చరిత్ర పూర్వయుగం

Adhvith
0
Introduction to Telangana History in Telugu

చరిత్ర పూర్వయుగం (TSPSC Prehistoric Period in Telugu)

“మానవ జీవన పరిణామ క్రమాన్ని ఒక పూర్తి స్థాయి సినిమాగా తీస్తే, అందులో ఒక నిమిషం మాత్రమే చరిత్ర ఉంటుంది. మిగతా మొత్తం చరిత్ర పూర్వ యుగం ఉంటుంది” అని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుడు, గార్దన్‌ చైల్డ్‌ అన్నారు. చరిత్ర పూర్వ యుగమంటే, మానవ చరిత్ర నిర్మాణానికి లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగమని అర్థం. లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2300 సంవత్సరాల కాలాన్ని చారిత్రక యుగం అన్నారు. ఇప్పటి వరకు తెలిసిన ఆధారాల మేరకు, చారిత్రక యుగాని కంటే సుమారు మూడు లక్షల సంవత్సరాల ముందు నుంచే తెలంగాణలో మానవ మనుగడ కొనసాగుతున్నది. 

ఆధారాలు

ఇంతటి సుదీర్ధమైన చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన ఆధారాలు మాత్రం చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. 19వ శతాబ్దం మధ్య కాలంలో రాబర్ట్ బ్రూస్ పూట్ నల్గొండ జిల్లాలోని వలిగొండలో కనుక్కొన్న బృహత్ శిలా యుగపు సమాధులు, తెలంగాణ చరిత్ర పూర్వయుగపు అధ్యాయానికి మొదటిసారి తెరతీసింది. 1914 లో ఏర్పాటైన హైదరాబాదు రాష్ట్ర పురావస్తు శాఖ, శాస్త్రీయంగా చరిత్ర పూర్వ యుగపు స్థలాలను గుర్తించింది. ఆ శాఖ 1953 లో ప్రచురించిన 'యాంటిక్వేరియన్‌ రిమైన్స్‌ ఇన్‌ హైదరాబాద్‌ స్టేట్' అనే పుస్తకంలో తెలంగాణ చరిత్ర పూర్వ యుగానికి సంబంధించి, 118 స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొంది. వాటిల్లో, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ (నిర్మల్‌ ప్రాంతం) లలో వృక్ష శిలాజాలు, 20 కొత్త రాతి యుగపు స్థలాలు, 96 బృహత్‌ శిలాయుగపు స్థలాలు కనిపిస్తాయి. కొత్త రాతి యుగం కంటే ముందు యుగపు స్థలాలను ఆ రిపోర్టు పేర్కొనలేదు.

1956 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక, పురావస్తు శాఖ వందలాది చరిత్ర పూర్వయుగ స్థలాలను గుర్తించింది. అయితే, వాటిల్లో ఎక్కువ భాగం, ముంపు సంరక్షక పురావస్తు తవ్వకాల (Salvage Archaeology) వల్లనే వెలుగు చూశాయి. సాల్వేజ్‌ ఆర్కియాలజీ అంటే, ముప్పు పొంచి ఉన్న స్థలాలను అధ్యయనం చేయడం. నదీ లోయల్లోనే మానవ మనుగడ వికసించింది. నదులపై తెలంగాణలో గత శతాబ్దం నుంచి ఆనకట్టలు కడుతూ వచ్చారు. అలా మనకు నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, శ్రీశైలం, తుంగభద్ర, జూరాల, నిజాంసాగర్‌ మొదలైన ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టుల్లో మునిగిపోయిన చారిత్రక, చరిత్ర పూర్వయుగ స్థలాలను పురావస్తు శాఖ అధ్యయనం చేసి, వాటి వివరాలను నివేదికలుగా ప్రచురించింది. అవి, ఈ అధ్యాయానికి ప్రధాన ఆధారాలు.

పురావస్తు శాఖ సంచాలకులుగా పనిచేసిన వి.వి. కృష్ణశాస్త్రి, తెలంగాణలోని అనేక చరిత్ర పూర్వయుగ స్థలాలను, ప్రత్యేకించి చిత్రలేఖనాలున్న స్థలాలను గుర్తించారు. తెలుగు విశ్వవిద్యాలయ శ్రీశైలం పీఠంలో ఆచార్యులుగా పనిచేసిన కె. తిమ్మారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పారే కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న చరిత్ర పూర్వయుగపు స్థలాలను వెలుగులోకి తెచ్చారు. వారితోపాటు హైదరాదాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఎం.ఎల్‌.కె. మూర్తి, పోలవరం ప్రాజెక్ట్‌లో మునిగిపోనున్న దిగువ గోదావరి లోయలోని స్థలాలను పరిశోధించారు.

తెలంగాణ చరిత్ర పూర్వయుగానికి సంబంధించి, వ్యక్తిగత ఆసక్తితో పరిశోధన చేసిన వారిలో పేర్కొనదగిన వారు, ఠాకూర్‌ రాజా రాంసింగ్‌, ద్యావనపల్లి సత్యనారాయణ. ఉత్తర తెలంగాణలో పారే గోదావరి లోయలో, బాసర నుంచి భద్రాచలం మధ్య ఉన్న ఎన్నో స్థలాలను రాజా రాంసింగ్‌ గుర్తించారు. మానవ పరిణామ క్రమంలో, మొదటి దశ నుంచే తెలంగాణాలో ఆధారాలున్నాయని ఆయన నిరూపించారు. సత్యనారాయణ గత కొన్ని సంవత్సరాల కాలంలో, చాలా చరిత్ర పూర్వయుగ స్థలాలను కనుక్కొని పత్రికల ద్వారా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు శాఖలో పనిచేసిన బి. సుబ్రమణ్యం, 2012 నాటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రచించిన తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు అనే పుస్తకం, తెలంగాణ చరిత్ర పూర్వయుగ అధ్యయనానికి ఒక ముఖ్యాధారం. Prehistoric Age in India  Telugu

చరిత్ర పూర్వయుగంలో మానవులు ప్రధానంగా రాతి ఆయుధాలను వాడారు. కాబట్టి, రాతి ఆయుధాల వాడి (Sharpness), పరిమాణాన్ని బట్టి, చరిత్రకారులు కింది విధంగా విభజన చేశారు. తెలంగాణాకు సంబంధించి అవి, వాటి కాలపు వివరాలు ఇలా ఉన్నాయి. Prehistoric time periods 

  1. దిగువ పాత రాతి యుగం - 3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం
  2. మధ్య పాత రాతి యుగం - 1.0 లేదా 0.50 నుంచి 0.20 లక్షల సంవత్సరాలు
  3. ఎగువ పాత రాతి యుగం - 20,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం
  4. మధ్య రాతి యుగం - క్రీపూ.8,500 నుంచి 3,000 సంవత్సరాల క్రితం
  5. కొత్త రాతి యుగం - క్రీ.పూ.3,000 నుంచి 1,500 సంవత్సరాల క్రితం
  6. రాక్షసగూళ్ళ యుగం - క్రీ.పూ.1,500 నుంచి క్రీ.శ.300 వరకు

కొత్త రాతి యుగంలో రాగి వంటి లోహాలను పనిముట్లుగా వాడటం ప్రారంభమైంది. రాక్షసగూళ్ళ యుగంలో ఇనుప పనిముట్లను వాడటం కొత్తగా ప్రారంభమైంది. కౌబట్టి, ఈ యుగాన్ని అయో (ఇనుప) యుగమని కూడా అంటారు. ఈ యుగంలోనే పట్టణాలు, చిన్న చిన్న రాజ్యాలు, లిపి మొదలైన నాగరికతా చిహ్నాలు తలెత్తడం ప్రారంభమైంది. కాబట్టి, ఈ యుగాన్ని చరిత్ర పూర్వయుగం, చారిత్రక యుగం మధ్య సంధి యుగం (ప్రోటో హిస్టరీ) అని లేదా పురా చారిత్రక యుగమని కూడా పిలుస్తారు. మానవులు దిగువ పాత రాతి యుగంలో గులక రాయి పనిముట్లు (Pebbles), మధ్య పాత రాతి యుగంలో రాతి పెచ్చుల (flakes) పనిముట్లు, ఎగవ పాత రాతియుగంలో కొచ్చెటి పనిముట్లు (blades and burins), మధ్య రాతియుగంలో చిన్న చిన్నరాతి పనిముట్లు (microliths), కొత్త రాతి యుగంలో నున్నటి పనిముట్లు, రాక్షసగూళ్ళ యుగంలో ఇనుప లోహ పనిముట్లు వాడారు. కాబట్టి, ఆయా యుగాలను ఆయా పనిముట్ల పేర్లతో కూడా పిలుస్తారు.

Telangana Ancient History
Proto and Early Historical Sites
దిగువ పాత రాతి యుగం - లక్షణాలు

తెలంగాణలో చిన్న చిన్న గుట్టల వరుసప్రక్కన, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో సరిహద్దుగా పారే కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న నల్లమల అడవుల్లోని పీఠభూమి పైన, దిగువ పాత రాతి యుగపు ఆనవాళ్ళు అనేకం కనిపించాయి. దిగువ గోదావరి లోయలో ఈ యుగపు ఆవాసాలు, కరింనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి చుట్టుపక్కల 300 చ.కి.మీ. మేర, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. సిర్పూర్‌ నుంచి నస్పూర్‌, మంచిర్యాల, చెన్నూరు నుంచి వేమనపల్లి దాకా, తూర్పు ఆదిలాబాద్‌ జిల్లాలోను, కడెంనదికి ఉపనది అయిన పెద్దవాగు కుడి గట్టు మీదున్న బోత్‌, పొచ్చెర గ్రామాల్లోను, నిర్మల్‌ సమీపపు సువర్ణనది కుడి గట్టు మీదున్న చిట్యాలలోను, వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారం అడవుల్లో ఉన్న ఎక్కల, సెలిబాక గ్రామాల్లోను, ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, చర్ల, గోదావరి లోయలోనూ, ఈ యుగపు స్థావరాలు 500 చ.కి.మీ. నుంచి 1,000 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయని ఠాకూర్‌ రాజా రాంసింగ్‌ కనుక్కొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని బోత్‌, పొచ్చెర జలపాతం, కరీంనగర్‌ జిల్లాలోని గోదావరిఖని, రామగుండం, ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జునకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చంద్రగుప్త పట్టణం, ఈర్లదిన్నె మొదలైన స్థలాలను దిగువ పాత రాతి యుగానికి చెందిన ముఖ్యమైన స్థలాలుగా గుర్తించారు.

పాత రాతియుగం పనిముట్లు

పెద్ద పెద్ద ఆకారాలతో ఉందే చేతి గొడ్డళ్ళు, గోకుడు రాళ్ళు (Chopping tools), వృత్తాకారపు రాళ్ళు (discoid) ఈ యుగపు మనుషులకు వేటలో, ఆహార సేకరణలో ఉపయోగపడ్డాయి. ఈ కాలపు ఆయుధాలు ఆఫ్రికాలోని అష్యూలియన్‌ ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి. ఆనాటి మనుషుల జీవనం ఇంచుమించుగా జంతువుల జీవన విధానాన్నే పోలి ఉండేది. గుహలు, పెద్ద పెద్ద చెట్ల తొర్రలు వారికి విశ్రాంతి సమయ ఆవాసాలుగా ఉపయోగపడేవి.

మధ్య పాత రాతి యుగం - పరిణామ క్రమంలో మార్పులు

ఈ కాలపు రాతి పనిముట్లు అనేక నదీ లోయల్లో దిగువ పాతి రాతి యుగపు పనిముట్లతో పాటుగా, గుట్టలు గుట్టలుగా లభించాయి. ఇవి ప్రధానంగా రాతి పెచ్చులతో (flakes) చేసినవి. కృష్ణానది ఎడమ ఒడ్డున మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న యాపలదేవిపాడు దగ్గర జరిపిన తవ్వకాల్లో, మొదటిసారిగా ఎద్దు (bosnamadicus) అస్థిపంజరం అవశేషాలు, ఈ యుగపు పనిముట్లతో పాటుగా దొరకడం ప్రాధాన్యతను సంతరించుకొంది. అంటే, ఆనాటి మానవులకు ఎద్దులతో సంబంధం ఏర్పడిందని అర్ధమౌతుంది. 

ఈ యుగపు మానవులు చిన్నతరహా చేతి గొడ్డళ్ళు, గండ్ర గొడ్డళ్ళను, గోకుడు రాళ్ళను వాడారు. ఒక ముఖం, రెండు ముఖాలున్నవి, పార్శ్యంలో అంచుగలవి, తిన్ననైనవి, వాలు, పుటాకార, కుంభాకార, పుటాకార-కుంభాకార రకాల అలుగులు (drills), (ఆరె - తోలుకు రంధ్రాలు చేసేవి) awl borers (రంధ్రాలను చేయడానికి ఉపయోగించేవి), సాదా ముఖం, రెండు ముఖాల కొనలున్నవి, తోక ఉన్నవి, వాలిన భుజాలు కలవి లాంటి పలురకాల పెచ్చులతో చేసిన రాతి పనిముట్లను ఆనాటి మానవులు వాడినట్లు ఆధారాలు దొరికాయి.TS Police Telangana History notes in telugu

ఈ యుగానికి చెందిన ప్రధానమైన స్థలాలు, ఈ ప్రాంతాల్లో కనిపించాయి. అవి: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉన్న అప్పాపూర్‌, బోరాపూర్‌, చంద్రగుప్త పట్టణం లేదా చాకలిశిల,. సలేశ్వరం, కదలీవనం, మేడిమాన్‌కల్‌, క్యాతూరు, సోమశిల, దసరాపల్లె, నల్గొండ జిల్లాలో ఉన్న ఏలేశ్వరం, నాగార్జునకొండ, వరంగల్‌ జిల్లాలో ఉన్న గణపవరం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ఆసిఫాబాద్‌, పొచ్చెర, నస్పూర్‌, మర్లవాయి, కరీంనగర్‌ జిల్లాలో ఉన్న గోదావరిఖని, మేడిపల్లి, బుచ్చయ్యపల్లి, రామగుండం, మల్కాపురం' మొదలయినవి.TSLPRB Telangana history material

ఎగువ పాత రాతి యుగం - పనిముట్ల సాంకేతికతలో మార్పులు

భౌగోళిక, వాతావరణ పరంగా, ఈ యుగం ప్లైస్టోసీన్‌ (హిమ యుగం) ముగింపు దశను, హోలోసీన్‌ (ఉష్టోగ్రతలు పెరుగుతున్న దశ) ఆరంభ దశను సూచిస్తుంది. ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్‌ పనిముట్లు, పక్క అంచు ఉన్న బ్లేడ్‌ పనిముట్టు, కొన్ని చోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు. రాతి గుహల్లో రంగు బొమ్మలను గీయడం ఈ యుగంలో నేర్చుకొన్నారు. 

ఈ యుగపు మనుషుల స్థావరాలు, పనిముట్లు, తెలంగాణాలో కొండ దిగువ ప్రాంతాల్లో, నదీతీర పర్యావరణ వ్యవస్థల లోతట్టు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న వాంకిడి, గోదావరి లోయలో ఉన్న చెర్ల, బోర్నగూడెం, లక్నవరం, లింగవరం, పేరవరం, రాయవరం, వీరవరం, ఎల్లవరం, వరంగల్‌ జిల్లాలో ఉన్న ఏటూరునాగారం, పాకాల, కృష్ణానదీ లోయలో ఉన్న ఏలేశ్వరం, నాగార్జునకొండ, చంద్రగుప్త పట్టణం, కదలీవనం, మేడిమాన్‌కల్‌ మొదలైన ప్రాంతాల్లో, ఎగువ పాత రాతి యుగానికి చెందిన ముఖ్యమైన స్థలాలున్నాయి.

మధ్య రాతి యుగం - ప్రగతి పథంలో మరో అడుగు

మధ్య రాతి యుగం, భౌగోళిక వాతావరణ పరంగా, తొలి హోలోసీన్‌ యుగానికి చెందింది. ఆనాటి నుంచి మానవ వికాసానికి ఎక్కువ అనుకూల పరిస్థితులు అందుబాటులోకి వచ్చాయి. ఈ యుగంలో మానవులు అతి చిన్న, (సూక్ష్మమైన) రాతి ఆయుధాలను వాడారు. కాబట్టి, ఈ యుగాన్ని సూక్ష్మ రాతి యుగమని కూడా అన్నారు. కేవలం రాతి ఆయుధాలనే వాడిన మానవ యుగాల్లో ఇది చివరిది. దీని తరవాత వచ్చిన కొత్త రాతి యుగంలో రాతితోపాటు, ఎముకలు, లోహపు ఆయుధాలు, పనిముట్లను కూడా వాడారు. 

హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం దగ్గర కనిపించే స్మారక శిల వద్ద జరిపిన తవ్వకాల్లో చెర్ట్‌తో చేసిన సూక్ష్మరాతి పనిముట్లు బయటపడ్డాయి. వాటిల్లో గోకుడు రాళ్ళు, బ్యాక్ట్‌ బ్లేడు ముఖ్యమైనవి. ఈ ప్రాంతం నదీ తీరాన లేకపోయినా, ఇక్కడ మధ్య రాతి యుగపు పనిముట్లు దొరికాయంటే, ఆ యుగపు ప్రజలు నదీ తీరాలతోపాటు, అనేక విశాలమైన నేలల్లో కూడా నివసించారని తెలుస్తుంది. 

మధ్య రాతి యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో, 150 కి పైగా బొమ్మలు కనిపిస్తాయి. వీటిల్లో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, కుక్క, నక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు, ముసుగు ఉన్న మానవాకృతులు, చేతి ముద్రలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సున్నపురాయి, గ్రానైట్‌ రాయి, ఇసుకరాయి కొండ గుహల్లో కనిపిస్తాయి.

ఈ యుగానికి చెందిన మొదటి తరం చిత్రలేఖనాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సంగనోనిపల్లి రాతి గుహల్లో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి జింకల చిత్రాలు. వాటి పరిమాణం పెద్దగా ఉంది. బొమ్మను వేసే కుంచె జింక శిరస్సు నుంచి మొదలై, వీపు, పృష్ట భాగం వైపు కదిలినట్లు రంగు క్రమంగా పలుచన కావడాన్ని బట్టి తెలుస్తున్నది. ఇదే లక్షణం సంగనోనిపల్లి సమీపంలోని దుప్పడ్‌ గట్టు, పోతన్‌పల్లి, మన్నెంకొండ చిత్రాల్లో కూడా కనిపిస్తుంది. ఈ యుగపు చిత్రలేఖనాలు రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం, మెదక్‌ జిల్లాలోని హస్తలాపూర్‌, వరంగల్‌ జిల్లాలోని పాండవుల గుట్ట, నర్సాపూర్‌లలో ఉన్న రాతి గుహల్లో కూడా ఉన్నాయి.

కొత్త రాతి యుగం - విశిష్ట లక్షణాలు

చెక్కి తయారుచేసిన రాతి పనిముట్లను, మరో రాతి మీద రాకి రాకి నునుపుగా చేసుకోవడంతో, ఇలాంటి పనిముట్లను వాడిన మానవుల యుగాన్ని కొత్త రాతి యుగమన్నారు. ఈ యుగంలోనే, ఎముకలతో కూడా ఆయుధాలు, పనిముట్లను తయారుచేసుకొనేవారు. ఈ యుగం మలి దశలోనేమో, రాగి, కంచు లోహాలతో పనిముట్లను తయారు చేసుకోవడం నేర్చుకొన్నారు. వీటి సహాయంతో, భూమిని తవ్వి మొక్కలను నాటడం, పెంచడం, పంటలను పండించడం నేర్చుకొన్నారు. పంటలను పండించడం అనే ప్రక్రియ మూడు ముఖ్యమైన ఆవిష్కరణలకు దారితీసింది.

కొత్త రాతియుగం - రాతి గొడ్డలి
1) పంటలు పండే వరకు పంట చేల దగ్గరే ఉండాలి కాబట్టి, అక్కడే ఇళ్లు కట్టుకొని 'స్థిరనివాసాన్ని' ఏర్పర్చుకోవాల్బొచ్చింది. తద్వారా కుటుంబం, సమాజం, గ్రామం ఏర్పడ్డాయి. 
2) పండిన పంటలను నిల్వ ఉంచుకోవడానికి పాత్రలు అవసరమయ్యాయి. ఈ అవసరం కుండలు, బానలను తయారుచేసుకోడానికి కారణమైంది. మొదట చేత్తోనే కుండలను మట్టితో తయారుచేసి, కాల్చి, గట్టిపర్చేవారు. తరవాత కుమ్మరి చక్రాన్ని కనుక్కొని, దాని మీద నునుపైన కుండలను తయారు చేసుకోవడం నేర్చుకొన్నారు. కుండల తయారీతో నిల్వ భావన పెరిగి, వ్యక్తిగత ఆస్తి అనే భావన పుట్టి, అంతకు ముందున్న సమానత్వ భావన కనుమరుగై, ధనికా-పేద సమాజ ఏర్పాటుకు దారితీసింది. 
3) పంటలను పెద్ద ఎత్తున పండించడానికి, పశువులను మచ్చిక చేసుకొన్నారు. పంటల ఉత్పత్తులను రవాణా చేయడానికి చక్రాల బండ్లు అందుబాటులోకి వచ్చి, వ్యాపార పుట్టుకకు దారితీశాయి. ఇలా ఈ యుగంలో మానవులు. ఆహార సేకరణ స్థాయి నుంచి, ఆహార ఉత్పత్తి స్థాయికి ఎదిగారు కాబట్టి, ఈ పరిణామాన్ని గార్డన్‌ చైల్డ్‌ “కొత్త రాతి యుగ విప్లవం” అన్నాడు. 

కొత్త రాతి యుగానికి చెందిన మొదటి దశ ఆవాసాలు గ్రానైట్‌ గుట్టల మీదనో, లేదా గుట్టల మీదున్న చదునైన ప్రదేశాల మీదనో, లేదా లోయల అడుగు భాగాల్లోనే ఉండేవి. కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి లోయ ప్రాంతంలో పారే మానేరు నదీ తీరంలో, తొగర్రాయి, కదంబాపూర్‌, పెద్ద బొంకూరు వంటి చాలా ఆవాసాలున్నాయి. ఇదే ప్రాంతంలో పారే పెద్దవాగు తీరంలో కూడా, బుడిగెపల్లి, పాలకొండ, కోలకొండ, దేవరపల్లి వంటి స్థలాల్లో, ఈ కొత్త రాతి యుగపు స్థావరాలున్నాయి. తొగర్రాయి ఆవాసంలో, పైకి పొడుచుకు వచ్చిన గ్రానైట్‌ రాతి గుట్టల దగ్గర, పనిముట్లను తయారుచేసే స్ధలం, లేదా పరిశ్రమ కనిపించింది. కదంబాపూర్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐజలో, గొడ్డళ్లను సానబట్టే రాళ్ళు చాలా కనిపించాయి. ఇలాంటి సానబట్టే రాళ్లు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే పెద్ద రేవళ్ల అనే గ్రామ పరిధిలో ఉన్న గుట్టపైన ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని వెల్గటూరు మండలంలో సానబండి అనే పేరుతో ఒక గ్రామమే ఉంది.

పనిముట్ల సాంకేతికతలో పురోగతి

కొత్త రాతి యుగంలో ముఖ్యంగా త్రిభుజాకారపు గొడ్డళ్లు, బాడిసలు, ఒడిసెల రాళ్లు, మద్దురాళ్లు, కలవాలు, పొత్రాలు, చెర్ట్‌తో చేసిన బ్లేడు, అర్ధచంద్రాకారపు పనిముట్లు వాడుకలో ఉండేవి. ఈ యుగం చివరి దశలో, బ్లేడు పనిముట్ల పరిశ్రమతో పాటు, రాగి, కంచు వన్తువులు మహబూబ్‌నగర్‌లోని చిన్నమారూరు, చాగటూరుల్లో లభించాయి. ఇలా లోహపు పనిముట్లు లభించడమనేది, బహుశా మహారాష్ట్ర మధ్య భారతదేశంలోని హరప్పా ఉత్తర తామ్ర శిలా యుగ సంస్కృతులతో సంబంధాల వల్ల అయ్యుండొచ్చని కొందరు చరిత్రకారులు భావించారు. మీసాల రాగి ఖడ్గాలు మెదక్‌ జిల్లాలోని రిమ్మన గూడెంలో లభించాయి. ఈ రాగి నిల్వల సంస్కృతి (Copper Hoard Culture) గంగానదీ తీర ప్రాంతం నుంచి తెలంగాణాకు విస్తరించిందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ రాగి కత్తులకు, ఇరాన్‌లో దొరికిన రాగి కత్తులకు పోలిక ఉండటం ఆధారంగా, అక్కడి ప్రజలే ఇక్కడికి కదిలి వచ్చారని, అల్చిన్‌ అనే చరిత్రకారుడు చెప్పాడు. ఈ ఇరు ప్రాంతాల వస్తు సంస్కృతి, ఖనన సంస్కృతుల మధ్య కూడా పోలికలున్నాయి అంటారు ఆయన.

సూక్ష్మ శిలా పరికరాలు
కొత్త రాతి యుగంలో మట్టి పాత్రలను, ప్రధానంగా చేత్తోనే చేసేవారు. బూడిద రంగు, లేదా లేత గోధుమ రంగు పాత్రలుండేవి. ఈ పాత్రలకు నలుపు, లేదా ఎరుపు నునుపు చేసిన పూత ఉండేది, ఎక్కువగా కెంపు రంగు అలంకారం ఉండేది. చిల్లుల జాడీలు, కుండలు కూడా ఈ యుగంలో వాడకంలో ఉండేవి. వాటి ఉపరితలాలు ముతకగా ఉండేవి. ఇలాంటి కుండలకు, తొలి సింధూ నాగరికతకు చెందిన కుండలతో దగ్గరి పోలికలున్నాయి. అలాగే, బెలూచిస్తాన్‌, తొలి హరప్పా నాగరికతకు చెందిన కుండలతో కూడా పోలిక కలిగి ఉన్నాయి. కొన్ని చోట్ల బూడిద రంగు, లేత పసుపు రంగు గల పాత్రలను చక్రం మీద తయారుచేశారు. అవి మహారాష్ట్రలోని తామ్ర శిలా యుగానికి చెందిన జోర్వే పాత్రలతో సామ్యాన్ని కలిగి ఉన్నాయి. జోర్వే పాత్రలు క్రీ.పూ. 1400-1050 మధ్య కాలానికి చెందినవి. TSPSC Group 3 Telangana History notes in telugu 

ఆర్థిక వ్యవస్థ లక్షణాలు

కొత్త రాతి యుగపు ఆర్థిక వ్యవస్థ,పశుపోషణ, వ్యవసాయం మీద ఆధారపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉట్నూరు వంటి ప్రదేశాల్లో వెలుగు చూసిన బూడిద కుప్పలు, కొన్ని అడవి జంతువుల దొడ్లు, లేదా పశువుల్ని మందగా ఉంచిన కొట్టాలకు నిదర్శనాలని తెలిసింది. పశువుల పేడ కుప్పలను ఒక కర్మకాండలాగా దహనం చేయడం వల్ల, బూడిద కుప్పలేర్పడ్డాయని అల్చిన్‌ చెప్పాడు. తవ్వకాల్లో బయటపడిన  అవశేషాల ద్వారా, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు, పిట్టలను ఆనాటి మానవులు మచ్చిక చేసుకొన్నారని తెలిసింది. కొన్ని కొత్త రాతి యుగపు ఆవాసాల్లో, పశుపోష్ష ప్రాధాన్యాన్ని తెలిపే మూపురపు ఎద్దుల టెర్రకోట (కాల్చిన మట్టి) బొమ్మలు, రాతి బొమ్మలు, రాతి చిత్రలేఖనాలు గుహ చిత్రాలు - రాచకొండ, నల్గొండ జిల్లా వెలుగుచూశాయి. ఈ యుగపు రంగు చిత్రాలు, రేఖా చిత్రాలు కరీంనగర్‌ జిల్లాలోని బూదగవి, వరంగల్‌ జిల్లాలోని పాండవుల గుట్ట, నల్గొండ జిల్లాలోని రాచకొండ, ఖమ్మం జిల్లాలోని నల్లముడి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుప్పడ్‌ గట్టు, దొంగల గట్టు, తదితర ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఈ యుగపు ఎద్దుల చిత్రాలు వంపు తిరిగిన కొమ్ములు, మూపురాలు, పొడవాటి శరీరాలతో చాలా అందగా కనిపిస్తాయి. బాణాలు పట్టుకొన్న మనుషులు వాటి పక్కన కనిపిస్తారు. కొన్ని చోట్ల మూపురపు ఎద్దులు ఢీకొంటున్నట్లు చిత్రించబడ్డాయి. 

కొన్ని కొత్త రాతియుగపు స్థిర ఆవాసాల్లో లభించిన గింజల అవశేషాలను బట్టి, ఆ కాలపు ప్రజలు ప్రధానంగా జొన్నలు, రాగులు, పప్పులు-(పెసలు, మినుములు, ఉలవలు), వడ్లు పండించేవారని తెలుస్తోంది. పంటలను ప్రధానంగా వర్షాధారంగానే పండించేవారు.

మృత సంస్కార విధానం (Prehistoric Period Mortuary procedure)

కొత్త రాతి యుగంలో చనిపోయిన వారి (శవం) తలను ఉత్తరం వైపు పెట్టి, ఖననం చేసేవారు. నాగార్జునకొండలో ఆవాస ప్రాంతంలోనే, ఇద్దరు శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు వెలుగుచూశాయి. తెలంగాణాలో పలుచోట్ల కొత్త రాతియుగపు ప్రాంతాలు అయో యుగంలోకి చొచ్చుకొచ్చాయి. TSPSC Group 4 Telangana History notes in telugu

రాక్షస గూళ్ళ యుగం - పరిణామ ప్రక్రియలో తొంగిచూచిన మార్పులు

క్రీపూ. 1500 సంవత్సరాల నుంచి, క్రీశ. 300 సంవత్సరాల మధ్య తెలంగాణాలోని ప్రజలు, చనిపోయిన వారి అస్థిపంజరాలను మట్టి శవపేటికలో గాని, రాతి గూడులో గాని పెట్టి, పూడ్చి, ఆ గూడు చుట్టూ పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు. కొన్ని చోట్ల గూడు నిర్మాణంలో వాడిన రాళ్లు కూడా భారీ పరిమాణంలో ఉన్నాయి. కాబట్టి, ఈ యుగాన్ని రాక్షసగూళ్ల యుగం లేదా పెద్ద రాతియుగమని, ఈ యుగంలో మొదటిసారిగా ఇనుప వస్తువులను విరివిగా వాడారు కాబట్టి, అయో యుగమని పిలుస్తారు. స్థానిక ప్రజలు పాండవుల గూళ్లు, వీర్లపాడులని కూడా ఈ గూళ్లని పిలుస్తారు. Telangana History study material in telugu

రాక్షస గూళ్ల నిర్మాణం, రకాలు, ప్రయోజనం

రాక్షస గూళ్లు మల్లూరు గుట్ట మీద, వరంగల్‌ జిల్లా 

మనిషి చనిపోయినా ఆత్మ జీవించి ఉంటుందని, అది గ్రామాల్లోకి వచ్చి, ప్రజలకు హాని చేయకుండా సమాధి వరకే పరిమితమై ఉండటానికి, చనిపోయిన వ్యక్తి బతికున్నప్పుడు. వాడిన పనిముట్లతో పాటు, అతనికి ఇష్టమైన ఆహార పదార్థాలను కుండలో పెట్టి, సమాధిలో నిక్షిప్తం చేసేవారు. చాలా సందర్భాల్లో చనిపోయిన వ్యక్తికి ప్రియమైన పెంపుడు జంతువులను కూడా అతనితోపాటు ఖననం చేసేవారు. ఇలాంటి రాక్షస గూళ్లు ప్రపంచమంతా కనిపించినప్పటికీ, ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. భారతదేశమంతటా ఈ రాక్షస గూళ్లు ఉన్నప్పటికీ, దక్కన్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణాలో మరీ ఎక్కువ. గుట్టల పైనుండే సమతల ప్రదేశాల్లోనూ, లోయల్లోనూ, నీటి వనరుల దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న ఒక రాక్షస గూడు సమాధి, దేశంలోనే మొదటిదని తేలింది. దానిలో దొరికిన ఆహారపు గింజలు, ఇప్పటికీ 4,250 సంవత్సరాల కిందటివని శాస్త్రీయ పరీక్షలు నిర్ధారించాయి.

రాక్షస గూళ్లు కొన్ని అప్పటికప్పుడు నిర్మించినవి కాగా, మరి కొన్నేమో, మనిషి బతికున్నప్పుడే నిర్మించుకొన్నవి. రాక్షస గూళ్లల్లో కొన్ని కుటుంబ సమాధులు, మరి కొన్ని సామూహిక సమాధులు కూడా ఉన్నాయి. Telangana history notes in telugu

ఈ యుగపు సమాధులను మొదటి తరహా సమాధులు, రెండవ తరహా సమాధులని విభజించొచ్చు. చనిపోయిన మనుషులను అలాగే సమాధి చేస్తే, అలాంటి సమాధులను మొదటి తరహా సమాధులని, అలా కాకుండా శవాలను కాల్చిన లేదా దహనం చేసిన తరవాత, మిగిలిన అవశేషాలను (ఎముకలను) సమాధి చేస్తే, వాటిని రెండో తరహా సమాధులని నిర్వచించొచ్చు.

రాక్షస గూళ్లను నిర్మాణం ఆధారంగా, నాలుగు రకాలుగా విభజించొచ్చు. అవి

  1. గుంత సమాధులు (Pit burials or cairns)
  2. గూడు సమాధులు (Cist burials)
  3. గది సమాధులు (Dolmens)
  4. గుహ సమాధులు (Rock-cut burials)

గుంత తవ్వి, అందులో మట్టి శవపేటికలో గాని, దీర్ఘచతురస్రాకారపు రాతి పలకల గదిలో గాని, అస్థిపంజరాన్ని పెట్టి, పూడ్చి, దాని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద రాళ్లను నిలిపితే, దాన్ని గుంత సమాధి అంటారు. దీర్ఘచతురస్రాకారపు రాతి గదిని పూర్తిగా పూడ్చివేయకుండా, ఒక మూరెడు ఎత్తు భూమి ఉపరితలం పైకి కనిపించే విధంగా పూడ్చి, దాని మీద ఒక రాతి సల్పను పెడితే, అది గూడు సమాధి. రాతి సమాధి మొత్తం ఉపరితలం మీదనే ఉంటే, అది గది సమాధి (Dolmen)కొండల్లో గుండ్రటి గుహలను తొల్చి, వాటిల్లో శవాలను పెట్టి  కప్పు వేస్తే అవి గుహ సమాధులు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉప్పలపాడు గుంత సమాధిలో పడవ అకారపు శవ పేటిక అధరాలు లభ్యం కాగా, చిన్నమరూర్ గూడు సమాధిపై తడిక గుర్తులు కనిపించాయి. 

మొదటి రెండు రకాల సమాధులు ఎక్కువగా కృష్ణానది ఎడమ ఒడ్డున కనిపిస్తే, గది సమాధులేమో గోదావరి  కుడి ఒడ్డున ఎక్కువగా కనిపిస్తాయి. గుహ సమాధులు కూడా కొన్ని గోదావరి తీర ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. రాతి పలకల గూడు కొన్నిసార్లు స్వస్తిక్‌ లేదా "+" ఆకారంలో కూడా కనిపిస్తున్నది. గూడు నిర్మాణంలో వాడిన నాలుగు రాతి సల్పల్లో, ఏదో ఒక దానికి, ముఖ్యంగా తూర్పువైపు రాతి పలకకు, ఒక్కోసారి రంధ్రం కనిపిస్తుంది. ఆ రంధ్రం చనిపోయిన మనిషి ఆత్మ సంచరించేందుకో, లేదా సమాధి క్రతువులు నిర్వహించినప్పుడు, ఆహార పదార్థాలు, ఇతరత్రా వస్తువులు సమాధి గూడు లోపల పెట్టదానికో, ఉద్దేశించుంటుందని భావిస్తున్నారు. రంధ్రం కాకుండా, కొన్నిసార్లు రాతి తలుపుల మాదిరి, రాతి చెక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటివి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఉన్న ఏటూరునాగారం అడవుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే అడవుల్లోని మల్లూరు గుట్టపై ఉన్న గది సమాధులైతే, నిర్మాణ కళలో ఉచ్చస్థితిని అందుకొన్నాయి. వాటి భారీ పరిమాణం, వాటి చుట్టూ నున్నగా చెక్కి నిలిపిన రాతి కంచెలు, సమాధి గదుల లోపల పల్నాటి సున్నపురాయి తొట్టెలు, సమాధి అరుగులపైన రోళ్లు, వందలాది సమాధుల మధ్యలో ఉన్న మూడు కోట గోడలు, ఆ కాలపు పట్టణీకరణను, నగర రాజ్య మూలాలను చూసి, ఎవరైనా ఆశ్చర్యచకితులౌతారు.

తెలంగాణాలోని రాక్షస గూళ్ల దగ్గర రకరకాల నిలువు రాళ్లు కూడా కొన్నిచోట్ల కనిపిస్తాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణలో, నల్గొండ జిల్లాలోని ఫణిగిరి, ఆలేరు ప్రాంతంలో, వరంగల్‌ జిల్లాలోని బొమ్మెర, లేబర్తి, మెదక్‌ జిల్లాలోని శివారు వెంకటాపూర్‌ మొదలైన ప్రదేశాల్లో నిలువు రాళ్లు కనిపించాయి. ఇవి సమాధి ఉనికిని తెలియచేస్తాయి. ఇవి, గజం నుంచి ఐదు గజాల ఎత్తు వరకు ఉంటాయి. నిలువు రాళ్లు వరుసగా, సమాంతర వరుసలుగా కూడా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కనిపిస్తాయి. మానవాకార శిలలు, శిలువ ఆకార శిలలు, వరంగల్‌ జిల్లాలోని జానంపేట, మంగపేట, ఖమ్మం జిల్లాలోని గుండాల, కాంచనపల్లి మొదలైన గోదావరి లోయ ప్రాంతంలో మాత్రమే గృహ సమాధుల (dolmenoid cist burials) దగ్గర కనిపించాయి. శిలువ రాళ్లు మాత్రం ప్రపంచంలో మరెక్కడా కనిపించలేదు. ఈజిస్ట్‌లోని పిరమిడ్‌ రాళ్లపై శిలువలను పట్టుకొన్న దేవతలను చిత్రించారు. కాబట్టి ఆ మధ్యధరా ప్రాంతంతో తెలంగాణాకు సంబంధం ఉన్నట్లు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. గోదావరి తీరంలో ఉన్న పోచంపాడు (నిజామాబాద్‌ జిల్లా), కాంచనపల్లి మొదలైన చోట్ల, దీర్ఘచతురస్రాకార వేదికలు కనిపించాయి. అవి, శవాన్ని రాబందుల వంటి పక్షులకు ఆహారపు వేదికలు గాని, పనిముట్లు తయారుచేసుకొనే అరుగులు గాని అయ్యుంటాయని భావిస్తున్నారు. (Prehistoric Period Study material in telugu)

గూళ్ల తవ్వకాల్లో బయల్పడ్డ వివిధ వస్తువులు, వాటి సాంస్కృతిక, సామాజిక ప్రాధాన్యత

రాష్ట్రంలోని ప్రతి మండలంలో రాక్షస గూళ్లు ఉండగా, పురావస్తు శాఖ వారు సుమారు యాభై సమాధులను తవ్వారు. వాటిల్లో బయల్పడిన వస్తువులు, ఆ యుగపు మనుషుల సాంస్కృతిక విశేషాలను తెలియచేస్తున్నాయి. (TSPSC Prehistoric Period notes in telugu)

అంత్యక్రియలకై వాడిన పలురకాల పాత్రలు, కుండలు, వాటి మూతలు, గుండ్రటి మూకుళ్లు, ముక్కాలు పీటలు మొదలైనవి ఎన్నో లభ్యమయ్యాయి. వాటిపై గోరు నొక్కులు, వేలి ముద్రలు, తాడుతో ఒత్తిన డిజైన్లు రేఖా చిత్రాలు, కుమ్మరి చిహ్నాలు (Graffiti marks) కనిపించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్నమారూరులో, కుండపై తెలుపు రంగు పూత కనపడింది. ఖమ్మం జిల్లాలోని రుద్రమకోటలో గుండ్రటి మట్టి కుండల కింద నాలుగు కాళ్లున్నాయి. అంటే, మట్టి పాత్రల తయారీలో, ఈ యుగం మానవులు చాలా ప్రగతిని సాధించారని చెప్పొచ్చు.

ఎరుపు-నలుపు రంగు పాత్రలు, పూర్తి నలుపు రంగుతో మెరిసే పాత్రలు, ఈ యుగంలో ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. ఇవి ఎక్కువగా సమాధుల్లో వాడే పాత్రలుగా పేరొందాయి. అయితే, ఇవి ఒండ్రు మట్టితో, కుమ్మరి సారె (చక్రం) మీదనే తయారయ్యాయి. ఇక, నునుపు లేని ముతక పాత్రల్లో చెప్పుకోదగినవి, పెద్ద పెద్ద కుండలు, బానలు, శవ పేటికలు. నలుపు-ఎరుపు రంగులు ఒకే పాత్రకు ఒక్కో వైపుకు కనిపించడానికి కారణం, అలాంటి పాత్రలను ఒకదానిపై ఒకటి బోర్లించి కాల్చడం వల్ల, పై భాగం నలుపుగా, కింది భాగం ఎరుపుగా తయారయ్యాయి.

అలంకరణకు ఉపయోగించిన మట్టి పూసలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వీరాపురంలో లభించాయి. హైదరాబాద్‌ దగ్గరున్న మౌలాలీలో మట్టి గాజులు లభించాయి. మట్టి బొమ్మలు చాలా చోట్ల వెలుగులోకి వచ్చాయి. నిజామాబాదు జిల్లాలోని పోచంపాడులో కుక్కలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉప్పేరులో, కొమ్ములు తిరిగిన పొట్టేలు, శేరుపల్లిలో పొడవాటి కొమ్ముల దున్నపోతు, కరీంనగర్‌ జిల్లాలోని పెద్ద బొంకూరులో దున్నపోతు తల, మొదలైన మట్టి బొమ్మలు లభించాయి. వీటిని ఆనాటి మానవులు తమ ప్రయోజనాల కోసం మచ్చిక చేసుకున్నారని తెలుస్తున్నది. దున్నపోతులను వ్యవసాయం, రవాణా అవసరాలకై వాడుకొని ఉంటారు. హైదరాబాద్‌ శివార్లలో ఉన్న హస్మత్‌ పేటలో, నాగలి కర్రు వంటి వస్తువు దొరకడం, ఇందుకొక నిదర్శనం.

ఇంచుమించు ప్రతి సమాధిలో ఇనుప వస్తువులున్నాయి. వేట, యుద్దాల్లో వాడిన చిన్నపాటి కొడవళ్లు, గొడ్డళ్లు బల్లెపు మొనలు, కత్తులు, ఖడ్డాలు, బల్లెంలు, బ్లేడ్లు, బాడిసలు, ఉలులు, త్రిశూలాలు, గుర్రపు నాడాలు, ఏనుగును అదిలించే అంకుశాలు, పలుచోట్ల దొరికాయి. వీటి వల్ల, గుర్రాలు, ఏనుగులను మచ్చిక చేసుకొని, వాటిని రవాణా, వేట, యుద్ధాల్లో ఉపయోగించుకొన్నారని అర్ధమౌతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్నమారూరులో దొరికిన చేపలు పట్టే గాలాలు, ఆనాటి మనుషుల ఆహార ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నాయి. రాగి కత్తులు, కత్తి పిడులు, గంటలు, గాజులు, ఉంగరాలు, సూదులు పలు సమాధుల్లో దొరికాయి. వెండి, బంగారు వస్తువులు కూడా దొరికాయి. కొన్ని చాలా స్వల్పంగా మాత్రమే. కరీంనగర్‌ జిల్లాలోని కదంబాపూర్‌లో బంగారు పూసలు, చెవి పోగులు, నల్గొండ జిల్లాలోని రాయగిరిలో వెండి, బంగారు పూసలు, చెవి పోగులు, ఖమ్మం జిల్లాలోని పోలిచెట్టి చెరువుగడ్డలో బంగారు ఉంగరం లభించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని శేరుపల్లి, చిన్నమారూరు, పెద్దమారూరుల్లో లభించిన జాతి రాళ్ళైనా కెంపు (agate), కురువిందం (carnelian), సూర్యకాంతమణి (jasper), పద్మరాగమణి (amethyst), స్పటిక రాళ్లు వివిధ ఆకారాల్లో ఆభరణాలుగా వాడినట్లు కనిపించాయి. పోచంపాడు, చిన్నమారూరుల్లో, కొమ్ముతో చేసిన దువ్వెనలు, ఖమ్మం జిల్లాలోని నెల్లిమిల్లిలో దంతపు పూసలు, గాజులు, హస్మత్‌పేటలో ఎముకలతో చేసిన పూసలు లభించాయి.

పలు రాక్షస గూళ్లలో, ప్రత్యేకించి కృష్ణానది ఒడ్డున మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న వీరాపురంలోని సమాధుల్లో అనేక రకాల ఆహార ధాన్యాల ఆధారాలు లభించాయి. వాటిల్లో ముఖ్యమైనవి,, వరి, బార్లి, కొర్రలు వంటి తృణ ధాన్యాలు, ఉలవ, బఠాణీ, మినుమ్యు.కంది, చిక్కుడు వంటి పప్పు లేదా కాయ ధాన్యాలు, రేగుపండ్లు, ఉసిరికాయలు మొదలైనవి. ఇదే జిల్లా శేరుపల్లి, ఉట్నూరుల్లో వరి పౌష్టికాహార ధాన్యంగా వెలుగు విశ్వవిద్యాలయంలోని సమాధిలో రాగులు బయటపడ్డాయి.

చారిత్రక యుగ తొలి వెలుగులు, పునాదులు

అయో యుగంలో ప్రజలు ప్రధానంగా పశుపోషణ, వ్యవసాయం చేసి, ధాన్యాలను నిల్వచేసుకొన్నారు కాబట్టి నిరంతరం ఆహార సేకరణకై పాటుపడాల్సిన అవసరం లేదు. కాబట్టి, వారికి ఖాళీ సమయం దొరికింది. ఆలోచనా వికాసం జరిగి కళాతృష్ణ పెరిగి, చిత్రకళను నేర్చుకొన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో  కొండ గుహల్లో బొమ్మలు గీశారు. వరంగల్‌ జిల్లాలోని నర్సాపూర్‌, మెదక్‌ జిల్లాలోని ఎద్దనూర్‌, శివారు వెంకటాపూర్‌, వర్గల్‌, ఖమ్మం జిల్లాలోని రామచంద్రాపురం, నల్లముడి, రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ముడుమల మొదలైన చోట్ల ఉన్నాయి. TSPSC Telangana history notes

ఈ గుహల్లో ముఖ్యంగా వేటాడే చిత్రాలు, కత్తి, దాలు, ధనస్సు, బాణం, బల్లెం మొదలైన ఆయుధాలు పట్టుకొని తలపడుతున్న యుద్ధ వీరులు, గుర్రాన్ని ఏనుగును స్వారీ చేస్తున్న మనుషులు, కుక్క మూపురపు ఎద్దు, పశువులు, జింకలు, పక్షులు, చిరుత, కుందేలు, నక్క తాబేలు, ఎండ్రకాయలు మొదలైనవి చిత్రించబడ్డాయి. గుహ రాళ్లపై చెక్కిన రేఖా చిత్రాల్లో, ప్రధానంగా త్రిశూలం, చక్కంలో నుంచి దూరిపోయే త్రిశూలం, బల్లెం కనిపిస్తాయి. కొన్ని చోట్ల కాళ్లు, చేతులు మాత్రమే ఉన్న మానవాకృతి గల బొమ్మలు (anthropomorphic figures) కనిపించాయి. ఇవి ఆనాటి ప్రజల గణనాయకుణ్ణి గాని, పూర్వీకులను గాని సూచిస్తాయేమో! ముడుమలలోని గుహలో నలుపు రంగుతో అమ్మతల్లి దేవతను (Mother Goddess), చేతులు పైకెత్తి, కాళ్లు చాచినట్లు, రొమ్ములు జారినట్లు చిత్రించారు. ఆచిత్ర దేవత సంతానం, పాడి పంటలనిచ్చే దేవతగా కొలువబడి ఉంటుంది. ముడుమలలోని మరో చిత్రలేఖనంలో, ఒక ఆవు తోకను ఎత్తి, జననేంద్రియాలను ప్రదర్శిస్తున్నట్లుగా చిత్రించబడింది. పశుపోషణ ప్రధాన వృత్తిగా గల ఆనాటి ప్రజలు, ఆవును కూడా పశు సంపద వృద్ధి కోసం గోమాతగా పూజించారని, ఆ చిత్రం వల్ల అర్ధమౌతుంది. పాడి పంటల సమృద్ధే తరవాత సమాజం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధాన హేతువైంది. 

పశుపోషణ, భూసాగు అనే కొత్త వృత్తుల వల్ల ఆహారం సమృద్ధిగా లభించి, సమాజం కూడా  విస్తరించింది. విస్తరించిన సమాజాన్ని నియంత్రణ చేయడానికి రాజకీయ వ్యవస్థ అవసరమైంది. అలా తెలంగాణాలోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో "అశ్మక" అనే జనపదం (రాజ్యం) ఏర్పడింది. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి దానిలాగే ఉత్తర తెలంగాణాలోని గోదావరి లోయలో మరికొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఏర్పాటయ్యాయి. ఆ రాజ్యాల పేర్లు స్పష్టంగా తెలియకున్నా కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాలలో జరిపిన తవ్వకాల్లో లభించిన నాణేల మీద ఆ రాజుల పేర్లు స్పష్టంగా తెలుస్తాయి. అవి గోబద, సిరి నారన, సిరి కంవాయ, సిరి సమపగో, 'సమగోప' నాణేల మీద 'సాతవాహన' అనే పేరు పునర్ముద్రించబడింది కాబట్టి సమగోప రాజును తొలగించి, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సామ్రాజ్యం (శాతవాహనులది) ఏర్పాటైంది.(Telangana History Prehistoric Period Notes in telugu)

Ref: Telangana History Telugu Academy Book 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)