1985); పి. శ్రీనివాసాచార్ 'పొలిటికల్, సోషల్ అండ్ రెలిజియస్ కండిషన్స్ ఆఫ్ ది డక్కన్ అండర్ ది కాకతీయాస్' ఇన్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హైదరాబాద్ ఆర్కియోలాజికల్ & హిస్టారికల్ సొసైటి, జనవరి టు ఆగస్ట్, 1941 లను పేర్కొనొచ్చు.
తెలంగాణా ఆధునిక చరిత్రంతా అసఫ్‌జాహీల పాలనతో నిండి ఉంది. వీరి పాలనకు సంబంధించిన సాహిత్యాధారాలు ఎక్కువగానే ఉన్నా వీటిని అధ్యయనం చేసి, తదనుగుణంగా చేయబడిన రచనలు తక్కువే అని చెప్పాలి. నాటి ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రధానంగా పారశీక, అరబిక్ భాషల పదజాలం, అంకెలతో నిండిన ఉర్దూ భాషలో ఉండటం, వీటితో ఆధునిక పరిశోధకులకు పరిచయం - లేకపోవడం, ఆటంకంగా ఏర్పడిందనే విషయాన్ని మనం గ్రహించాల్సుంటుంది. అయితే, ఆంగ్లంలో ఉన్న'నివేదికలను' (వివిధ శాఖల పరమైనవి) మాత్రం అధికంగా అధ్యయనం చేయడం. జరుగుతూ వస్తోంది.
అసఫ్‌జాహీల పాలనకు సంబంధించిన సాహిత్యాధారాలు వివిధ రూపాల్లో ఉన్నాయి. సుబేదారీ రికార్డులు, ప్రభుత్వశాఖలకు సంబంధించిన రెవిన్యూ రికార్డులు, అడ్మినిప్టేటివ్ రిపోర్ట్స్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్, సెన్సెస్ రిపోర్ట్స్, స్టాటిస్టికల్ ఆబ్‌స్ట్రాక్ట్స్,. విలేజ్ లిస్ట్, ట్రేడ్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మొదలయినవి ఉన్నాయి. సుబేదారీ రికార్డులకు సంబంధించి, వరంగల్ సుబా (వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) పైన, డా.వి.రామకృష్ణారెడ్డి 1987 లో ది ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ (వరంగల్ సుబా), 1911-1950 అనే గ్రంథాన్ని వెలువరించడం జరిగింది. ఇక మెదక్ సుబా (మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు) కు సంబంధించి, ఆచార్య వి.రామకృష్ణారెడ్డి మేజర్ రీసెర్చి ప్రాజెక్ట్‌ను చేపట్టి, సోషల్ అండ్ ఎకనమిక్ డైనమిక్స్ ఆఫ్ మెదక్ సుబా ఆఫ్ ఫార్మర్ హైదరాబాద్ స్టేట్, 1905-1950 ఎ.డి.ను; అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫ్ మెదక్ సుబా ఆఫ్ ఫార్మర్ హైదరాబాద్ స్టేట్, 1905-1950 ఎ.డి.ను వరసగా 2012, 2014 ల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్స్‌గా తీసుకురావడం జరిగింది.
ప్రత్యేక అంశాలపై సర్వే నిర్వహించి, రిపోర్ట్‌లు లేదా నివేదికలను ప్రభుత్వానికి, వాటి అమలు నిమిత్తం సమర్పించడం జరిగింది. వీటిలో ప్రాధాన్యతా రీత్యా ప్రథమంగా వచ్చేవి, నాటి ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన శ్రీ యస్.కేశవ అయ్యంగార్ ఆర్థిక సర్వేలను జరిపి, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ది హైదరాబాద్ స్టేట్, 1929-30; రూరల్ ఎకనమిక్ ఇంక్విర్యిస్ ఇన్ హైదరాబాద్ స్టేట్, 1949-51 లను అందించడం జరిగింది. తదుపరి, ఇదే కోవలో టెనెన్సీ కమిటి రిపోర్ట్ (1940), రిపోర్ట్ ఆన్ అగ్రికల్చరల్ ఇనడెటెడ్‌నెస్ (1987), ది బ్యాంకింగ్ ఇంక్విర్యిస్ కమిటి రిపోర్ట్ (1930), ది అగ్రేరియన్ రిఫార్క్ కమిటి రిపోర్ట్ (1949), రాయల్ కమీషన్ రిపోర్ట్ ఆన్ జాగీర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిఫార్స్ (1947) వస్తాయి.
వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్, ట్రేడ్ స్టాటిస్టిక్స్, ఇంకా స్టాటిస్టికల్ ఆబ్‌స్ట్రాక్ట్స్, విలేజ్ లిస్ట్ విలువైన సమాచారాన్ని గణాంకాలనందిస్తున్నాయి. సెన్సెస్ రిపోర్ట్స్, లైవ్‌స్టాక్ సెన్సెస్ రిపోర్ట్స్, లేబర్ సెన్సెస్ రిపోర్ట్స్ ఆయా విషయాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
హైదరాబాద్ రాష్ట్రంలో వచ్చిన ప్రజా ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, రైతాంగ పోరాటం, స్వాతంత్ర్య పోరాటం, విలీనోద్యమాన్ని గురించి వీటిలో పాల్గొన్న నాయకులు, పరోక్షంగా సంబంధమున్న వారు కావించిన రచనలు, వీటికి సంబంధించిన విలువైన, బహుముఖ సమాచారాన్ని మనకు అందించడం జరిగింది. శ్రీ మాడపాటి హన్మంతరావు, మందుముల నర్సింగరావ్, స్వామి రామానందతీర్థ, మాదిరాజు రామకోటేశ్వరరావు, పి.సుందరయ్య, రావి నారాయణరెడ్డి, డి. వెంకటేశ్వరరావు, యమ్. బసవపున్నయ్య, సురవరం ప్రతాపరెడ్డి వీరంతా ఈ కోవకు చెందినవారే.
నాటి వార్తా పత్రికలైన గోల్కొండ పత్రిక, దక్కన్ క్రానికల్, మీజాన్, ది హిందు, రయ్యత్; సంచికలైన హైదరాబాద్ ఇన్‌ఫర్మేషన్, ది హైదరాబాద్ బులెటెన్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, విలువైన, విభిన్నమైన సమాచారాన్నందివ్వడం జరిగింది.
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గెజిటీర్స్, 1931-1936; యమ్. వి.రాజగోపాల్ (ఎడిటెడ్) ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ గెజిటీర్స్ 1976, ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా, ప్రావిన్సియల్ సిరీస్, హైదరాబాద్ స్టేట్, 1909, యన్.రమేశన్ (ఎడిటెడ్ ది ఫ్రీడమ్‌స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్, నాల్గు సంపుటాలు, 1966, కీలక సమాచారాన్నందిస్తున్నాయి.
వీటన్నింటికి తోడు, నాటి కొన్ని వ్యక్తిగత రచనలు కూడా ఎంతో ప్రముఖమైన ఆధారాలుగా ఉన్నాయి. యస్. హెచ్. బిల్లామి & సి.విల్‌మోట్‌లు రచించిన హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ స్కెచ్ ఆఫ్ హిజ్ హైనెస్ ది నిజామ్స్ డొమినియన్స్, 1983; ఎ.ఐ.ఖురేషి ది ఎకనమిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ హైదరాబాద్, సంపుటం-1, 1941 మౌల్విచిరాగ్ అలి, హైదరాబాద్ (దక్కన్) అండర్ సర్ సాలార్‌జంగ్, సంపుటి-1, 1884; జె.డి.బి. గ్రిబుల్, ఎ హిస్టరీ ఆఫ్ ది దక్కన్, సంపుటం-1, 1896; క్రిస్టఫ్‌వాన్ ప్యూర్ & హైమండార్స్ ట్రైబల్ హైదరాబాద్ లాంటివి వీటిలోకొస్తాయి.
పురావస్తు ఆధారాలు
ప్రాచీన తెలంగాణా చరిత్రకు అనేక పురావస్తు ఆధారాలు ఉన్నాయి. వీటిని సాధారణంగా కట్టడాలు, శాసనాలు, నాణేలుగా విభజించొచ్చు. చరిత్ర పూర్వయుగానికి సంబంధించి అనేక ఆధారాలు ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగానికి చెందిన నివాస స్థలాలు, మృణ్మయ పాత్రలు, సమాధులు మొదలైనవాటి ద్వారా లభ్యమౌతున్నాయి. ప్రాచీన శిలాయుగ ఆవాసాలు తెలంగాణాలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, రామగిరి, నార్కట్‌పల్లి, వలిగొండ వంటి అనేక ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. Ancient Telangana History in Telugu
నవీన శిలాయుగానికి సంబంధించిన బూడిద దిబ్బలు, నునుపైన రాతి పనిముట్లు, కుండ పెంకులు తెలంగాణా అంతటా లభ్యమయ్యాయి. అలాగే, బృహత్ శిలాయుగం లేదా మెగాలిథిక్ కాలానికి చెందిన సమాధులు, హైదరాబాద్ (కొండాపూర్, బోయినపల్లి), నల్గొండ, కరీంనగర్ లాంటి పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఇక తరవాతి కాలాలకు సంబంధించిన అనేక పురావస్తు ఆధారాలు, శాసనాలు, నాణేల రూపంలో విరివిగా లభ్యమయ్యాయి. వీటిలో శాసనాలు అనేక విధాలుగా రాజకీయ పరిస్థితులను తెలియచేస్తే, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో దొరికిన నాణేలు ఆర్థిక స్థితిగతులను తెలుసుకొనేందుకు ఉపకరిస్తాయి. తెలంగాణాలో తొలి శాసనాలు శాతవాహనుల పాలనలో వేయబడ్డాయి. తొలి శాసనాలు ప్రాకృతంలో ప్రధానంగా, సంస్కృతంలో కొంతవరకుండగా, క్రీ శ.3వ శతాబ్ది నుంచి సంస్కృతం, శాసన భాషగా, ప్రాకృతాన్ని వెనకకు నెట్టింది. చాళుక్య శాసనాల్లో సంస్కృతం, కన్నడం రెండూ కనిపించగా, కాకతీయుల నాటి నుంచి సంస్కృతంతో పాటు తెలుగును వాడటం మొదలైంది. కోటిలింగాల (కరీంనగర్ జిల్లా), నానేఘాట్, నాసిక్, కార్లే (మహారాష్ట్ర ప్రాంతం) శాసనాలు శాతవాహనుల కాలానికి చెందినవి కాగా, చందుపట్ల (నల్గొండ జిల్లా), హనుమకొండ వేయిస్తంభాల శాసనం, బయ్యారం చెరువు శాసనం, పాలంపేట శాసనం, మోటుపల్లి శాసనం (వరంగల్ జిల్లా) మొదలయినవి కాకతీయుల పాలనా కాలానికి చెందినవిగా ఉన్నాయి. ఈ శాసనాలు ఆయా రాజుల సైనిక విజయాలు, ఫలితంగా బిరుదులను స్వీకరించి, రాజసూయ, అశ్వమేధ యాగాలను జరపడం, మత, ధార్మిక, విద్యా సంస్థలకు దానాలివ్వడం లాంటి సమాచారాన్నిస్తుండగా, కాకతి గణపతిదేవుడు జారీ చేసిన మోటుపల్లి శాసనం మాత్రం వీటికి భిన్నంగా, సముద్ర వ్యాపార విశేషాలను తెలియచేస్తుంది. నాడు చైనా, మ్యాన్‌మర్ (బర్మా), శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలతో నౌకా వ్యాపారం కొనసాగించబడింది.
శాతవాహనుల నుంచి ఆయా రాజ వంశాల వారు తమ నాణేలను ముద్రించి, చెలామణిలో, తమ స్వతంత్రాధికార చిహ్నంగా జారీ చేయడం జరిగింది. సీసం, పాంటిన్, రాగి, వెండి నాణేలను శాతవాహనులు విడుదల చేయడం జరిగింది. ఆ యుగంలో 'కర్షాపన' అని పిలువబడే వెండి నాణెం బాగా వాడుకలో ఉండేది. ఈ యుగంలో వాడబడిన బంగారు నాణేలను 'సువర్ణ' అని వ్యవహరించడం జరిగింది. ఈ లోహ నాణేల ముద్రణ పుష్కలంగా ఉన్నట్లైతే, అది ఆయా పాలకుల ఆర్థిక సిరిసంపదలకు సూచకం కాగా, వీటి ముద్రణ పల్చబడినట్టెతే, అది వారి రాజ్య ఆర్థిక స్థితిగతులు క్షీణిస్తున్నాయనే సంకేతాన్నిస్తున్నట్లుగా భావించబడుతుంది. మరొక విషయమేమంటే, చివరి గొప్ప శాతవాహన చక్రవర్రైెన యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ గుర్తు లేదా బొమ్మతో నాణేలను విడుదల చేయడం, ఆనాడు విదేశీ లేదా నౌకా వాణిజ్యం విరివిగా సాగుతున్నదనే విషయాన్ని సూచిస్తుంది. తెలంగాణాలో శాతవాహనుల పాలనా కాలంలో పురావస్తు తవ్వకాల ఫలితంగా, ధూళికట్ట, పెద్దబంకూర్, కొండాపూర్, కోటిలింగాల లాంటి ప్రదేశాలు గొప్ప మార్కెట్ పట్టణాలుగా ఉన్నట్లు భావించబడుతుంది. Telangana Ancient History Telugu
పురావస్తు ఆధారాల్లో తదుపరి వచ్చేవి, వాస్తు నిర్మాణాలు. వీటిని స్థూలంగా లౌకికపరమైన, మతపరమైనవిగా వర్గీకరించొచ్చు. లౌకికపరమైన నిర్మాణాల్లో రాజ భవనాలు, కోటలు, స్మృతి చిహ్నాలు, విద్యా, వైద్య సంస్థలు చేరతాయి. ఓరుగల్లు, భువనగిరి కోటలు, దోమకొండ, గద్వాల్, కొల్లాపూర్, వనపర్తి సంస్థానాల భవనాలు, గోల్కొండ కోట, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల భవనం, ఉస్మానియా వైద్యశాల, లెజిస్లేటివ్ అసెంబ్లీ భవనం, జూబిలి హాల్ ఈ కోవకు చెందిన కొన్ని ప్రశస్తమైన నిర్మాణాలుగా ఉన్నాయి. వీటి నిర్మాణం, భిన్న కళారీతుల మిశ్రమంతో కూడుకోవడం విశేషం. ఇక మతపరమైన నిర్మాణాల్లో, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ఇస్లాం మతాల ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణా ప్రాంతంలోని ధూళికట్ట, ఫణిగిరి, కీసరగుట్టలో బౌద్ధమత ప్రభావిత నిర్మాణాలు; కొలనుపాకలో జైన దేవాలయం; అలంపురం, వేములవాడ, బెజ్జంకి, హనుమకొండ, పాలంపేట, పానగల్లు, పిల్లలమర్రి మొదలయిన ప్రదేశాల్లో హైందవ దేవాలయాలు అలరారుతున్నాయి. ఫణిగిరి, ధూళికట్ట, పెద్దబంకూర్‌ల్లో గల బౌద్ధ స్తూపాలు, ప్రసిద్ధ అశోక మౌర్యుడు నిర్మించిన సాంచీ స్టూపాన్ని, నిర్మాణంలో, శిల్పాలను చెక్కడంలో పోలి ఉన్నాయి. ఇవి శాతవాహనుల నాటి వాస్తు, శిల్పకళలకు ప్రతీకలుగా ఉన్నాయి. వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల కృషి ఫలితంగా, కొలనుపాక జైన దేవాలయం వెలసి, అభివృద్ధిచెందింది. ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు శైవ దేవాలయాల నిర్మాణానికి, విష్ణుకుండులు తెలంగాణాలోని బూరుగుగడ్డ, మక్తల, లింగగిరి లాంటి ప్రదేశాల్లో వైష్ణవ ఆలయాల నిర్మాణానికి, బ్రహ్మదేవునికి మరెక్కడా ఆలయం లేని సందర్భంలో, అలంపురంలో పశ్చిమ చాళుక్యులు నవబ్రహ్మ లేదా స్వర్గబ్రహ్మ ఆలయాల నిర్మాణానికి కారకులయ్యారు. Ancient Temples in Telangana
వాస్తు నిర్మాణాలపై చెక్కబడిన శిల్పాలు, బుద్ధుని జాతక కథలు, జీవిత విశేషాలతో పాట్స, ప్రజల సామాజిక జీవనం, మతాభిప్రాయాలు, సాంస్కృతిక జీవితానికి అద్దం పడుతున్నాయి. ప్రజల వేషధారణ, వృత్తులు, అభిరుచుల గురించి. చెప్పకనే చెబుతున్నాయి. కళాచాతుర్యానికొస్తే కొన్ని అద్భుత కళాఖండాలుగా నిల్బాయి. కాకతీయ ఓరుగల్లు కోట తోరణ ద్వారం, పాలంపేటలోని రామప్ప దేవాలయంలోని నంది విగ్రహం, మదనికలు, లేదా నృత్యాన్ని అభినయించే కాకతీయ ఓరుగల్లు కోట తోరణ ద్వారం నాట్యకత్తెల రూపాలు, వీటిలో కొన్నింటిగా పేర్కొనొచ్చు. ముఖ్యంగా, ఈ నంది విగ్రహం ప్రత్యేకత, మనం ఎటువైపు నుంచి దాన్ని చూచినా, అది మనవైపు చూస్తున్నట్లుగా ఉండటం.
శాతవాహనులు చిత్రకళను కూడా ఆదరించి, పోషించారు. అయితే, వీరి చిత్రకళా సృష్టికి అజంతా గుహలు ప్రధాన కేంద్రంగా ఉండి, మానవాకృతులను మల్చడంలో ప్రపంచ ప్రసిద్ధినిగాంచాయి. కాకతీయులు కూడా చిత్రకళాభివృద్ధికి తోడ్బడ్డారు. వీరి పాలనా కాలం నాటి చిత్రాలు త్రిపురాంతం, పిల్లలమర్రి, నాగులపాడులో దర్శనమిస్తున్నాయి.
ఈ విధంగా తెలంగాణా చరిత్రను తెలుసుకొనేందుకు పలు ఆధారాలున్నాయి. వీటిపై. ఇంకా పరిశీలన, పరిశోధనకు అవకాశం ఉంది.
ఉనికి, భౌగోళిక లక్షణాలు - ప్రాముఖ్యతా ప్రభావాలు
తెలంగాణా భౌగోళిక పరిస్థితులు, ఉనికి ఈ నూతన రాష్ట్రానికి ఒక విశిష్టతను ఆపాదించాయి. ప్రాబీన కాలంలో దక్షిణాపథంగాను, మధ్యయుగ తదనంతర కాలాల్లో దక్కన్‌గా పిలువబడిన భారత ద్వీపకల్పంలో తెలంగాణా ఒక అంతర్భాగం. భౌగోళికంగా నుంచి ఉత్తర అక్షాంశాల మధ్య, అదే విధంగా నుంచి తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణా విస్తరించి ఉంది. Telangana History Study Material in Telugu
వాస్తవానికి తెలంగాణా ఉనికి, భౌగోళిక పరిస్థితులను ప్రత్యేకమైనవిగా పేర్కొనొచ్చు. ఎందుకంటే, చరిత్ర పూర్వయుగం నుంచి 2014 లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం వరకూ ఆంధ్ర ప్రాంతంతో ముడిపడి ఉన్నా, తెలంగాణాకు భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
తెలంగాణా రాష్ట్రంలోని నదులు, పర్వతాలు ఒక ప్రత్యేకతను సంతరించుకొనేందుకు తోడ్పడ్డాయి. ఉదాహరణకు, ఉత్తరాన గోదావరి, ప్రాణహిత నదులు ఉంటే, దక్షిణాన కృష్ణా, తుంగభద్ర నదులు కనిపిస్తాయి. వివిధ పర్వత పంక్తులు విభిన్న నైసర్గిక స్వరూపాన్ని ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాలోని డిండి నది నుంచి ఖమ్మం జిల్లాలోని కందికల్ గుట్టల వరకు ఉన్న భౌగోళిక విభాగాలు, ఉత్తర, పశ్చిమ దిశల్లో కర్ణాటక, మహారాష్ట్రలను తెలంగాణా ప్రాంతం నుంచి వేరుచేసే సహజ సరిహద్దులుగా ఉన్నాయి.
ఇతర కొండలు, పర్వతాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ప్రారంభమైన తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల కొండలు మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఉన్నాయి. పడమటి కనుమలకు చెందిన సహ్యాద్రి శ్రేణి అజంతా శ్రేణి నుంచి విడివడి, ఆగ్నేయ దిశగా తెలంగాణాలోనికి వచ్చాయి. ఇవి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించాయి. వివిధ ప్రాంతాల్లో ఈ కొండలను నిర్మల్ గుట్టలు, రాఖీ గుట్టలు (కరీంనగర్), కందికల్ గుట్టలు (ఖమ్మం, వరంగల్) వంటి పేర్లతో పిలుస్తారు. Telangana History Notes in Telugu
ఇక జీవనదుల ప్రస్తావనకు వస్తే, తెలంగాణా అనేక నదులకు ఆలవాలం. తెలుగు ప్రజల సంస్కృతితో అవినాభావ సంబంధం ఉన్న గోదావరికి గల 720 కిమీ.ల పరీవాహక ప్రాంతంలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు కలిపి) 79% తెలంగాణాలోనే ఉంది. అలాగే, సిద్ధేశ్వరం వద్ద తెలంగాణాలో ప్రవేశించే కృష్ణానదికి చెందిన మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్న 450 కి.మీ. ల పరీవాహక ప్రాంతంలో 68.5 శాతం తెలంగాణాలో ఉంది. ఈ విధంగా గోదావరి, కృష్ణా నదులు తెలంగాణాను. సస్యశ్యామలం చేయడానికి ఎంతగానో దోహదపడతాయి.
తెలంగాణ ఏర్పడినప్పుడు 10 జిల్లాలతో కూడిన రాష్ట్ర పటం |
ఇక ఉపనదులు కూడా అనేకం. తుంగభద్ర, భీమ, మంజీర, ప్రాణహిత, మూసీ, డిండి, పాలేరు, మున్నేరు, పెన్‌గంగా, వార్థా వీటిలో ముఖ్యమైనవి. భౌగోళికంగా, తెలంగాణా అనేక ఎగుడు దిగుడు ప్రాంతాలుగా ఉండటం వల్ల చెరువుల. నిర్మాణానికి అత్యంత అనువైనది. కాకతీయుల కాలంలో ఈ శాస్త్రీయ అంశాన్ని గుర్తించి అనేక చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రసిద్ధి గాంచిన రామప్ప, పాఖాల, లక్నవరం, ఘనపూర్ తటాకాలు (వరంగల్ జిల్లాలో) వీరు నిర్మించినవే. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలంగాణా ఆంధ్రలో విలీనం అయ్యేనాటికి ఈ ప్రాంతంలో పెద్ద, చిన్న చెరువులు కలిసి ఇంచుమించు 20,000 దాకా ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం, ఈ చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ కాకతీయను' ప్రారంభించింది
వాతావరణం
తెలంగాణా ప్రాంతంలో వాతావరణం, మార్చి నెల నుంచి సెప్టెంబర్ వరకు వేడిగా, తేమగా ఉండి, మిగిలిన మాసాల్లో సమశీతోష్టంగా ఉంటుంది. సంవత్సరం నాలుగు కాలాలుగా విభజించబడింది. చలి కాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకుంటే, దీని తదుపరి ఎండా కాలం మార్చి నుంచి మే నెల వరకు కొనసాగుతుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలు వర్షించే కాలం కాగా, అక్టోబర్, నవంబర్ మాసాలు రుతుపవన తదనంతర లేదా తిరోగమన కాలంగా పరిగణించబడుతుంది. మరొక ముఖ్య విషయమేమంటే, కొండ ప్రదేశాలు, గోదావరి, ప్రాణహిత నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అనారోగ్యకరమైన, మలేరియా వ్యాధికారకమైన వాతావరణం నెలకొనగా, దీనికి భిన్నంగా, మధ్య మైదాన ప్రాంతాలు మలేరియా సోకని, ఆరోగ్యకర వాతావరణంతో కూడుకొని ఉండటం జరిగింది. Telangana State Weather Conditions
నైరుతి రుతుపవనాల రాకతో, గాలిలో తేమ జూన్ నెలలో హఠాత్తుగా పెరుగుతుంది. వర్షా కాలంలో ఇది కొనసాగుతూ, గాలిలో తేమ శాతం 65 నుంచి 80 వరకుండి, చలి కాలం, పొడి వాతావరణం, రావడంతో, ఇది క్రమేణా తగ్గుతూంటుంది. మార్చి నుంచి మే నెల కాలంలో, ఎండలు రావడంతో, గాలిలో తేమ శాతం 25కు పడిపోతుంది. అయితే, గమనించాల్సిన విషయమేమంటే, ఎండా కాలంలో పొడి వాతావరణం, మరట్వాడా కంటే తెలంగాణాలో తక్కువగా ఉంటుంది. దీనికి కారణం, తెలంగాణాలో చెరువులు, వీటికి సంబంధించిన సేద్యపు నీటి ప్రాజెక్టుల రిజర్వాయర్లు వీటికి తోడు పెద్ద అటవీ ప్రాంతాలు ఉండటం వల్ల ఎండా కాలంలో కూడా గాలిలో తేమ ఒక మోస్తరుగా కొనసాగుతూ ఉంటుంది. మరట్వాడాలో దీనికి భిన్నంగా, చెరువులు కాని, అడవులు కాని అంతగా లేకపోవడం జరిగింది. TSPSC Telangana History Notes Telugu
రుతుపవన, రుతుపవన తదుపరి సమయాల్లో బంగాళాఖాతంలో తుఫానులు, అల్పపీడన ద్రోణులేర్చడి, పడమరగా, వాయవ్యంగా కదులుతుండటం వల్ల, తెలంగాణాలోని వాతావరణాన్ని ప్రభావితం చేసి, విస్తృతంగా భారీ వర్షాలు కురవడం, బలమైన ఈదురు గాలులు వీయడం జరుగుతుంది. ఉరుములతో కూడిన జల్లులు ప్రధానంగా ఎండా కాలంలో నైరుతి రుతుపవనాల సమయంలో పడతాయి. ధూళితో కూడిన గాలులు ఎండా కాలం మధ్యాహ్న వేళల్లో సాధారణంగా వీస్తుంటాయి.
శీతోష్ణ స్థితి
ఫిబ్రవరి మాసాంతం నుంచి శీతోష్ణ స్థితి పెరుగుదల మొదలౌతుంది. మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ నెలలోని కొన్ని రోజుల్లో హనుమకొండ, ఖమ్మం, భద్రాచలం, రామగుండం లాంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత 47 సెంటిగ్రేడ్ (116.6 ఫారెన్ హీట్సొకు) చేరుతుంటుంది. అయితే, ఉరుములతో కూడిన జల్లులు మధ్యాహ్న వేళల్లో, కొన్ని రోజుల్లో రావడంతో, ప్రజలకు వడగాడ్పుల నుంచి కొంత ఉపశమనం లభించేది. జూన్ రెండో వారం నుంచి నెరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో, ఉష్ణోగ్రతలో. తగ్గుదల ఏర్పడుతుంది. అక్టోబర్ మొదటి వారానికల్లా, రుతుపవనాలు ఆగిపోయి, పగటి ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల ఏర్పడుతుంది. అక్టోబర్ తదుపరి, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు త్వర త్వరగా పడిపోవడమౌతుంది. డిసెంబర్ మాసంలో చలి అత్యధికంగా ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు 9 డిగ్రీల సెంటిగ్రేడ్ (48.2 ఫారెన్‌హీట్స్) కు పడిపోవడం జరుగుతుంది. ఫిబ్రవరి తదుపరి, ఉష్టోగ్రతలు పెరగడం ప్రారంభమౌతుంది.
జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో సాధారణంగా పడమర గాలులు; అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తూర్పు గాలులు; మార్చి, ఏప్రిల్ మే నెలల్లో వాయవ్య గాడ్పులు తరచుగా వీస్తాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు బలమైన గాలులు, ఎండాకాలం ద్వితీయార్ధంలో, నైరుతి రుతుపవనాల తొలి కాలంలో ఉంటాయి.
ఖనిజ వనరులు - ప్రాముఖ్యతా ప్రభావాలు
ఆర్థికపరంగా తెలంగాణాకు సహజ వనరులు, సంపద పుష్కలంగా ఉన్నాయి. ఖనిజ సంపదకు ఢోకాలేదు. తాండూరు, ఆదిలాబాద్, సింగరేణి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయి. దేశంలోనే వీటికి ప్రథమస్థానముండి, విస్తారంగా రైల్వేలకు సరఫరా చేయడంతో పాటు రామగుండం థర్మల్ విద్యుచ్చక్తి ఉత్పత్తికి ఇంధనాన్ని అందిస్తున్నాయి. ఇనుము లభ్యత. బాగుంది. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ముడి ఇనుప గనులున్నాయి. ఆస్‌బెస్టాస్, బైరైట్స్, సున్నపురాయి, నాపరాయి పుష్కలంగా లభ్యమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం (ఇల్లెందు), మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వివిధ రకాల ఖనిజ వనరులున్నాయి. వీటన్నింటి ఆధారంగా నల్గొండ జిల్లాలో సిమెంట్ పరిశ్రమ కేంద్రీకృతమైంది. Telangana State Minerals in Telugu
తెలంగాణాలో విస్తారంగా గ్రానైట్ రాళ్లు లభిస్తున్నాయి. ఇవి వివిధ రంగుల్లో లభిస్తున్నాయి. వీటిని భవన నిర్మాణాల్లో ప్రముఖంగా వాడుతున్నారు. ఇవి గట్టితనం, ఏళ్ల తరబడి స్వచ్చత, సుందరతను కోల్పోకుండా ఉంటాయని చెప్పడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల భవనమే గొప్ప దృష్టాంతం. ఇంకా వీటిని పాలిష్ బండలుగా మలచి, భవనాల నేల పరుపు (ఫ్లోరింగ్) కు వాడటం జరుగుతోంది. ఇసుక వనరులు తక్కువ అవుతున్న నేడు ఈ రాళ్లను పొడిచేసి, ఆ పొడిని ఇసుకకు బదులుగా సిమెంట్‌తో కలిపి, నిర్మాణ పనుల్లో విరివిగా వాడుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడు కూడా ఈ గ్రానైట్ శిల నుంచి మల్చబడ్డవాడే. నల్ల బంగారం (బొగ్గు) తో పాటు, ఈ గ్రానైట్ నిక్షేపాలు, ప్రకృతి తెలంగాణాకు ప్రసాదించిన గొప్ప. వరాలు, సౌభాగ్యాలు.
జాతి, సామాజిక స్వరూపం
ఇక్కడి ప్రజలు ద్రవిడ జాతికి చెందినవారు. నలుపు, గోధుమ రంగు శరీర ఛాయలో ఉంటారు. ప్రజల మాతృభాష తెలుగైనప్పటికీ, 433 సంవత్సరాల సుదీర్ఘ సుల్తానులు, నిజామ్‌ల పాలనా ఫలితంగా, నాటి విద్యార్థులు ఉర్జూను తప్పనిసరిగా. అభ్యసించడమే కాక, దీని ప్రభావం తెలుగుపై పడి, ఇక్కడి తెలుగు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల తెలుగుతో పోల్చుకొంటే, ప్రాంతీయపరమైన యాసను, వినూత్నతను పుణికిపుచ్చుకొంది. Telangana Socio Culture in Telugu
ఈ సందర్భంలో తెలంగాణా సామాజిక స్వరూపాన్ని సూలంగా అర్ధం చేసుకోవాల్సి ఉంది. తెలంగాణా సామాజిక, ఆర్థిక సర్వే - 2015 ఆధారంగా, తెలంగాణా సామాజిక స్వరూపం ప్రధానంగా గ్రామీణ స్వభావాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. మొత్తం జనాభాలో 61.88 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే, మిగిలిన 38.67 శాతం ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. జనాభా పెరుగుదల 2001, 2011 మధ్య కాలంలో 18.77 శాతం నుంచి (అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే) 13.58 శాతానికి తగ్గడం జరిగింది. ఇది తెలంగాణా సమాజంలో ఒక కొత్త అభివృద్ధి పోకడను సూచిస్తుంది. ఈ కాలంలో పట్టణ జనాభాలో 38.12% వృద్ధి కనిపించింది. అంతకుముందు దశాబ్దంలో, ఇది కేవలం 25.18 శాతం మాత్రమే పెరిగింది. సీమాంధ్ర ప్రాతం నుంచి అవిభక్త రాష్ట్ర కాలంలో హైదరాబాద్‌కు వలస వచ్చిన వారి సంఖ్య పెరగడం, దీనికి ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు.
ఇక జనసాంద్రత విషయానికొస్తే, ఇది ఆదిలాబాద్‌లో కనిష్టంగా ప్రతి చదరపు కిలోమీటర్‌కు 170 మంది నుంచి హైదరాబాద్‌లో చదరపు కిలో మీటర్‌కు 18,172 కు గరిష్టంగా చేరింది. తెలంగాణా సమాజంలో స్త్రీల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంల్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ. మిగతా ప్రాంతాల్లో సగటున తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలున్నారు. 1991 నుంచి స్తీ స్త్రీ పురుషుల నిష్పత్తిలో గణనీయమైన, అభిలాషదాయకమైన మార్పు వచ్చింది. ఈ పోకడ తెలంగాణా సామాజిక స్వరూపంలో ఒక విశిష్టమైన లక్షణం. అయితే సున్నా నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లల్లో స్తీ పురుషుల నిష్పత్తిని మెరుగుపర్బాల్సిన అవసరం కనిపిస్తుంది.
తెలంగాణా సామాజిక స్వరూపంలో వర్గపరంగా కొన్ని వ్యత్యాసాలు, ప్రత్యేకతలున్నాయి. మొత్తం సమాజంలో అధిక సంఖ్యాకులు వెనుకబడిన తరగతులకు చెందినవారు. రాష్ట్ర మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల వారు 15.44 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 9.84 శాతం మంది ఉన్నారు. జాతీయ సగటు కంటే షెడ్యూల్డ్ తెగల జనాభా తెలంగాణాలో అధికంగా ఉంది. అదే విధంగా, తెగల జనాభాలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ఈ నూతన రాష్ట్ర సామాజిక వ్యవస్థలో 80 శాతం ప్రజలు వెనుకబడిన, షెడ్యూల్డు తెగలు, షెడ్యూల్డు కులాలకు చెందినవారుగా ఉన్నారు.
అక్షరాస్యత విషయంలో తెలంగాణా కొంతవరకు వెనుకబడి ఉంది. అక్షరాస్యతా రేటు జాతీయ సగటైన 72.99 శాతం కంటే తక్కువగా 66.46 శాతం వద్ద ఉంది. ఇది ఒరిస్సా, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌ల్లోని అక్షరాస్యతా శాతం కంటే తక్కువగా ఉంది.
ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణాలు
తెలంగాణా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు ప్రధానమైనవి. స్థూల జాతీయోత్పత్తి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) పెరగడానికి తెలంగాణా సేవల రంగం చాలా దోహదం చేసింది. విషయమేమంటే తెలంగాణా రాష్ట్రం గడిచిన కొన్ని సంవత్సరాలలో విదేశీ మదుపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. Telangana Economy status
తలసరి ఆదాయంలో పెరుగదలను ప్రజల ఆర్థికాభివృద్ధికి ఒక ముఖ్యమైన సూచిగా భావిస్తారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, తలసరి ఆదాయం రూ. 1,08,889 లకు పెరిగింది. అంతకుముందు సంవత్సరంలో ఇది కేవలం రూ.95,861 గా మాత్రమే ఉంది. ఈ తలసరి ఆదాయంలో పోకడలు ఆరోగ్యదాయకంగా ఉన్నాయి. ఈ ఎదుగుదల కొనసాగితే తెలంగాణాలో నిరుపేదల అభ్యున్నతి, మొత్తం మీద ఆర్థికాభివృద్ధి జరుగుతుందనడంలో సందేహం లేదు. ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రంలో ప్రామాణికంగా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటుగా, కొన్ని సవాళ్లను ఎదుర్కోనేందుకు రాష్ట్రం సన్నద్ధం కావాలి.
తెలంగాణా సాంస్కృతిక వ్యవస్థ పునాదులు
తరతరాల సుదీర్ధ చరిత్రలో తెలంగాణా తనకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వాలను సంపాదించుకొంది. దీనికి పునాదులు ప్రాచీన మధ్యయుగాల్లోనే ఏర్పడ్డాయి. విశిష్టమైన పండుగలు, వాస్తు శిల్ప కళల అభివృద్ధి, తెలుగు సాహిత్యాభివృద్ధి ఈ ప్రత్యేక సంస్కృతికి ప్రతి యుగంలోనూ దోహదం చేశాయి. ఈ సంస్కృతీ స్వరూపాలను, వాటి అభివృద్ధిని కింది విధంగా సూక్ష్మంగా గమనించొచ్చు. Ancient Roots of Telangana Culture
తెలంగాణా సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండుగను పరిశీలిస్తే, ఆ సంస్కృతీ విశిష్టత, చారిత్రకత విశదమౌతుంది. విశ్వవిఖ్యాతి చెందిన తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందింది అనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్‌లోని వేములవాడ నుంచి 'బృహత్ శివలింగాన్ని' అంటే, మహాశివలింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తెలంగాణా ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో, పూలతో మేరు పర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా పండుగ సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్ధిస్తూ, నీటిలో నిమజ్జనం చేయడం ఈ బతుకమ్మ పండుగ ఉద్దేశం. ప్రస్తుత కాలంలో బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించిన తెలంగాణా బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలకు ఇంతటి చరిత్ర ఉంది.
అలాగే, కాకతీయుల కాలం నుంచి సమ్మక్క సారక్క గిరిజనుల జాతరలు నిరంతరాయంగా ఈనాటి వరకూ తెలంగాణాలో కొనసాగుతున్నాయి. ఆసఫ్‌జాహీ వంశస్థుడైన నిజాం సికందర్‌జా కాలం నుంచి సికింద్రాబాద్ లష్కర్ వద్ద నిర్మించిన మహంకాళి ఆలయ బోనాలు విశేషంగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు తెలంగాణాకే ఒక ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అమ్మవారి సోదరుడిగా పరిగణింపబడే పోతురాజు, రంగం పండుగ కార్యక్రమాలు ఈ బోనాల్లో ప్రధాన ఘట్టాలు. Telangana Festivals in Telugu
కాకతీయుల కాలం నాటి వీరశైవ సైనికుల పేరిణి శివతాండవ నృత్యం కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు చేసే దింసా నృత్యం, గోండులు, ఇతర తెగల. ప్రజలు అభినయించే గుసాడి నృత్యం, గరగల నృత్యం, జానపద కళలైన జంగంలు, దాసరుల, అసాధుల గేయాలు, గంగిరెద్దులాట, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో పేర్కొన్న పిచ్చకుంట్ల గీతాలు, బుడబుక్కలు, అతి ప్రాచీన జానపద నృత్య కళైన కప్పతల్లి, ఒగ్గు కథలు తెలంగాణా సంస్కృతిలో ప్రధాన భాగాలుగా అలరారుతున్నాయి.
ఇదే విధంగా సాహిత్య, వాస్తు శిల్పాలు శాతవాహనుల కాలం నుంచి కాకతీయులు, కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల కాలం వరకూ నిరాటంకంగా అభివృద్ధి చెందాయి. ఈ కళాస్వరూపాలు తెలంగాణాలో అడుగడుగునా కనిపిస్తాయి. శాతవాహనుల నాటి అమరావతి బౌద్ధ స్తూపం, కాకతీయుల ఓరుగల్లు కోట తోరణ ద్వారం, కుతుబ్‌షాహీల చార్మినార్, గోల్కొండ కోట, ఆసఫ్‌జాహీల భవన నిర్మాణాలైన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల, లెజిస్లేటివ్ అసెంబ్లీ, జూబిలీ హాల్, ఉస్మానియా వైద్యశాల లాంటి నిర్మాణాలను, అలనాటి వాస్తు, శిల్ప కళారీతులకు మచ్చుతునకలుగా పేర్కొనొచ్చు. దేశీయ, విదేశీయ వాస్తు, శిల్ప సంప్రదాయాలు - గాంధార, చాళుక్య, ఇండో సారసనిక్ శైలులు-పాలకుల అభిరుచులు, అభిప్రాయాలను అనుసరించి అజేయంగా వాడబడ్డాయి. ఇవి నేటికీ రాజ్యాలు అంతరించినా, రాజులు లేకున్నా, వారి స్కృతి చిహ్నాలుగా నిల్చి, గత వైభవాన్ని సూక్ష్మంలో మోక్షంగా చాటుతున్నాయి. వీటన్నంటి ఫలితంగా, తెలంగాణా సంస్కృతి ఒక లౌకిక, మిశ్రమ సంస్కృతికి దారితీసి మత సామరస్యంతో కూడిన ప్రజా వికాసానికి దోహదం చేసే సమర్ధతను సముపార్దించుకొందని గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఈ సాంస్కృతిక అభివృద్ధి మరింతగా రాష్ట్ర ప్రయోజనాలకు, వికాసానికి దోహదం చేస్తుందని ఆశించొచ్చు.
ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన తెలంగాణా చరిత్ర, సంస్కృతి పట్ల చరిత్ర విద్యార్థుల్లో, తెలంగాణా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా చరిత్ర, సంస్కృతిపై శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన జరగలేదు.