వాకాటకులు

Adhvith
0
Ancient History of Vakataka dynasty in Telugu

Vakataka dynasty Notes in Telugu

శాతవాహనంతర యుగం - వాకాటకులు

క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య భాగం నుంచి ఆరో శతాబ్దం మధ్య భాగం వరకు దక్కన్‌ను పరిపాలించిన రాజవంశాలన్నింటిలో వాకాటకులకు ప్రత్యేకమైన స్థానముంది. దక్కన్‌ సంస్కృతిని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన రాజవంశం వాకాటకులది. శాతవాహన సామ్రాజ్యం పతనమయిన తరవాత మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో అభీరులు, తూర్పు బీరార్‌ ప్రాంతంలో వాకాటకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. కొద్ది కాలంలోనే అభీర రాజ్యం బలహీనపడగా, వాకాటకులు బలపడి శాతవాహనులకు వారసులుగా అధికార విస్తరణ చేశారు. బీరార్‌ ప్రాంతంలో శాతవాహనులకు సామంతులుగా ఉండి, తరవాత కాలంలో స్వతంత్రులయ్యారు. ఉత్తరాన గుప్త, నాగ వంశాలతో, తూర్పు దక్కన్‌లో విష్ణుకుండులతో, పశ్చిమ దక్కన్‌లో కదంబులతో వైవాహిక సంబంధాలనేర్పర్చుకొన్నారు. వాకాటక సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా, తూర్పున ఛత్తీస్‌గడ్‌, ఉత్తరాన మాళవ, గుజరాత్‌, బుందేల్‌ఖండ్‌, బాఘేల్‌ఖండ్‌, దక్షిణాన తుంగభద్రా నదీ తీరం వరకు వ్యాపించింది. పూర్వపు నిజాం రాజ్యంలోని నాందేడ్‌, ఔరంగాబాద్‌ జిల్లాలు, తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లా లాంటి కొన్ని ప్రాంతాలను, వాకాటకుల్లోని వత్సగుల్మ శాఖ రాజులు పాలించారు. విదర్భ, బాఘేల్‌ఖండ్‌ ప్రాంతం వాకాటకులకు ప్రధాన రాజకీయ కేంద్రమైంది. తొలి వాకాటకుల శాసనాల ప్రకారం, 'పురికా పట్టణం, 'చనక' వీరి మొదటి రాజధానులు. తరవాత, వార్థా సమీపంలోని ప్రవరపురం (పొనార్‌) రాజధానైంది. క్రీ.శ. 250 నుంచి క్రీ.శ. 550 వరకు మూడు శతాబ్దాలు, వాకాటకులు సుదీర్హమైన పాలనను సాగించారు. దక్కన్‌, మధ్య భారత ప్రాంతంలో రాజకీయ స్థిరత్వాన్ని కల్పించి, శాంతిభద్రతలను చేకూర్చారు. మత విషయంలో ఉదారత్వాన్ని ప్రదర్శించారు. విద్య, సాహిత్యం, కళలను పోషించారు.

చారిత్రక ఆధారాలు Historical Monuments of Vakataka dynasty
శాసనాలు
వాకాటక చరిత్రకు గల శాసనాధారాల్లో కొన్ని మాత్రమే రాతి పలక శాసనాలున్నాయి. మిగతావన్నీ రాగి రేకులపై చెక్కిన శాసనాలే. ఇందులో కొన్ని మాత్రమే వత్సగుల్మ (బాసిం) శాఖకు చెందినవి కాగా, ఎక్కువగా నందివర్ధన-ప్రవరపుర శాఖకు చెందినవిగా ఉన్నాయి. వాకాటకుల శాసనాలు సంస్కృత భాషలో, బ్రాహ్మి లిపిలో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా దాన శాసనాలే ఉన్నాయి. ఇవి సన్యాసులకు, దేవాలయాలకు, బ్రహ్మణులకు, అధికారులకు దానం చేసిన భూముల వివరాలను తెలియచేయడమే గాక, వీటి నుంచి రాజుల వంశ చరిత్ర, భూదాన వివరాలు, దాతలు, దానగ్రహీతలు, దానం చేయబడ్డ గ్రామాల వంటి వివరాలు తెలుస్తున్నాయి. దాన గ్రహీతల వంశవృక్షం, వారి స్వస్థలం, వారికి గల పాండిత్య విశేషాలను కూడా, దాన శాసనాల్లో పేర్కొనేవారు.

నందివర్థన - ప్రవరపుర శాఖ రాజుల శాసనాలు
  1. రెండో రుద్రసేనుడు తన ఐదవ రాజ్య సంవత్సరంలో వేయించిన నాలుగు మంథాల్‌ తామ్ర శాసనాలు. ఇవి రుద్రసేనుడి వైష్ణవ మతాభిమానాన్ని తెలియచేస్తున్నాయి. 
  2. రెండో ప్రవర సేనుడి ఇండోర్‌, యవత్మల్‌, మస్తోద్‌, మంథాల్‌ శాసనాలు - 19 మంది బ్రాహ్మణులకు భూదానం చేస్తూ, మసోద్‌ శాసనాలను వేయించాడు. ఇదివరకే దానం చేయబడ్డ భూమిని, వారికి తిరిగి దాఖలుపరుస్తూ, యవత్మల్‌ శాసనాలను వేయించాడు.
  3. రెండో పృథ్వీసేనుని మాంథాల్‌, మహర్జారీ శాసనాలు.
  4. 1912 లో రెండో ప్రవరసేనుని పాలనా కాలంలో ప్రభావతి గుప్త వేయించిన మిరేగాంవ్‌ శాసనాలు, పూనా సమీపంలో దొరికాయి. వాకాటకుల చరిత్రపై ఈ శాసనాలు కొత్త వెలుగును ప్రసరింపచేశాయి. ప్రభావతి గుప్త రెండో రుద్రసేనుని భార్య అని, గుప్త వంశ రాజు రెండో చంద్రగుప్తుని కూతురని తెలియవచ్చింది. ఇందులో తాను వాకాటక మహారాజశ్రీ దామోదరసేన, ప్రవరసేన జననిగా పేర్కొంది. గుప్త వంశ రాజుల, వాకాటక వంశ రాజుల సమకాలీనత ఆధారంగా, వాకాటకుల కాల నిర్ణయం చేయడానికి ఈ శాసనం ప్రధాన ఆధారంగా ఉపయోగపడింది.
వత్సగుల్మ శాఖ
  • వాకాటక రాజు రెండో వింధ్యాశక్తి 37 వ రాజ్య సంవత్సరంలో వేయించిన బాసిం శాసనాలు విదర్భలోని అకోలా జిల్లాలో 1939 లో దొరకడంతో, వాకాటకుల్లోని వత్సగుల్మ అనే మరొక శాఖ గురించి మొదటిసారి తెలియవచ్చింది. ఈ శాసనం లభించే వరకు వాకాటకుల్లో ఒకే ఒక ప్రధాన శాఖ మాత్రమే ఉండేదని పండితులు భావించారు. మొదటి ప్రవరసేనుడు మరణించిన తరవాత, వాకాటకుల్లో నాలుగు శాఖలేర్పడ్డాయని, గౌతమీపుత్రుడు నందివర్ధన-ప్రవరపుర శాఖను, సర్వసేనుడు వత్సగుల్మ శాఖను స్థాపించగా, మిగిలిన రెండు శాఖల గురించి తెలియడం లేదని ఆచార్య వి.వి.మిరాశీ పేర్కొన్నారు.
దేవసేనుని హిస్సే-బొరాలా శిలా శాసనం
  • అకోలా జిల్లాలోని బాసిం సమీపంలో ఈ శాసనం లభించింది. దేవసేనుని అధికారి ఆర్య స్వామిల్లదేవుడు సుదర్శన సరోవరాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. దేవసేనుని ఐదో పాలనా సంవత్సరంలో బీదర్‌ శాసనాలను వేయించాడు. బీదర్‌ సమీపంలోని ఒక గ్రామాన్ని దానం చేస్తూ, ఈ శాసనాన్ని వేయించాడు.
ప్రభావతి గుప్త కాలం నాటి రామ్‌టెక్‌ శాసనం
  • ప్రభావతి గుప్త దాతృత్వాన్ని ప్రశంసిస్తూ, ఆమె కుమారుడు, పేరు తెలియని ఆమె కూతురు ఈ శాసనాన్నివేయించారు.
నాణేలు
వాకాటకుల సమకాలీన పొరుగు రాజ్యాలైన కదంబులు, విష్ణుకుండులు, ఇక్ష్వాకులు కూడా తమ సొంత నాణేలను విడుదల చేశారు. కాని, వాకాటకులు మాత్రం తమవైన సొంత నాణేలను ముద్రించలేదని తెలుస్తుంది. ఇప్పటి వరకుక్ వారి నాణేలు అతి తక్కువగా దొరికాయి. కాబట్టి, సమకాలీన రాజ వంశాలు ముద్రించిన నాణేలనే చెలామణికి అనుమతించారని భావించొచ్చు. గుప్త రాజులతో, విష్ణుకుండులతో గల మైత్రీ బంధం వల్ల, వారి నాణేలనే ఉపయోగించారని చెప్పొచ్చు. శక క్షాత్రపుల వెండి నాణేలు, వాకాటక రాజ్య భూభాగంలో విడిగాను, రాసులుగాను కూడా దొరికాయి. దీన్నిబట్టి, వాకాటకులు శక క్షాత్రప నాణేల చెలామణిని తమ రాజ్యంలో అనుమతించారని పండితుల అభిప్రాయం.
కార్షాపణాలుగా పిలువబడే వెండి విద్దాంక నాణేలు (punch marked coins) మన దేశంలో మధ్య యుగం వరకు చెలామణిలో ఉందేవి. కాబట్టి, వాకాటక రాజ్యంలో శాతవాహనుల నాణేలు, క్షాత్రపుల నాణేలు లభించడాన్ని బట్టి, వాకాటకుల కాలం వరకు కూడా వీటి చెలామణి జరిగిందని వి.యస్‌.అగ్రవాలా అభిప్రాయపడ్డారు. గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్‌ (క్రీ.శ. 400-411), ప్రజలు కౌరీలను (గవ్వలు) మారక ద్రవ్యంగా వాడుతున్నారని పేర్కొన్నాడు.
నందివర్ధన - ప్రవరపుర వాకాటక శాఖకు చెందిన రాజుల నాణేలను కొన్నింటిని ఇటీవల వార్థా సమీపంలో పొనార్‌ వద్ద కనుక్కోవడం జరిగిందని అజయమిత్ర శాస్త్రి ప్రకటించారు. ఈ నాణేలను చౌక లోహాలతో ముద్రించారు. రెండో పృథ్వీసేనుని రాగి నాణెంపై బ్రాహ్మి లిపిలో 'శ్రీ మహారాజ పృథ్వీ' అని ఉంది. మరొక రాజు నరేంద్రసేనుడిదిగా భావించే నాణెంపై 'శ్రీ రేంద్ర' అని బ్రాహ్మి లిపిలో ఉంది.

భౌతిక అవశేషాలు
పౌొనార్‌, మన్సార్, నందపూర్‌, రాంటెక్‌, నగర మొదలయిన చోట్ల వాకాటకుల కాలం నాటి భౌతిక అవశేషాలు బయటపడ్డాయి. 1967 లో పౌనార్‌ (ప్రవరపురం) వద్ద నాగపూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాచీన భారతదేశ చరిత్ర, పురావస్తు శాఖ విభాగం వారు తవ్వకాలు నిర్వహించగా అనేక చారిత్రకాంశాలు వెలుగులోకి వచ్చాయి. వారి భౌతిక సంస్కృతి తెలియవచ్చింది. పౌనార్‌లో వాకాటకుల కంటే పూర్వమే క్రీ.పూ. 1000 నాటికే జనావాసం ఉన్నట్లు అజయ్‌మిత్రశాస్త్రి పేర్కొన్నారు. అయితే, వాకాటకుల కాలం నాటికి పౌనార్‌ రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిందని తెలుస్తుంది. ఇక్కడి తవ్వకాల్లో, ప్రాచీన కాలం నాటి విద్దాంక నాణేలు మొదలుకొని, ఆధునిక బొంస్లేల వరకు గల వివిధ రాజ వంశాల నాణేలు లభించాయి.
ప్రణాళికాబద్ధంగా నిర్మించిన భవనాలు, ఇంటి పైకప్పు పెంకులు, గుండ్రటి బావులు, నలుపు-ఎరుపు రంగు మట్టి పాత్రలు, వారు ఉపయోగించిన వివిధ రకాలైన పనిముట్లు, వస్తు సామగ్రి, ఆభరణాలు, తాయెత్తులు తవ్వకాల్లో దొరికాయి. దుర్గ శిల్పం (మంథాల్), కూర్చున్న కేవల నర్సింహుని శిల్పం, శేషళయన విష్టు, బుద్దుని విగ్రహాలు మొదలయినవి ఎన్నో శిల్పాలు లభించాయి. ఇవి ఆనాటి ప్రజల వేషధారణ, శిరోజాలంకరణ, సాంఘిక, మత విశ్వాసాలను తెలియచేస్తున్నాయి.
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన అజంతా వద్ద గల 16, 17 గుహల్లోని బుద్ధుని, బోధిసత్వుల చిత్రాలు, ఆనాటి కళలను తెలియచేస్తాయి. వీటిని వాకాటక రాజులు, వారి సామంతులు తొలిపించారు.

సాహిత్య ఆధారాలు
వాకాటకుల చరిత్రకు సాహిత్యాధారాలు కూడా ఉన్నాయి. పురాణాలు మత సంబంధమైన గ్రంథాలైనప్పటికి, ప్రాచీన భారతదేశపు వివిధ రాజ వంశాలు, వారి పాలనా కాలాన్ని పేర్కొంటున్నాయి. అష్టాదశ పురాణాల్లో వాయు, మత్స్య, విష్ణు, బ్రహ్మాండ, భాగవత పురాణాలైన ఐదింటిలో రాజ వంశానుక్రమణికలున్నాయి. వీటిని భవిప్య పురాణం ఆధారంగా చెప్పడం జరుగుతోంది. గుప్త వంశ ఆవిర్భావంతో పురాణాలు పేర్కొనే వివరాలు పరిసమాప్తమౌతాయి. వింధ్యకులు అనే రాజ వంశాన్ని వింధ్యాశక్తి స్థాపించాడని పురాణాలు పేర్కొన్నాయి. ఈ విధ్యంకులు కళంకిత యవనులని పురాణాలు పేర్కొన్నాయి. వింధ్యాశక్తి కుమారుడైన ప్రవరుడు సామ్రాజ్య విస్తరణ చేసి, నాలుగు అశ్వమేధ యాగాలను నిర్వహించాడని పురాణాలు పేర్కొన్నాయి.
దండి 'దశకుమార చరిత్ర'లోని 'విస్రుతచరితి'లో వాకాటక రాజ్య పతనం ఏ విధంగా జరిగిందో వివరంగా పేర్కొన్నాడు. వాకాటక రాజ్యం పతనమైన ఒక శతాబ్దం తరవాత దశకుమార చరిత్ర రాయబడినప్పటికి, వాకాటక రాజు హరిసేనుని తరవాత సామంత రాజులు చేసిన కుట్రలను, వాకాటక రాజుల బలహీనతలను గురించి పేర్కొనడం జరిగింది. రెండో చంద్రగుప్తుని కాలంలో జీవించిన కాళిదాసు రచనలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలను తెలియచేస్తున్నాయి. కాళిదాసు 'మేఘదూతం' కావ్యంలో పేర్కొన్న రామగిరి రాంటెక్‌గా మిరాశీ పండితుడు పేర్కొన్నాడు. వాకాటక రాజు రెండో ప్రవరసేనుడు రాసిన 'సేతుబంధం' కావ్యం కూడా ఆనాటి విషయాలను తెలియచేస్తుంది.

జన్మస్థలం Birth Place of Vakataka dynasty (Birth Place of Vakataka Dynasty)
వాకాటకుల జన్మస్థలాన్ని గురించి చరిత్రకారుల్లో అనేక వాదోపవాదాలున్నాయి. వీరి జన్మస్థలాన్ని నిర్ధారించే నిర్దిష్టమైన ఆధారాలేవి ఇంతవరకు లభించలేదు. ప్రధానంగా, వాకాటకులు ఉత్తరాది వారని, దక్షిణాది వారని రెండు అభిప్రాయాలున్నాయి.

ఉత్తర భారతదేశ వాదం
పురాణాల ఆధారంగా ఉత్తర భారతదేశంలోని బుందేల్‌ఖండ్‌-బాగేల్‌ఖండ్‌ (వింధ్య ప్రాంతం) వాకాటకుల జన్మస్థలమని డా॥ కె. పి.జయస్వాల్‌ అభిప్రాయపడ్డారు. బుందేల్‌ఖండ్‌లోని పన్నా సమీపంలోని కిలాకిలా నదీ తీరం వీరి జన్మస్థలమని పేర్కొన్నారు. రూన్సీ జిల్లాలోని 'బాగట్' లేదా 'వాకాట్ అనే  గ్రామం నుంచి 'వాకాటక' అనే వంశం పేరొచ్చిందని వివరించారు. అలహాబాద్‌ శాసనంలో సముద్రగుప్తుడు ఓడించినట్లు పేర్కొన్న ఆర్యావర్తం రాజుల్లోని రుద్రదేవుడు వాకాటక రాజు రుద్రసేనుడేనన్నాడు. కాని, మిరాశీ, ఆల్టేకర్‌లు ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. వాకాటకులను వింధ్యకులని, తొలి పాలకుడిని వింధ్యాశక్తి అని పురాణాలు పేర్కొన్నాయి. ఇతడి రాజధాని పురిక, చనకగా పేర్కొన్నాయి. వింధ్యాశక్తి కుమారుడు ప్రవిరుడు 60 సంవత్సరాలు పాలించాడని పేర్కొన్నాయి. ప్రవిరుడిని ప్రవరసేనునిగా, పురికా నగరాన్ని వింధ్య పర్వతాల సమీపంలోని 'రిక్షావత్‌'గా భావించి, వాకాటకుల తొలి నివాసం మధ్య భారతమని (వింధ్య ప్రాంతం) విన్సెంట్‌ స్మిత్‌ అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని నిమద్‌ జిల్లాలో 'వాకాడ్‌' అనే పేరుతో నాలుగు గ్రామాలున్నాయి. వాకాటక శాసనాల్లోని 'వాకాటకనం' అనే పదానికి వాకాటక ప్రాంతమని అర్ధం. కాబట్టి, మధ్యప్రదేశ్‌ వీరి మొదటి నివాసమని యస్‌. వి.సౌహని పేర్కొన్నాడు. వాకాటకుల జన్మస్థలం తూర్పు మాళవ (విదిశ) అని, పురాణాల ఆధారంగా డి.సి. సర్కార్‌ నిరూపించే ప్రయత్నం చేశాడు. వాకాటక శాసనాలేవి ఉత్తర భారతదేశంలో లభించలేదు. చాందా జిల్లాలోని దేవ్‌టేక్‌ వద్ద మొదటి రుద్రసేనుని శాసనం దొరికింది. కాబట్టి, వింధ్య పర్వతాలకు దక్షిణంగా విదర్భ ప్రాంతంలోనే వాకాటకులు మొదట రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. బీరార్‌ ప్రాంతం వాకాటకుల తొలి నివాసమని హెచ్‌. సి రాయ్‌ చౌదరి పేర్కొన్నాడు.

దక్షిణ భారతదేశ వాదం
వాకాటకుల జన్మస్థలం దక్షిణ భారతదేశమని ఆచార్య వి.వి.మిరాశీ అభిప్రాయపడ్డారు. అందుకనేక సాక్ష్యాధారాలను వివరించాడు. క్రీ.శ.మూడో శతాబ్దానికి చెందిన ఒక అమరావతి శాసనంలో 'వాకాటక' అనే పేరు గల గహపతి (గృహపతి) ఇద్దరు భార్యలతో, బంధువులు, స్నేహితులతో కలిసి, అవలా స్తూపాన్ని దర్శించి, వారి ఆయురారోగ్యాల కోసం దానాలు చేసినట్లుంది. వాకాటక అనే మాటకు వాకాట గ్రామవాసి అని అర్ధముంది. అందువల్ల, అమరావతి ప్రాంతంలో వాకాటి అనే గ్రామం ఉండొచ్చని మిరాశీ అభిప్రాయపడ్డారు. వాకాటక గహపతియే వాకాటక వంశ మూలపురుషుడై ఉండొచ్చని మిరాశీ పేర్కొన్నాడు. ఈ వాదాన్నే ఎ.యస్‌. ఆల్టేకర్‌ కూడా సమర్థించాడు.
సాంచి, బార్హుత్‌ లాగానే అమరావతి కూడా ఆనాడు ప్రసిద్ధిగాంచిన బౌద్ధమత క్షేత్రమయినందు వల్ల రాజగృహం, పాటలీపుత్రం ఇత్యాది అన్ని ప్రాంతాల నుంచి యాత్రికులు అమరావతిని సందర్శించడానికి వచ్చేవారని తెలుస్తుంది. కాబట్టి, వాకాటక గహపతి అమరావతి సమీపం నుంచే వచ్చారని చెప్పే ఆధారం లేదని మరొక వర్గం వాదిస్తోంది.
వాకాటక రాజు రెండో వింధ్యాశక్తి బాసిం తామ్ర శాసనాల్లో, పల్లవ శివస్కందవర్మ హీరహడగళ్ళి, మైదవోలు శాసనాల్లో గల సాంకేతిక పదాల పోలికలను బట్టి పల్లవ రాజ్యం, వాకాటక రాజ్యం దక్షిణాదికి చెందిన పొరుగు రాజ్యాలని మిరాశీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, బాసిం తామ్ర శాసనాలు వాకాటక రాజు వింధ్యాశక్తిని హారీతిపుత్రుడని పేర్కొన్నాయి. దక్షిణాదికి చెందిన కదంబులు (కర్ణాటక), బాదామి చాళుక్యులు మాత్రమే ఈ బిరుదులు ధరించారు. వాకాటక రాజులు మొదటి ప్రవరసేనుడు, సర్వసేనుడు, వింధ్యాశక్తిలను బాసిం శాసనాలు ధర్మమహారాజు అనే బిరుదుతో ప్రశంసించాయి.. దక్షిణానికి చెందిన కదంబులు, పల్లవులు తప్ప మరే రాజ వంశాల వారు ఈ బిరుదును ధరించలేదు. వాకాటక మంత్రి వరాహదేవుని ఘటోత్కచ గుహ శాసనం, దక్షిణాదికి చెందిన “వల్లూరు” బ్రాహ్మణులను (హాస్తిభోజుడు, వరాహదేవుడు మొదలయిన వారు) తరతరాలుగా మంత్రులుగా నియమించినట్లు పేర్కొంది. ప్రస్తుత కరీంనగర్‌ జిల్లాలోని “వేలూరు” అనే గ్రామమే శాసనంలో పేర్కొన్న “వల్లూరు” అని మిరాశీ పేర్కొన్నాడు.
వార్థాకు 8 కి.మీ. దూరంలో గల 'పొనార్‌' (ప్రవరపురం) వాకాటకుల రాజధాని అని మిరాశీ పేర్కొన్నాడు. దీనిని రెండో ప్రవరసేనుడు నిర్మించాడు. ఈ వాదాన్నే నేడు ఎక్కువ మంది చరిత్రకారులు సమర్థిస్తున్నారు. ఎందుకంటే రెండో ప్రవరసేనుడి ఐదు శాసనాలు ఇక్కడి నుంచే విడుదల చేయబడ్డాయి.

కాల నిర్ణయం
వాకాటకుల పాలనా కాలంపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. బూలర్‌ పండితుడు వాకాటకులు ఐదవ శతాబ్దానికి చెందిన వారన్నాడు. డా॥ఫ్లీట్‌, కీల్‌హార్న్‌లు వాకాటకులు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వారని పేర్కొన్నారు. 1912లో ప్రభావతి గుప్తకు చెందిన పూనా శాసనాలు దొరకడంతో వాకాటకుల కాల నిర్ణయంపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది. గుప్త రాజు రెండో చంద్రగుప్తుడి కూతురు ప్రభావతి గుప్త అనే విషయం కూడా ఈ శాసనాల వల్ల తెలియవచ్చింది. గుప్త, వాకాటక రాజుల సమకాలీనత ఆధారంగా, వాకాటక రాజుల కాల నిర్ణయం చేయడానికి వీలయింది. 1939 లో, వాకాటక రాజు రెండో వింధ్యాశక్తి తామ శాసనాలు విదర్భలోని అకోలా జిల్లా బాసిం లేదా వాసిం వద్ద దొరకడంతో, వాకాటకు గురించి మరింత సమాచారం తెలియవచ్చింది. ఈ శాసనం లభించే వరకు వాకాటకుల్లో ఒకే ఒక ప్రధానమైన శాఖ మాత్రమే ఉండేదని పండితులు భావించారు. కాని, బాసిం శాసనాల ఆధారంగా, మొదటి ప్రవరసేనుని మరణం తరవాత, వాకాటకుల్లో నాలుగు శాఖలేర్పడ్డాయని మిరాశీ పేర్కొన్నాడు. క్రీ.శ.250 నుంచి క్రీ.శ.550 వరకు వాకాటకులు మూడు శతాబ్దాలు పరిపాలించారని చెప్పొచ్చు.

కులం
వాకాటకుల వంశం గురించి ప్రస్తావన పురాణాల్లో లేదు. వింధ్యకులు అనే ఒక రాజ వంశాన్ని వింధ్యాశక్తి స్థాపించాడని పురాణాలు పేర్కొన్నాయి. అతని కుమారుడైన ప్రవిరుడు నాల్గు అశ్వమేధ యాగాలను చేశాడని పేర్కొన్నాయి. పురాణాల్లో పేర్కొన్న వింధ్యకులు, ప్రవిరులు, శాసనాల్లోని వాకాటకులు ఒక్కటేనని చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహనులు-ఆంధ్రుల లాగానే, వాకాటక అనేది వంశం లేదా కుటుంబ నామం కాగా, వింధ్యకులు అనేది వారు మొదట నివసించిన ప్రదేశం పేరని కొందరి అభిప్రాయం. ఒక ప్రాంతాన్ని బట్టి వంశానికి పేరు రావడమనేది సర్వసాధారణమైన విషయం. అజంతా శిలా శాసనం ఆధారంగా, డా॥భావుదాజీ వాకాటకులు గ్రీక్‌ జాతికి చెందిన వారన్నాడు. అనేక క్రతువులు నిర్వహించి, బ్రాహ్మణీకం చెందారని పేర్కొన్నాడు. శుంగ, కణ్వ వంశ రాజులు లాగానే, వాకాటకులు కూడా శాసనాల్లో బ్రాహ్మణులమని చెప్పుకొన్నారు. వింధ్యాశక్తి విష్ణువృద్ధ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడని శాసనాలు వర్ణించాయి. వాకాటకులు సమకాలీన రాజ వంశాలైన గుప్త, నాగ, విష్ణుకుండు, కదంబులతో వైవాహిక సంబంధాలనేర్పాటు చేసుకొన్నారు.

రాజకీయ పరిణామాలు
మొదటి వింధ్యాశక్తి (క్రీ.శ. 250-270) (Founder of  Vakataka Dynasty) 
వింధ్యాశక్తి వాకాటక వంశ స్థాపకుడని. పురాణాలు పేర్కొంటున్నాయి. అజంతా శాసనాల్లో కూడా ఇతడు పేర్కొనబడ్డాడు. అజంతాలోని 16 వ గుహ శాసనం వింధ్యాశక్తిని వాకాటక వంశధ్వజుడని, అదే విధంగా ద్విజుడని పేర్కొంది. పురాణాలు ఇతడిని విదిశ (భిల్సా, భోపాల్‌ సమీప ప్రాంతం), పురిక (విదర్భ ప్రాంతం) పాలకుడిగా పేర్కొంటున్నాయి. శాతవాహనులను సామంత రాజుగా నాగపూర్‌, బీరార్‌ ప్రాంతాన్ని పాలించాడు. ఇతడు ఎటువంటి
బిరుదులను ధరించలేదు.

మొదటి ప్రవరసేనుడు (క్రీ.శ. 270-330) Real Founder of Vakataka dynasty
వింధ్యాశక్తి మరణానంతరం, అతని కుమారుడు ప్రవరసేనుడు రాజయ్యాడు. ప్రవరుడు 60 సంవత్సరాలు పాలన చేసినట్లు పురాణాలు పేర్కొన్నాయి. నిజమైన వాకాటక సామ్రాజ్య నిర్మాత ఇతడే. ఇతడు పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇతడి సామ్రాజ్యంలో ఉత్తర మహారాష్ట్ర బీరార్‌, మధ్యప్రదేశ్‌, దక్షిణ కోసల, తెలంగాణ ప్రాంతాలు అంతర్భాగాలయ్యాయి. సిశుకుడు పరిపాలించే పురికా రాజ్యాన్ని ఆక్రమించాడు. ప్రవరసేనుడు వైదిక మతావలంబకుడు. ఇతడు వాజపేయ, అతిరాత్ర, అగ్నిష్టోమ లాంటి వైదిక క్రతువులను నిర్వహించాడు. నాలుగు అశ్వమేధ యాగాలను చేశాడు. రెండో వింధ్యాశక్తి బాసిం శాసనం ఇతడిని సామ్రాట్‌, ధర్మమహారాజుని పేర్కొంది. తనకు తాను హారీతి పుత్రునిగా చెప్పుకొన్నాడు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున దానాలను చేశాడు. 
పురాణాల ప్రకారం ప్రవరసేనుడికి నల్గురు కుమారులున్నారు. అందులో పెద్ద కుమారుడైన గౌతమపుత్రుడికి పద్మావతి రాజ్య పాలకుడైన భారశివనాగ వంశస్థుడైన భావనాగుని కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. కాని, గౌతమీపుత్రుడు తండ్రి జీవించి ఉండగానే, అకాల మరణాన్ని పొందాడు. రెండో కుమారుడు శర్వసేనుడు వాకాటక వంశంలోని వత్సగుల్మ శాఖ స్థాపకుడు. మిగిలిన ఇద్దరు కుమారుల పేర్లుగాని, వారు స్థాపించిన వంశాలు గాని తెలియడం లేదు.
ప్రవరపుర - నందివర్ధన శాఖ
మొదటి రుద్రసేనుడు (క్రీ.శ. 330-355)
ప్రవరసేనుని తరవాత అతని మనుమడు (గౌతమీపుత్రుని కుమారుడు) మొదటి రుద్రసేనుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు వార్దా జిల్లాలోని ప్రవరపురం (పౌనార్‌), నందివర్ధనం (నాగపూర్‌ జిల్లా) రాజధానిగా పాలించాడు. వాకాటకులు గుప్త రాజులతో వైవాహిక సంబంధాలను నెలకొల్పుకొన్నారు. రుద్రసేనుడి ఒకే ఒక శిలా శాసనం చంద్రాపూర్‌లో లభించింది. భారశివనాగ వంశ రాజు భావనాగుని గురించి వాకాటక శాసనాల్లో పదే పదే పేర్కొనడాన్ని బట్టి, వారి మద్దతు ఇతనికి లభించిందని చెప్పొచ్చు.
రుద్రసేనుడు అనేక రాజకీయ సంక్షోభాలనెదుర్కోన్నాడు. వాకాటక రాజ్యం నాలుగు భాగాలుగా విడిపోయింది. అతని పినతందడ్రుల వ్యతిరేకత వల్ల, వాకాటకుల అధికారం కొద్ది కాలం మసక బారింది. కాని, తన తాత (మాతామహుడు) పద్మావతి పురాధీశ్వరుడైన భావనాగుని సహాయంతో, వాకాటక రాజ్య పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాడు. సముద్రగుప్తుడు ఓడించిన తొమ్మిది మంది ఆర్యావర్త రాజుల్లోని రుద్రదేవుడు, వాకాటక రాజు రుద్రసేనుడేనని కె.పి.జయస్వాల్‌ అభిప్రాయపడ్డాడు. కాని, ఈ వాదంతో ఎ.యస్‌. ఆల్టేకర్‌ విభేదించాడు. రుద్రదేవుడు, రుద్రసేనుడు ఒక్కటి కాదని, ఇద్దరు వేర్వేరన్నాడు. వాకాటకులు సముద్రగుప్తునికి లోబడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, వారు గుప్త శకాన్ని తమ శాసనాల్లో ఉపయోగించుకోలేదని, కేవలం తమ రాజ్య సంవత్సరాలను మాత్రమే ఉపయోగించారని మిరాశీ పేర్కొన్నాడు. సముద్రగుస్తుని అలహాబాద్‌ శాసనంలో వాకాటక రాజుల ప్రస్తావన లేదు. అంటే, సముద్రగుప్తుడు వాకాటకులతో శతృత్వానికి బదులుగా వారితో మైత్రి చేసి, పశ్చిమ క్షాత్రపులనోడించాడని చెప్పొచ్చు. రుద్రసేనుడు మహాభైరవుని భక్తుడు. ఇతని పాలన చివరి దశలో బాసిం రాజు (వత్సగుల్మ శాఖ) వింధ్యాసేనుడు కుంతల రాజ్యాన్ని భాగేల్‌ఖండ్‌లను జయించాడు.
మొదటి పృథ్వీసేనుడు (క్రీ.శ. 355-380)
రుద్రసేనుని తరవాత, అతని కుమారుడు పృథ్వీసేనుడు రాజ్యానికొచ్చాడు. ఇతడు 25 సంవత్సరాలు పాలించాడు. రుద్రసేనుడు సత్యవాది, దాత, విజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతడిని పాండవుల్లో జ్యేష్టుడైన ధర్మరాజుతో పోల్చారు. ఇతడి పాలనా కాలం శాంతియుతంగా నడిచింది. గుప్త రాజు రెండో చంద్రగుప్తుడు మొదటి పృథ్వీసేనుని సహాయంతో, శక క్షాత్రప రాజులను (మాళవ) ఓడించాడు. వీరి స్నేహబంధం మరింత దృఢంగా ఉండేందుకు, రెండో చంద్రగుప్తుడు తన కూతురు ప్రభావతి గుప్తను యువరాజైన రెండో రుద్రసేనునికిచ్చి వివాహం చేశాడు. పృథ్వీసేనుడు రాజధానిని నాగపూర్‌ సమీపంలోని నందివర్ధనానికి మార్చాడు. ఇతడు మహేశ్వరుని భక్తుడు.
రెండో రుద్రసేనుడు (క్రి.శ. 380-385)
పృథ్వీసేనుని అనంతరం, అతని కుమారుడు రెండో రుద్రసేనుడు రాజ్యానికొచ్చాడు. ఇతడు స్వల్ప కాలంలోనే, అంటే నాలుగైదేండ్లలోనే మరణించాడు. ఇతడు తన పూర్వీకుల లాగా శైవ మతాన్ని స్వీకరించక, తన భార్య ప్రభావతి గుప్త ప్రాదృలంతో, వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. రెండో చంద్రగుప్తుని కాలంలో వాకాటక రాజ్యంపై గుప్తుల ప్రాబల్యంపెరిగింది. గుప్త రాజులకు వాకాటక రాజ్యం సామంత రాజ్యంగా మారింది.
రెండో రుద్రసేనునికి ఇద్దరు కుమారులు. వారు, దివాకర సేనుడు (క్రీ.శ. 385-400), దామోదరసేనుడు. ప్రభావతి గుప్త, బాలుడైన తన కుమారుడు దివాకరసేనుని సింహాసనంపై కూర్చోబెట్టి, తానే కొద్ది కాలం సంరక్షకురాలిగా అధికారాన్ని చేపట్టింది. దివాకరసేనుని మరణానంతరం, దామోదరసేనుడిని సింహాసనంపై కూర్చోబెట్టింది. ఈ విధంగా, ఇద్దరు కుమారులకు సంరక్షకురాలిగా ప్రభావతిగుప్త 13 సంవత్సరాలు పాలనా బాధ్యతను చేపట్టింది. పూనా శాసనంలో ప్రభావలతిగుప్త తనకు'తాను దివాకరసేన - దామోదరసేన జననిగా చెప్పుకొంది. అంతేకాకుండా, తాను దేవగుప్తని కూతురుగా పేర్కొంది. దేవగుప్తుడే గుప్తరాజు రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడని చరిత్రకారుల అభిప్రాయం.
రెండో ప్రవరసేనుడు (క్రీశ. 400-440)
దామోదరసేనునికే రెండో ప్రవరసేనుడనే పేరుంది. విదర్భ ప్రాంతంలోని అమరావతి, వార్దా, బెతుల్‌, నాగపూర్‌, చింద్వారా,  భండార, బాలాఘాట్‌ మొదలయిన చోట్ల, ఇతని 17 తామ్ర శాసనాలు లభించాయి. మొత్తం బీరార్‌ ప్రాంతం ఇతని సామ్రాజ్యంలో చేరింది. ప్రవరపురమనే నగరాన్ని నిర్మించి, రాజధానిగా చేసుకొన్నాడు. దీనిని వార్థా జిల్లాలోని 'పోనార్' గా గుర్తించారు. ఇతడు శైవ భక్తుడు. ఇతర మతాల పట్ల సహన భావం చూపాడు. ఇతడు కవి, పండితుడు. సేతుబంధమనే కావ్యాన్ని మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడు. తన నూతన రాజధాని ప్రవరపురంలో శ్రీరామచంద్రుని కోసం ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు.
నరేంద్రసేనుడు (క్రీశ. 440-460)
ప్రవరసేనుని తరవాత, అతని కుమారుడు నరేంద్రసేనుడు రాజయ్యాడు. ఇతడు కుంతల రాకుమారి అజ్జిత-భట్టారికను. వివాహమాడాడు. ఈమే కదంబ రాజు కాకుత్సవర్మ కూతురు. కోసల, మేకల (అమరకంఠక పర్వతాల సమీపంలోని రాజ్యం) మాళవ రాజులు ఇతని సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. దూర ప్రాంతాలపై వాకాటకుల అధికారం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇతని చివరి పాలనా కాలంలో నలరాజు భావదత్తవర్మ (బస్తర్‌ ప్రాంతం) దరడయాత్ర చేసి, వాకాటకుల పూర్వ రాజధాని నందివర్ధనను ఆక్రమించాడు. కాని, నరేంద్రసేనుడు కదంబుల సహాయంతో పోగొట్టుకొన్న భూభాగాలను తిరిగి ఆక్రమించి, వాకాటక రాజ్య పతనాన్ని నిరోధించాడు. బస్తర్‌ (ఛత్తీస్‌గడ్‌) లోని నల రాజ్య భూభాగాలను కూడా ఆక్రమించాడు.
రెండో పృథ్వీసేనుడు (క్రీ.శ. 460-480)
నరేంద్రసేనుని తరవాత అతని కుమారుడు రెండో పృథ్వీసేనుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు ప్రధాన వాకాటక వంశంలో చివరివాడు. రెండుసార్లు వాకాటక లక్ష్మిని పునరుద్ధరించినట్లు బాలాఘాట్‌ శాసనంలో పేర్కోన్నాడు. వత్సగుల్మశాఖకు చెందిన హరిసేనుడు, నలవంశ రాజు భావదత్తవర్మలు ఈ దాడులను చేసి ఉండొచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుంచి విష్ణుకుండు రాజు మాధవవర్మ కూడా దండెత్తి వచ్చి పృథ్వీసేనుని ఓడించాడు. మాధవవర్శకు పృథ్వీసేనుడు తన కూతురునిచ్చి వివాహం చేశాడు. పృథ్వీసేనునికి కుమారులు లేనందు వల్ల, మాధవవర్మ వాకాటక రాజ్యాన్ని కూడా పొందాడు.
పృథ్వీసేనుని మరణానంతరం, వత్సగుల్మ శాఖ రాజు హరిసేనుడు ఉత్తర విదర్భను ఆక్రమించాడు. దీంతో, రెండు శతాబ్దాల ప్రధాన వాకాటక రాజ్యం అంతరించింది. హరిసేనుని అజంతా శాసనం అతనికి లోబడిన సామంత రాజ్యాల్లో, అశ్శక రాజ్యాన్ని కూడా పేర్కొంది. అశ్శకను (తెలంగాణ) పరిపాలిస్తున్నది విష్ణుకుండులే. హరిసేనుని పక్షాన, వాకాటక ప్రధాన శాఖను నిర్మూలించారని తెలుస్తోంది. విష్ణుకుండుల నాణేలు దక్షిణ మహారాష్ట్ర నాగపూర్‌, విదర్భ, నాసిక్‌లలో విస్తృతంగా దొరికాయి. మాధవవర్మ కుమారుడే మొదటి విక్రమేంద్ర భట్టారకవర్మ తన శాసనాల్లో వాకాటక మహాదేవి సుతుడనీ, విష్ణుకుండు, వాకాటక వంశ ద్వయాలంకరిష్టుడని, పరమసౌగతుడు (బౌద్దుడు), మహాకవి. అని చెప్పుకొన్నాడు.
వాకాటకులు - వత్సగుల్మ శాఖ
సర్వసేనుడు (క్రీ.శ. 330-355)
1939 లో లభించిన బాసిం తామ్ర శాసనాలు, అజంతా శాసనాలు వత్సగుల్మ శాఖ గురించి తెలియచేస్తున్నాయి. మొదటి ప్రవరసేనుని కనిష్ట సోదరుడు, సర్వసేనుడు ఈ శాఖ స్థాపకుడు. విదర్భ (బీరార్‌) ప్రాంతంలోని అకోలా జిల్లాలోని నేటి బాసిం (వత్సగుల్మ)ను రాజధానిగా చేసుకొన్నాడు. సహ్యాద్రి పర్వతాల నుంచి గోదావరి నది వరకు గల భూభాగాన్ని జయించి పాలించాడు. ఇతడు గొప్ప సాహితీ పోషకుడు. స్వయంగా కవి. ధర్మమహారాజు -బిరుదును ధరించాడు. ఇతడు ప్రాకృత కావ్యం 'హరివిజయం'ను రచించాడు.
వింధ్యాసేనుడు (క్రీ.శ. 355-400)
ఇతడిదే బాసిం శాసనాలు వింధ్యాశక్తిగా పేర్కొంటున్నాయి. ఇతడు తన 37 వ రాజ్య సంవత్సరంలో ఈ శాసనాలను వేయించాడు. ఇతని మంత్రి ప్రవరుడు దక్షిణంగా ఉన్న కుంతల రాజును ఓడించాడని తెలుస్తోంది.
రెండో ప్రవరసేనుడు (క్రీ.శ 400-415)
వింధ్యసేనుని తరవాత అతని కుమారుడు రెండో ప్రవరసేనుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని మరణానంతరం 8 సంవత్సరాల బాలుడైన ఇతని కుమారుడు రాజ్యానికొచ్చాడు. ఇతని పేరుగాని, పరిపాలన గురించి తెలియచేసే ఆధారాలు లభించలేదు.
దేవసేనుడు (క్రీ.శ. 450-475)
రెండో వరాహాదేవుని ఘటోత్కచ గుహ శాసనం, దేవసేనుని దేవరాజుగా పేర్కొంది. ఇతడు విలాసాలతో గడిపాడు. కాని, రాజ్య పాలనను సమర్థుడైన అతని మంత్రి హస్తిభోజునికప్పగించాడు. దేవసేనుడి అధికారి స్వామిలదేవుడు సుదర్శన అనే జలాశయాన్ని బాసిం సమీపంలో నిర్మించాడు.
హరిసేనుడు (క్రీ.శ. 475-500)
దేవసేనుని తరవాత అతని కుమారుడు హరిసేనుడు రాజయ్యాడు.  వత్సగుల్మ శాఖలో ఇతడందరి కంటే గొప్పవాడు. ఇతడి కాలంలో వాకాటక రాజ్య కీర్తిప్రతిష్టలు అత్యున్నత స్థాయికి చేరుకొన్నాయి. అజంతా శాసనాల్లో అతడు జయించిన ఘూర్జర (గుజరాత్‌), మాళవ, దక్షిణ కోసల (ఛత్తీస్‌గఢ్‌) కళింగ, అశ్మక (తెలంగాణ), కుంతల (దక్షిణ మహారాష్ట్ర ) రాజ్యాల పేర్లున్నాయి. ఇతడి సామ్రాజ్యం ఉత్తరాన మాళవ, దక్షిణాన కుంతల, పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. భారతదేశంలో సమకాలీన రాజ్యాలేవీ ఇంత విస్తీర్ణం కలిగి లేవు.  జయించిన రాజ్యాలను తన సామ్రాజ్యంలో విలీనం చేయకుండా, సాలీనా కప్పం చెల్లించే ఒప్పందంపై స్వతంత్రంగా పాలించేట్లు అనుమతించాడు. ఇతడు గొప్ప విజేతగానే కాకుండా, పరిపాలకుడిగా కూడా పేరుగాంచాడు. హస్తిభోజుని కుమారుడు వరాహదేవుడు ఇతని మంత్రి. అజంతాలోని 16వ గుహను తొలిపించింది ఇతడే. ఇతడి శాసనమే వత్సగుల్మ శాఖ గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం.
హరిసేనుడి తరవాత వాకాటక రాజ్యం బలహీనపడింది. ఇతని తరవాత, ఒకరిద్దరు అతని వారసులు పరిపాలించినప్పటికి, వారి పేర్లు మాత్రం తెలియడం లేదు. రుషిక లేదా అసిక (అశ్మక) ప్రాంతాన్ని (కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలు) వాకాటకులకు సామంతులుగా విష్ణుకుండులు పాలించారు. ఉభయ  వాకాటక వంశ శాఖల మధ్య చెలరేగిన పోరాటాల్లో హరిసేనుడు విజయం సాధించినప్పటికి, వాకాటకుల వాస్తవాధికారం ఆనాటికే బలహీనపడిందని చెప్పొచ్చు. దీనిని అవకాశంగా తీసుకొని, విష్ణుకుండు గోవిందవర్మ స్వతంత్రించి, రాజ్య విస్తరణకు పూనుకొన్నాడని చెప్పే శాసనాధారాలు లభించాయి. ఈ సందర్భంలోనే కర్ణాటకకు చెందిన కదంబులు, ఉత్తర మహారాష్ట్ర నుంచి కాలచూరి రాజులు, బస్తర్‌ నుంచి నల వంశం దండెత్తి, చాలా భాగాలను ఆక్రమించాయి.

పరిపాలనా వ్యవస్థ
వాకాటకుల పరిపాలనా విధానాన్ని తెలుసుకోవడానికి వారి శాసనాలే ప్రధాన ఆధారం. వాకాటకులు సుస్థిరమైన, పటిష్టమైన పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు తాము తండ్రి లాంటి వారమని చెప్పుకొన్నారు. వాకాటకులది సంప్రదాయసిద్ధమైన రాచరికం. రాజు దైవాంశ సంభూతుడనే భావన లేదు. రాజులు నిరంకుశులు కారు. స్మృతులు, ధర్మశాస్త్రాలననుసరించి పాలించేవారు. 
వాకాటకుల పాలన కేంద్రీకృతమైంది కాదు. ఆనాటికి రవాణా సౌకర్యాలు సరిగ్గా లేనందు వల్ల వికేంద్రీకరణ అవసరమైంది. తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాజ్యాలు లేదా రాష్ట్రాలుగా విభజించారు. శాసనాల్లో 1) భోజకట రాజ్యం 2) అరమ్మి రాజ్యం; 3) వరుచ్చి రాజ్యం పేర్లున్నాయి. ప్రతి రాష్ట్రాన్ని తిరిగి విషయాలుగా విభజించారు. విషయాలను ఆహారాలు, భోగాలు లేదా భుక్తులుగా విభజించారు. ఆహారం, భోగ, భుక్తికి గల తేడా ఏమిటో తెలియడంలేదు. ప్రతి భోగంలో కొన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలుండేవి. వాకాటకులు కొన్ని ప్రాంతాల్లో విషయాలను పట్టాలుగా మార్గాలుగా విభజించారు. మార్గూ అనే పదం శాతవాహన, గుప్తుల శాసనాల్లో కన్పించదు.  గ్రామ పరిపాలనను గ్రామాధికారులు నిర్వహించేవారు. రాజులు గ్రామ, భూదానాలను చేసినప్పుడు గ్రామాధికారులను సమావేశపర్చి తెలియచేసే వారని, శాసనాల వల్ల తెలుస్తోంది. గ్రామకూటి అనే శాసనాల్లోని పదాన్ని బట్టి గ్రామప్రముఖులని  గ్రహించొచ్చు.
వాకాటక శాసనాల్లో మంత్రిపరిషత్‌ గురించిన వివరాలు ఎక్కువగా లేవు. మంత్రి, సచివ, సర్వాధ్యక్ష సేనాపతి, దండనాయక వంటి పేర్లు మాత్రం శాసనాల్లో ఉన్నాయి. వాకాటకులు తమ శాసనాల్లో సేనాపతులు, మంత్రుల పేర్లను కూడా పేర్కొన్నారు. భటులు, ఛాత్రులు, రజుకలు, గ్రామకూట, కులపుత్ర, దేవరిక మొదలయిన అధికారులుండేవారు.
ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయం. సాధారణంగా పంటలో 1/4 వంతు నుంచి 1/6 వంతును వసూలు చేసేవారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా కూడా రాజ్యానికి ఆదాయం వచ్చేది. ఎగుమతి, దిగుమతి సుంకాలు, ఇతర పన్నులను కూడా వసూలు చేసేవారు. ఉప్పు తయారిపై ప్రభుత్వానికి ఏకస్వామ్యం ఉండేది. మద్యం తయారీ ద్వారా
కూడా ప్రభుత్వానికి ఆదాయం చేకూరేది. పండితులకు, బ్రాహ్మణులకు, దేవాలయాలకు దానం చేసిన గ్రామాలపై, భూములపై కొన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు ఉండేది. ఏ ఏ పన్నుల నుంచి మినహాయింపు ఉందో బాసిం తామ్ర శాసనాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగులకు కూడా జీతాలకు బదులుగా భూములిచ్చేవారు. ప్రభుత్వ అధికారులు గ్రామాలకొచ్చినప్పుడు వారికి నిత్యావసరాలను సమకూర్చాలొచ్చేది. ఉచిత, నిర్బంధ సేవలను చేయాల్సొచ్చేది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సైన్య పోషణకు, యుద్ధాలకు, రాజ్య నిర్వహణకు, దేవాలయ నిర్మాణం కోసం ఖర్చు చేసేవారు.
వాకాటకులు పెద్ద సైన్యాన్ని పోషించారు. సేనాపతి సైనిక విషయాలను పర్యవేక్షించేవాడు. వాకాటక శాసనాలు మూడు రకాలైన సామంత రాజ్యాలను పేర్కొంటున్నాయి. 1) దండయాత్ర భయంతో తమంతట తామే లొంగిపోయిన రాజ్యాలు 2) దాడి వల్ల లొంగిపోయిన రాజ్యాలు; 3) యుద్ధంలో జయింపబడిన రాజ్యాలు. సామంతులు తమ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడుతూ, సైన్యాన్ని పోషించి, రాజుకు యుద్ధ సమయంలో సైన్యాన్ని సమకూర్చేవారు. ఇది ఒక రకమైన భూస్వామ్య వ్యవస్థ. వాకాటకుల పాలనలో సైనిక వర్ణాలకు ప్రాధాన్యత పెరిగింది.
రాజే న్యాయ వ్యవస్థలో అత్యున్నతాధికారి. స్మృతులు, ఆచారాలననుసరించి తీర్పులను చెప్పేవారు. గ్రామ స్థాయిలో గ్రామాధికారులే న్యాయ విచారణ చేసేవారు. వాకాటక శాసనాల్లోని 'సడండ-నిగ్రహ' అనే పదాన్ని బట్టి, స్వల్ప నేరాలకు జరిమానాలను విధించే వారని తెలుస్తోంది. బహుశ, ఈ జరిమానాలను ధన రూపంలో వసూలు చేసేవారు.
ఆర్థిక పరిస్థితులు
శాతవాహనుల కాలంలో విలసిల్లిన దేశీయ, విదేశీయ వ్యాపారం, వాకాటకుల కాలం నాటికి క్షీణ దశకు వచ్చింది. శ్రేణులు, పట్టణాలు దెబ్బతిన్నాయి. వాకాటకుల నాణేలు లభించకపోవడాన్ని వాణిజ్య క్షీణతగా భావించొచ్చు. రోమ్‌-భారతదేశం మధ్య వాణిజ్యం క్షీణించడంతో వాకాటక రాజులు వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. వాకాటక రాజులు నీటి పారుదల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆనకట్టలు, కాలువలు, జలాశయాలను నిర్మించారు. వాకాటక రాజు దేవసేనుని హిస్సే-బోరాలా శాసనంలో, స్వామిల్లదేవుడనే అధికారి సుదర్శన సరోవరాన్ని నిర్మించినట్లు చెప్పబడింది.వ్యాఘ్రదేవుని గంజ్‌ శిలా శాసనం కూడా జలాశయ నిర్మాణాన్ని పేర్కొంటున్నది. జలాశయాన్ని విరాకి అనే పేరుతో పేర్కొన్నారు.
వాకాటక రాజులు బ్రాహ్మణులు, పండితులు, ప్రభుత్వాధికారులకు, సైనికులకు, గ్రామ మహత్తరులకు భూదానాలు చేయడం అధికమైంది. వాకాటక శాసనాల్లో ఎక్కువగా బ్రాహ్మణులకిచ్చిన భూదానాలకు సంబంధించిన వివరాలున్నాయి. తమ పూర్వీకుల పుణ్యం కోసం గోవులు, ఏనుగులు, అశ్వాలు, గ్రామాలను దానం చేశారు. దానం చేసిన గ్రామాలకు అనేక ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులనిచ్చారు. రెండో వింధ్యాశక్తి బాసిం శాసనాలు వీటి జాబితాను పేర్కొంటున్నాయి. రాజభటులు గ్రామాల్లోకి ప్రవేశించరాదు. కొన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు ఉండేది. దానగ్రహీతలు రాజద్రోహానికి,. నేరాలకు పాల్పడరాదు. ఇతర గ్రామాలకు హాని కల్గించరాదు, భూదానాలు, భూస్వామ్య వ్యవస్థ అవతరించడానికి దారితీసింది. వీటిని సాగుచేయడానికి రైతులచే వెట్టి (విష్టి) చేయించేవారు. గ్రామంలోని ప్రజలు నిర్బంధంగా సైనికులకు, ప్రభుత్వోద్యోగులకు అనేక రకాల ఉచిత సేవలను చేయాల్సివచ్చేది.

సామాజిక పరిస్థితులు
హైందవ సమాజంలో చాతుర్వర్ణాలతో పాటు, అనేక మిశ్రమ కులాలు అవతరించాయి. వాకాటకుల కాలంలో కులాలు అంత దృధంగా అవతరించలేదు. వర్ణసాంకర్యం కూడా జరుగుతుండేది. వివాహాలెక్కువగా అదే కులం వారితోనే జరిగేవి. బ్రాహ్మణుడైన రెండో రుద్రసేనుడు రెండో చంద్రగుప్తుని కుమార్తె ప్రభావతి గుప్తను వివాహం చేసుకొన్నాడు. వాకాటకులు కదంబులు, విష్ణుకుండులతో వైవాహిక సంబంధాలనేర్పాటు చేసుకొన్నారు. వాకాటకులు బ్రాహ్మణులైనప్పటికి, క్షాత్ర ధర్మాన్ని పాటించారు. వీరిని బ్రాహ్మక్షాత్రియులంటారు. ఈ యుగంలో బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం పెరుగుతూ వచ్చింది. వారు కేవలం పండితులే కాక, పరిపాలకులుగా కూడా ప్రసిద్ధులయ్యారు. వాకాటకులు బ్రాహ్మణులను మంత్రులుగా నియమించుకొన్నారు. వత్సగుల్మ శాఖకు చెందిన రాజులు హస్తిభోజుడు, వరాహదేవుడనే బ్రాహ్మాణులను మంత్రులుగా నియమించుకొన్నారు. వైశ్యులకు పూర్వమున్న స్థాయి ఈ యుగంలో కొద్దిగా తగ్గింది. ప్రభావతిగుప్త వంటి 'స్రీలు' పరిపాలనా బాధ్యతలను చేపట్టారు.

మత పరిణామాలు
వాకాటక రాజ్యంలో వైదిక మతం, బౌద్ధ మతం వృద్ధిచెందాయి. ఎక్కువ మంది వాకాటక రాజులు శైవులు. కొందరు వైష్ణవులు. వాకాటక రాణి ప్రభావతిగుప్త ప్రభావంతో రెండో ప్రవరసేనుడు వైష్ణవుడిగా మారాడు. ఇతడు చక్రపాణి భక్తుడిగా, పరమ భాగవతునిగా వర్ణించబడ్డ్దాడు. ప్రభావతిగుప్తని అత్యంత భాగవదృక్తుగా శాసనాలు పేర్కొన్నాయి. రెండో పృథ్వీసేనుడు కూడా వైష్ణవుడే. ఇతడు పరమ భాగవతుడిగా వర్ణింపబడ్డాడు. ఇతర వాకాటక రాజులైన మొదటి
ప్రవరసేనుడు, మొదటి రుద్రసేనుడు, మొదటి పృథ్వీసేనుడు శైవులు. మొదటి రుద్రసేనుడు మహాభైరవుని భక్తుడు. మొదటి పృథ్వీసేనుడు మహేశ్వర భక్తుడు.
మొదటి ప్రవరసేనుడు ఒక శివాలయాన్ని నిర్మించాడు. మొదటి రుద్రసేనుడు ధర్మస్థానమనే దేవాలయాన్ని నిర్మించి, తన ఇష్టదేవతకు అంకితమిచ్చాడు. రెండో ప్రవరసేనుడు శంభుని భక్తుడు. తన రాజధాని ప్రవరపురంలో రామచంద్ర దేవాలయాన్ని నిర్మించాడు. వాకాటకుల కాలంలో దేవాలయాల నిర్మాణం ముమ్మరంగా జరిగింది. రాంటెక్‌ (మహారాష్ట్ర)లో రామచంద్ర దేవాలయం, వరాహ దేవాలయం, వామనావతార దేవాలయం (త్రివిక్రమ దేవాలయం), కేవల నర్సింహదేవాలయాలు నిర్మించబడ్డాయి.
ప్రధాన వాకాటక శాఖకు చెందిన రాజులు వైదిక మతాభిమానులు కాగా, వత్సగుల్మ శాఖ రాజులు బౌద్ద మతాభిమానులు. వత్సగుల్మ శాఖ రాజుల సామంతులైన అనూప, రిషిక రాజులు బౌద్ధ మతాన్ని పోషించారు. హరిసేనుని మంత్రి వరాహదేవుడు బౌద్ధమత సమర్ధకుడు. ఇతడు బౌద్ధమతస్థుల కోసం అజంతా, ఘటోత్కచలో గుహాలయాలను తొలిపించాడు.

విద్య, సాహిత్యాభివృద్ధి
వాకాటకుల కాలంలో సంస్కృత, ప్రాకృత సాహిత్యాలు అభివృద్ధిచెందాయి. వాకాటకులు తమ శాసనాలను సంస్కృత భాషలో వేయించారు. వాకాటక రాజులు సాహిత్యాన్ని పోషించడమే. కాకుండా, స్వయంగా కావ్యాలను, సుభాషితాలను రచించడం జరిగింది. వాకాటకుల కాలం నాటి వైదర్షి సంస్కృతి శైలిని ప్రత్యేకంగా దండి పేర్మొన్నాడు. వాకాటక రాజు సర్వసేనుడు 'హరివిజయం' అనే ప్రాకృత కావ్యాన్ని రాశాడు. కొన్ని ప్రాకృత గాథలను (పద్యాలు) కూడా రాశాడు. సర్వసేనుడి కృషి మూలంగా వత్సగుల్మ ప్రముఖ విద్యా సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది. 'హరివిజయం' కావ్యాన్ని దండి ప్రశంసించాడు. ఈ కావ్యంలో శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాతం చెట్టును తెచ్చే గాథను వివరించాడు. ఈ గ్రంథం లభించకపోయినప్పటికి, తరవాత రచయితలు తమ రచనల్లో హరివిజయంలోని విషయాలను పేర్మాన్నారు. ప్రవరసేనుడు రచించినట్లుగా పేర్మానే 'సేతుబంధం' అనే ప్రాకృత కావ్యం ఆనాటి కావ్యాల్లోనే ప్రసిద్ధమైందిగా బాణభట్టు, రామదాసు లాంటి వారు ప్రశంసించారు. దీనిలో 15 ఆశ్వాసాలున్నాయి. క్షేమేంద్రుడు కూడా తన ఔచిత్య విచార చర్చలో ప్రవరసేనుని కావ్యాన్ని అత్యద్భుతమైందిగా శ్లాఘించాడు. ప్రవరసేనుడు “సేతుబంధు” కావ్యంలోని ప్రతి ఆశ్వాసం చివరలో కాళిదాసు విరచితమైందని చెప్పడం వల్ల ఇది ఉభయుల సంయుక్త రచనగా కొందరు పండితులు భావిస్తున్నారు. కాళిదాసు వాకాటక రాజ్యానికి గుప్త రాజు రెండో చంద్రగుప్తునిచేత పంపబద్దాడని, రామగిరిలో మేఘుసందేశం (మేఘదూతం)ను రాశాడని కొందరు పండితుల అభిప్రాయం. రామగిరిని వి.వి. మిరాశి ప్రస్తుత రాంటెక్‌గా గుర్తించారు. 
ప్రవరసేనుడు తన తాత, తల్లి లాగానే పరమ భాగవతుడు, రామభక్తుడు. శ్రీరామచంద్రుడు శ్రీలంకపై దండేత్తే విషయాన్ని ఈ కావ్యంలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రాముడు వెళ్ళే దారిలో ఉన్న వింథ్య, సహ్య, మలయ, మహేంద్రగిరి పర్వతాలను పేర్కొన్నాడు.
వాకాటకుల కాలంలో ప్రవరపురం (పొనార్‌) వత్సగుల్మ (బాసిం) గొప్ప విద్యా కేంద్రాలుగా కూడా విలసిల్లాయి. బ్రహ్మదేయాలు, అగ్రహారాలు వైదిక అధ్యయన కేంద్రాలుగా ఆవిర్భవించాయి.

వాస్తు శిల్పాలు, చిత్రకళల ప్రగతి
వాకాటకుల వాస్తు శిల్పం వారి దేవాలయాల్లో, అజంతా గుహల్లో కన్పిస్తోంది. పౌనార్‌, మన్సాఠ్‌, నందపూర్‌, రాంటెక్‌, నగర మొదలయిన చోట్ల వాకాటకులు నిర్మించిన దేవాలయాలెన్నో ఉన్నాయి. వాకాటకులు కట్టడ దేవాలయాలను, గుహ దేవాలయాలను నిర్మించారు. వాకాటకుల వాస్తు కళలపై గుప్తుల వాస్తు కళల ప్రభావం ప్రసరించింది. వాకాటక రాజులు రాంటెక్‌లో రామచంద్ర దేవాలయం, వరాహ దేవాలయం, వామనావతార దేవాలయం (త్రివిక్రమ దేవాలయం), కేవల నర్సింహ దేవాలయాలను నిర్మించారు. రెండో ప్రవరసేనుడు ప్రవరపురంలో రామచంద్ర దేవాలయాన్ని నిర్మించాడు. రాంటెక్‌ శాసనం ప్రకారం, మొదటి రుద్రసేనుడు చిక్కంబూరి వద్ద దేవస్థానమనే శివాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 
వాకాటక శిల్పాల్లో పొడవైన శరీరం, సన్నని నాజూకైన నడుము, సౌష్టవంగా ఉండే శరీర పైభాగాలు మొదలగు లక్షణాలు, శాతవాహనుల కాలం నాటి అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట శిల్పాలను పోలి ఉన్నాయి. పౌనార్‌, మంథాల్‌, రాంటెక్‌, జబల్‌పూర్‌లోని శిల్పాలు, వాకాటకుల శిల్పకళకు అద్దం పడుతుంది. నందివర్ధనం, ప్రవరపురం ప్రధాన కళా కేంద్రాలుగా విలసిల్లాయి. అజంతాలో 15 వ గుహలో గంరగా-యమున శిల్పాలను చెక్కడం జరిగింది. 16, 17, 19 గుహల్లో గంగా-యమునా శిల్పాల స్థానంలో, సాలభంజికలను చెక్కడం జరిగింది. బౌద్ధ శిల్పాల్లో సాలభంజికలను చెక్కడం, వాకాటుకల కాలం నుంచి ప్రారంభమైంది.
అజంతా శిల్పాలు, చిత్రాలు మానవుడి అసాధారణ కళా సృష్టిగా, అద్భుతమైన కళాఖండాలుగా విమర్శకులు వర్ణించారు. వీటి కాల నిర్ణయంపై పండితుల్లో ఏకాభిప్రాయం లేదు. సుమారు ఏడు శతాబ్దాలు ఈ కళ కొనసాగింది. అజంతాలో 30 గుహలున్నాయి. 1819 లో వీటిని కెప్టెన్‌ జాన్‌స్మిత్‌ అనుకోకుండా గుర్తించాడు. వీటిలో కొన్ని గుహలు థేరవాదానికి, మరికొన్ని మహాయానానికి చెంది ఉన్నాయి. బుద్దుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను, బౌద్ధ జాతక కథలను ఇందులో చిత్రించారు. మొదటి గుహలో మహాజనక జాతకం, 17 వ గుహలో మహాహంస జాతకం, మాతృపోషక జాతకం దృశ్యాలు చెక్కబడ్డాయి. దీపంకర జాతకంలోని దీపంకర బుద్ధుడిని 26 వ గుహలో అనేకసార్లు చెక్కడం జరిగింది. 19 వ గుహలో బుద్ధుడు కపిలవస్తు నగరంలో యశోధర, రాహులుడి ఎదుట భిక్షాటన చేసే దృశ్యం చెక్కబడింది. బుద్దుడి మహాపరినిర్యాణం 26 వ గుహలో చెక్కడం జరిగింది. ఒకటో గుహ విహారంలో ధర్మచక్ర ప్రవర్తన ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహం దర్శనమిస్తుంది. బుద్ధునికిరువైపుల పద్మపాణి, వజ్రపాణిలున్నారు. పద్మపాణి లేదా అవలోకితేశ్వర బుద్దుడి చిత్రం, అజంతా చిత్రాల్లోనే తలమానికమైంది.
అజంతాలోని 16వ గుహను వాకాటక రాజు హరిసేనుడి మంత్రి వరాహదేవుడు తొలిపించాడు. అన్ని గుహల్లో ఇది ప్రధానమైంది. ఇందులో బుద్దుడి జీవితంలోని చివరి ఘట్టాలను, జాతక కథలను చిత్రాలుగా చిత్రించారు. అజంతాలోని 17 వ విహార గుహను పహరిసేనుని సామంతుడు ఉపేంద్రగుప్తుడు (రిషిక రాజ్యం) తొలిపించాడు. ఇందులో అన్ని గుహల్లో కంటే ఎక్కువ చిత్రాలున్నాయి. పైగా, అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి.
బుద్ధభద్రుడు, మధురదాసుడు,, బాదంత ధర్మదత్తుడు అనే బౌద్ధ సన్యాసులు కూడా అజంతాలోని కొన్ని బుద్ధ విగ్రహాలను తొలిపించారు. వాకాటకుల చిత్రాలు బెరంగాబాద్‌, ఘటోత్కచ (ఔరంగాబాద్‌ జిల్లా), బాగ్‌ (మధ్యప్రదేశ్‌లో కూడా ఉన్నాయి. అజంతా గుహల్లో వాకాటక రాజులు, వారి సామంతులు వేసిన శాసనాలున్నాయి.
శాతవాహనుల అనంతరం దక్కన్‌లో పాలించిన ప్రసిద్ధ రాజ వంశాల్లో వాకాటకులు ముందుగా వస్తారు. తెలంగాణాలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలు వీరి రాజ్య భాగాల్లో ఉండటం జరిగింది. తదుపరి కాలంలో ఈ ప్రాంతాల్లో స్వతంత్ర పాలన సాగించిన విష్ణుకుండులు వీరికి సామంతులుగా ఉండటం గమనార్హం. వాకాటకులు ఉత్తరాన గుప్తులు, దక్షిణాన కదంబులతో వైవాహిక, సత్సంబంధాలనేర్పర్చుకొని, తమ రాజ్య సుస్థిరత, శాంతిభద్రతలకు చక్కటి పునాదులనేర్పర్చుకోవడం జరిగింది. పరిపాలన, ఆర్థిక రంగాల్లో, ప్రజా సంక్షేమం, సైన్య నిర్వహణ, సమర్ధతకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. విద్య, సారస్వత రంగాల్లో, సంస్కృత, ప్రాకృత భాషల ప్రగతికి విద్యా కేంద్రాల నిర్వహణకు చర్యలను తీసుకోవడం జరిగింది. శైవ, వైష్ణవ, బౌద్ధమతాలు ఆదరణను పొందాయి. మిశ్రమ కులాలు అవతరించాయి. పౌనార్‌, బాసిం రాజధానుల్లో పలు హైందవ దేవాలయాలు, అజంతా గుహల్లో బుద్ధుని జీవితగాథలు, జాతక కథలు, శిల్ప, చిత్రకళలు ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దబడ్డాయి. దక్కన్‌ చరిత్రలో వాకాటకుల పాలనా కాలం చిరస్మరణీయమైంది.

Ancient History of Vakataka dynasty in Telugu, Vakataka dynasty Ancient History in Telugu, Historical monuments of Vakataka dynasty in telugu, Ancient History of Vakataka dynasty notes in Telugu, Ancient History of Vakataka dynasty study material in Telugu, Ancient History of Vakataka dynasty lecture notes in Telugu,who was the first king of Vakataka dynasty,who was the founder of Vakataka dynasty, Vakataka dynasty Founder, Vakataka dynasty first king,the great king of Vakataka dynasty, Vakataka dynasty great king,great ruler of Vakataka dynasty,Vakataka dynasty period, Vakataka dynasty great ruler,first capital of Vakataka dynasty,Vakataka dynasty capital,Vakataka dynasty birth place,list of the kings of Vakataka dynasty, Vakataka dynasty kings list, Vakataka dynasty rulers list,rulers list of Vakataka dynasty,economincal status Vakataka dynasty,what was the first capital of Vakataka dynasty,Telangana Ancient history notes,Telangana Ancient history notes in telugu,Telangana Ancient history study material in telugu,The great Empire of the Vakataka dynasty

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)