శాతవాహన యుగం

Adhvith
0
Ancient History of Satavahana Dynasty in Telugu

శాతవాహన యుగం - పరిణామాలు The Great Empire of Satavahanas

శాతవాహన పూర్వయుగం Ancient History of Satavahana Dynasty in Telugu

తెలంగాణకు అతి ప్రాచీన చరిత్ర ఉంది. ఇది ఉత్తర, దక్షిణ దేశాల సంగమస్థానం. తెలంగాణ అనే పదం మాత్రం ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వ్యవహారంలోకి వచ్చింది. అమీర్‌ ఖుస్రూ అనే కవి తెలంగాణను పేర్కొన్నాడు. తెలంగాణ-ఆంధ్ర ప్రాంతమే కాకుండా, తమిళనాడు వరకు గల ప్రాంతాన్ని తెలంగాణగా ఆనాడు వ్యవహరించేవారు. గోల్కొండ కుతుబ్‌షాహీల కాలంలో తెలంగాణ అంటే కోస్తాంధ్ర కూడా అని అర్ధం. నిజాంల పాలనలోని ఉత్తర సర్కారులు (కోస్తా), సీడెడ్‌ జిల్లాల (రాయలసీమ) ను ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఇచ్చివేసిన తరవాత హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు భాషా ప్రాంతాన్ని తెలంగాణగా వ్యవహరించడం సాధారణమైంది. తెలుగు భాష మాట్లాడే వారిని ఆంధ్రులని వారు నివసించే ప్రాంతాన్ని ఆంధ్రదేశమని ప్రాచీన కాలం నుంచి పేర్కొనడం జరిగింది. బౌద్ధ జాతక కథలు (క్రీ.పూ. 600-400) గోదావరి - కృష్ణానదుల మధ్య ప్రాంతాన్ని అంధపథం (ఆంధ్రపథం,), అంధకరథ్థం (ఆంధ్ర రాష్ట్రం) అని పేర్కొన్నాయి.

శాతవాహన పూర్వయుగం - చారిత్రక విశేషాలు Satavahana Dynasty Ancient History in Telugu

ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారి బుగ్వేదంలో భాగమైన ఐతరేయ బ్రాహ్మణంలో (క్రీపూ. 1000) ఉంది. విశ్వామిత్రుడు తన యాభై మంది కుమారులను. వింధ్యపర్వతాలకు దక్షిణంగా దండకారణ్యంలో ఆంధ్ర, పుండ్ర, పుళింద, శబర, మూతిబలతో కలిసి జీవించమని శపించాడని ఉంది. అప్పటికే, ఈ జాతులన్ని దక్షిణ భారతదేశంలో ఉన్నాయని, ఇవి అనార్య జాతులని తెలుస్తుంది. మౌర్యులకు పూర్వమే సాహసికులైన వర్తకులు, మత బోధకులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. పురాణాలు, మహాభారతం, సంగమ సాహిత్యం, అగస్త్య మహర్షి ఆర్య సంస్కృతిని దక్షిణాపథానికి తెచ్చినవాడుగా వర్ణించాయి. అగస్తుడు దేవతల కోసం వింధ్యుడి మదమును అణచి దక్షిణ దేశాన్ని చేరుకొన్నాడని, సముద్రాల నీరంతా తాగాడని మహాభారతంలో ఉంది. దీనిని బట్టి, ఆర్యులు భూమార్గం, సముద్ర మార్గాన దక్షిణ దేశాన్ని చేరుకొన్నారని చెప్పొచ్చు. Historical monuments of Satavahana Dynasty in telugu

అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథం, క్రీ.పూ. ఆరో శతాబ్దంలో వెలసిన షోడశ మహాజనపదాల్లో, దక్షిణ భారతదేశంలో_వెలసిన ఏకైక జనపదం. అశ్మక (నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు) గూర్చి పేర్కొంది. దీని రాజధాని పోదన (నేటి బోధన్‌), సుత్తిపిటిక భాగమైన సుత్తనిపాదంలో భావరి వృత్తాంతముంది. గోదావరికి ఇరువైపుల అళక (అశ్మక), ముళాక. (నాందేడ్‌, ఔరంగాబాద్‌ జిల్లాలు) రాజ్యాలున్నాయని, అవి అంధక రార్థలుగా పేర్కొంది. ముళాక రాజధాని ప్రతిష్టానపురం (పైఠాన్‌). 

క్రీ.పూ. నాల్లో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన మెగస్తనీస్‌ అనే గ్రీక్‌ రాయబారి, తన 'ఇండికా' లో ఆంధ్రులకు ముప్పది కోటలున్న నగరాలున్నాయని, ఒక లక్ష కాల్బలం, రెండు వేల అశ్విక బలం, ఒక వెయ్యి గజ దళం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇదే విషయాన్నిఫ్లీనీ కూడా పేర్కొన్నాడు. మెగస్తనీస్‌ చెప్పిన కోటల్లో, తెలంగాణలో బోధన్‌, కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూర్‌, కొండాపూర్‌, ఫణిగిరి, గాజులబండ, ఇంద్రపురిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో  సాతానికోట, వీరాపురం, భట్టిప్రోలు, ధాన్యకటకం, విజయపురి, సువర్ణగిరి, వేంగి, నరసాల మొదలయిన వాటి గుర్తించారు. అశోకుడు 13వ శిలాశాసనంలో తన రాజ్యానికి దక్షిణంగా కళింగ, ఆంధ్ర, భోజక, రఠిక రాజ్యాలునృట్లు వారు తన ధర్మాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నాడు. మౌర్యుల్లో చివరి వాడైన బృహధ్రధుడిని, అతని సేనాని పష్యమిత్రశుంగుడు హత్యచేసి క్రీ.పూ. 187 లో అధికారంలోకి వచ్చాడు. ఈ కుట్రను వ్యతిరేకించి, ఆంధ్రులు తిరుగుబాటు చేయగా, వారిని శుంగులు ఓడించారని, కాళిదాసు మాళవికాగ్నిమిత్ర నాటకంలో పేర్కొన్నాడు.

దక్కన్‌లో మౌర్యుల పతనం తరవాత శాతవాహనులకు పూర్వం, క్రీ.పూ. రెండు, ఒకటి శతాబ్దాల్లో స్థానిక రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలించారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో శాతవాహన పూర్వ రాజుల శాసనాలు,

నాణేలు దొరికాయి. క్రీ.పూ. మూడో శతాబ్దం నాటి భట్టిప్రోలుస్థూపంలోని దాతుకరండ శాసనాల్లో కుభీరకుడనే రాజు నిగమసభ, గోష్టీల సహాయంతో పరిపాలన చేసినట్లు ఉంది. వడ్డెమాను శాసనంలో రాజసోమకుడు, జంటుపల్లి, వేల్పూరు శాసనాలలో సరిసద, మహాసద్‌, అశోకసద, శివసద, శివమకసద అనే పేర్లు ఉన్నాయి. కొండాపూర్‌, హైదరాబాద్‌, కోటిలింగాలలో మహారథి, మహాతలవర నాణేలు దొరికాయి. కోటిలింగాల్లో గోబద్‌, సమగోప, నారన, కంవాయసిరి (శాతవాహన పూర్వ రాజుల) నాణేలు దొరికాయి. వీరాపురంలో కూడా శివమహాహస్తిన్‌, శివస్కందహస్తిన్‌ నాణేలు దొరికాయి. శాతవాహన పూర్వ యుగానికే చెందిన జనావాసాల్లో ఎరుపు; నలుపు-ఎరుపు మట్టి పాత్రలు, దక్కన్‌లోని కొండాపూర్‌, పెదబంకూర్‌, కోటిలింగాల మొదలైన చోట్ల దొరికాయి. వీరు ఇనుమును కరిగించి, నాగలికర్రు, వివిధ రకాలైన పనిముట్లను తయారుచేసుకొన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని పెద్దబంకూరులో కమ్మరి కొలిమిని కూడా కనుక్కొన్నారు.

శాతవాహనులు Satavahana Dynasty notes in telugu

తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో శాతవాహనుల పాలనా కాలం పలు రంగాల్లో, మార్గదర్శకత్వాన్ని నెరపింది. తెలంగాణానే కాకుండా, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజ వంశం శాతవాహనులది. దక్షిణ భారతదేశంలో మొదటి విశాల సామ్రాజ్యాన్ని వీరు స్థాపించారు. దక్షిణ భారతదేశానికి రాజకీయ సమైక్యతను కల్పించి, సాంస్కృతిక సేవను ఒనరించారు. వీరి పాలనలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రగతిశీలక మార్పులు చోటు చేసుకొన్నాయి. సాహిత్య, వాస్తు, శిల్ప కళలకు రాజాదరణ గొప్పగా లభించింది. మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి, కణ్వ వంశ కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నారు. తెలంగాణాలోని కోటిలింగాల (కరీంనగర్‌ జిల్లాలో వీరి పాలన ప్రారంభమై, తరవాత ప్రతిష్టానపురం (పైఠాన్‌) రాజధానైంది. మలి శాతవాహనుల కాలం నాటికి, ధనకటకానికి (ధాన్యకటకం) మార్పు చేయడం జరిగింది. ఉత్తర భారతదేశంలో మగధ వరకు తమ దిగ్విజయ యాత్రలను నిర్వహించారు. శాతవాహన సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. ఉత్తరాన గంగానది వరకు విస్తరించింది. క్రీ.పూ.ఒకటో శతాబ్దం నుంచి, క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య భాగం వరకు, అంటే, సుమారు రెండున్నర శతాబ్దాల సుదీర్ధ కాలం శాతవాహనులు పరిపాలించారు.

ద్రావిడ దేశం, ఆర్యావర్తం మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి, శాతవాహనులు చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారని, కెం.ఎం. పణిక్కర్‌ అభిప్రాయపడ్డారు.

చారిత్రక ఆధారాలు Historical evidences of Satavahana Dynasty

శాతవాహన చరిత్రను పునర్‌నిర్మించడానికి గల ఆధారాలను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. అవి 1) పురావస్తు ఆధారాలు 2) సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు, చిత్రలేఖన శిల్పాలు మొదలైనవి ఉన్నాయి.

శాసనాలు  Satavahana dynasty Inscriptions 

శాతవాహనుల శాసనాలు బ్రాహ్మి లిపిలో, ప్రాకృత భాషలో ఉన్నాయి. శాతవాహన రాజులు, వారి బంధువులు వీటిని వేయించారు. సుదీర్హ పాలనా కాలానికి చెందిన 24 శాసనాలు. మాత్రమే దొరికాయి. ఎనిమిది నాసిక్‌లోను, ఐదు కన్హరిలోను, మూడు కార్లేలోను, ఒకటి భిల్సాలో, రెండు నానాఘాట్‌లో, ఒకటి మ్యాకడోని (కర్నూలు జిల్లా) లో, ఒకటి చిన్న గంజాంలో, రెండు అమరావతిలో, ఒకటి కొడవలిలో లభ్యమయ్యాయి. శాతవాహనుల్లో తొలి, మలి శాతవాహనుల శాసనాలు మాత్రమే దొరికాయి. కాని, మధ్యలోని వారి శాసనాలు దొరక లేదు. నానేఘాట్‌ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య, రాణి నాయనిక (నాగానిక) వేయించింది. ఇది అలంకార శాసనం. దీనిపై తొలి శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కబడ్డాయి. కన్హరీ  శాసనాన్ని కృష్ణుడు(కణ్హ)  వేయించాడు. గోతమీ బాలసిరి (గౌతమీ బాలశ్రీ) వేయించిన నాసిక్‌ శాసనం తన కొడుకు గోతమీపుత సిరి సాతకణి (గౌతమీ పుత్ర శాతకర్ణి) విజయాలను ప్రస్తావించింది. తన మనువడు వాసితిపూట సిరి పులుమావి (వాసిష్టీపుత్ర పులుమావి) 19వ పాలనా సంవత్సరంలో దీన్ని వేయించింది. వాసిష్టీపుత్ర పులుమావి, అతని వారసులు కూడా కొన్ని శాసనాలను వేయించారు.

శాతవాహనులవే కాకుండా, వారి సమకాలీనులు వేయించిన శాసనాలు కూడా శాతవాహనుల కాల నిర్ణయం కోసం ఉపయోగపడుతున్నాయి. మహామేఘవాహన వంశానికి చెందిన కళింగ రాజు, ఖారవేలుడు వేయించిన వోథిగుంఫ శాసనం, అతని సమకాలీనుడైన శాతకర్ణి గురించి సమాచారాన్ని తెలియచేస్తుంది. Inscriptions of the Satavahana dynasty in telugu

నాణేలు Coins of Satavahanas

శాతవాహనులు సీసం, రాగి నాణేలను అధిక సంఖ్యలో ముద్రించారు. రాగి, తగరం, లోహాల మిశ్రమంతో పోటిన్‌ నాణేలను కూడా ముద్రించారు. గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి వెండి నాణేలను కూడా ఉపయోగించారు. రాజులు తమ నాణేలపై రాజు పేరు, బిరుదులు, కొన్ని సందర్భాల్లో తండ్రి పేరును కూడా ముద్రించేవారు. వీటిపై గల రాతలను ప్రాచీన లిపి శాస్త్రం సహాయంతో, ఇవి ఏ కాలానికి చెందినవో గుర్తించొచ్చు. వీటిపై కొన్ని సంకేతాలను- వృషభం, ఏనుగు, సింహం, కొండ, ఉజ్జయిని చిహ్నం, ఓడ, సూర్యుడు, చంద్రుడు, కమలం, శంఖం-ముద్రించేవారు. కోటిలింగాలలో సాతవాహన, చిముక సాతవాహన, మొదటి శాతకర్ణి నాణేలు  దొరికాయి. చిముకుని నాణేలు కేవలం కోటిలింగాలలోనే ఎక్కువ సంఖ్యలో దొరకడం వల్ల, శాతవాహనుల మొదటి నివాస స్థలం తెలంగాణ అని నిర్ణయించడంలో ఇవి తోడ్పడుతున్నాయి. సంగనభట్ల నరహరిశర్మ అనే తపాలా శాఖ ఉద్యోగి, కోటిలింగాలలో లభ్యమైన నాణేలను సేకరించి, 1970 లో ప్రముఖ శాసన పరిశోధకుడు, డా॥ పి.వి.పరబ్రహ్మశాస్త్రి గారికి అందచేశాడు. ఈ నాణేల  ద్వారా, ఎందరో పురాణాల్లో, శాసనాల్లో పేర్కొన్న రాజుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. శ్రీముఖుడు, శాతవాహన, శాతకర్ణి రాజుల నాణేలతో పాటు, శాతవాహనులకు పూర్వం పాలించిన స్థానిక రాజులైన గోబధ, నారన, కంవాయసిరి, సమగోప మొదలైన రాజుల నాణేలు కూడా లభ్యమయ్యాయి. మవాతలవర, మహాసేనాపతి సెబక వంటి సామంత రాజులకు చెందిన నాణేలు కూడా తవ్వకాల్లో దొరికాయి.

శాతవాహనుల నాణేలు నెవాసా, మస్కి (కర్టాటక) త్రిపూరి (మధ్యప్రదేశ్‌ నాగార్జునకొండ, కొండాపూర్‌, పెద్దబంకూర్‌ల్లో కూడా లభ్యమయ్యాయి. కొన్ని సమయాల్లో ఒక పాలకుని నాణేలపై వేరొక పాలకుని చిహ్నాలను ముద్రించొచ్చు. వీటిని పునర్ముద్రిత నాణే (Restruct coins) లంటారు. సాధారణంగా, ఈ రాజులిరువురూ సమకాలీనులు కావడమో, లేదా వారసత్వ. రూపంలో, లేదా తిరుగుబాటు ద్వారా, లేదా గెలుపొందటం ద్వారా సింహాసనాన్ని ఆక్రమించటమో జరుగుతుంది. తరహాల, జోగల్‌తంబి (నాసిక్‌) వద్ద పశ్చిమ క్షాత్రపరాజు నహపాణునకు చెందిన వెండి నాణేల రాశి (9270 నాణేలు) లభించింది. ఈ నాణేలను గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రింపచేశాడు. నహపాణునిపై గౌతమీపుత్ర శాతకర్ణి తిరుగులేని విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో రెండవ రుద్రసేనుని నాణేలు లభించాయి. క్షాత్రపులతో శాతవాహనులకు దగ్గరి సంబంధాలున్న విషయం తెలుస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలానికి చెందిన ఓడ బొమ్మతో ఉన్న నాణేలు, నాగార్జునకొండలో లభించాయి. శాతవాహనుల కాలంలో జరిగిన సముద్ర వ్యాపారాన్ని గూర్చి ఇవి తెలియచేస్తున్నాయి. శాతవాహనుల పాలనలో ఉన్నతాధికారులైన మహాతలవర, మహాసేనాపతి, మహారథి, మహాగ్రామిక అనే వారిక్కూడా నాణేలను ముద్రించే అధికారముండేది. మహారథైన సదకన (సాతకణి) కలలాయ తన సొంత నాణేలను కూడా జారీచేశాడు. దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల రోమన్‌ నాణేలు దొరికాయి. భారతదేశానికి, రోమ్‌ సామ్రాజ్యానికి మధ్య గల వ్యాపార సంబంధాల ఫలితంగా, నాణేలు మన దేశంలోకి ప్రవేశించాయి.

తవ్వకాలు, నిర్మాణాలు Archeology Excavations and constructions of Satavahanas

పురావస్తు స్థలాలను శాస్త్రీయంగా తవ్వి, దొరికిన వస్తువుల ఆధారంగా, కార్బన్‌ పద్ధతిన కాల నిర్ణయం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫణిగిరి, గాజులబండ, కోటిలింగాల, పెద్దబంకూర్‌, కదంబాపూర్‌, ధూళికట్టలో, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భట్టిప్రోలు, గుడివాడ, జగ్గయ్యపేట, గుంటుపల్లి, రామతీర్థం, శాలిహుండం మొదలైన చోట్ల జరిగిన తవ్వకాల వల్ల, శాతనాహనుల నాటి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొండాపూర్‌

మెదక్‌ జిల్లాలో ఉంది. క్రీ.పూ. మూడో శతాబ్దం నాటికే ఇది ఒక పట్టణంగా ఆవిర్భవించింది. శాతవాహనుల కంటే పూర్వమే ఇది 'అశిక' (రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలు) రాజ్యానికి  రాజధానిగా ఉండేది. మెగస్తనీస్‌ పేర్కొన్న ఆంధ్రుల ముప్పది కోటల్లో ఇది ఒకటి. రోమన్‌ సామ్రాజ్యంతో జరిగే వాణిజ్యానికి దక్షిణాదిన ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ టైబీరియస్‌ కైసర్‌ చిహ్నం గల రోమన్‌ సెప్టెర్సిస్‌తో చేసిన కంఠహారం దొరికింది. శాతవాహనులకు చెందిన సుమారు 4000 నాణేలు ఇక్కడ దొరికాయి. సదవాహన, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీపుత్రశాతకర్ణి, వాసిస్టీపుత్ర పులుమావి, మూడో శివశ్రీ పులుమావి, యజ్ఞశ్రీశాతకర్ణి నాణేలు ఇందులో ఉన్నాయి. కొండాపూర్‌ను శాతవాహనుల టంకశాల నగరమని మల్లంపల్లి సోమశేఖరశర్మ వ్యాఖ్యానించారు.

కోటిలింగాల

కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. 1980-1983 వరకు రాష్ట్ర పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కోట గోడలు, ఒక బురుజు బయటపడినాయి. ఇక్కడ శ్రీముకుడి మరియు తొలి శాతవాహనుల నాణేలు, శాతవాహనుల పూర్వపు రాజుల నాణేలు, విద్దాంక నాణేలు కూడా దొరికాయి. క్రీపూ. నాల్గో శతాబ్దం నాటికే కోటిలింగాల ప్రాధాన్యతను సంతరించుకొంది. శాతవాహనుల సామ్రాజ్యానికి ఇది తొలి రాజధాని. ఇక్కడ దొరికిన ఇసుకరాతి స్తంభంపై బ్రాహ్మి లిపిలో 'నాగగోపినికయ' అని ఉంది, ఇక్కడికి సమీపంలో గల మునుల గుట్టపై జైనుల శిలాచ్భాదాలను కనుక్కొన్నారు. 

పెద్దబంకూరు

కరీంనగర్‌ జిల్లాలోని హుస్సేమియా వాగు ఒడ్డున ఉంది. ఒక రైతుకు పొలంలో 22 వేలకు .పైగా ఉన్న శాతవాహనుల నాణేల కుండ దొరికింది. 1968-74 మధ్య కాలంలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు నిర్వహించగా, శాతవాహనుల కాలం నాటి మూడు ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేద బావులు, మట్టి గాజులతో నిర్మించిన మరొక బావి బయటపడ్డాయి. ఇనుప గొడ్డళ్ళు, మేకులు, కత్తులు, బరిసెలు, కొడవళ్ళు, ఉలులు మొదలయినవి దొరికాయి. పూసలు, గాజులు, టెర్రకోట ముద్రికలు తవ్వకాలలో దొరికాయి. శాతవాహన, శాతకర్ణి, పులుమావి, శివశ్రీ పులుమావి మొదలైన శాతవాహన రాజుల నాణేలు, విద్దాంక నాణేలు దొరికాయి. రోమన్‌ చక్రవర్తులైన ఆగస్టస్‌ సీజర్‌, టైబీరియస్‌ నాణేలు కూడా దొరికాయి.

ధూళికట్ట

కరీంనగర్‌ జిల్లా హుస్సేమియా వాగు ఒడ్డున ఉంది. 1972-75 మధ్య పురావస్తు శాఖ తవ్వకాలను జరిపింది. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్థూపాన్ని వి. వి.కృష్ణశాస్త్రి వెలుగులోకి తెచ్చారు. స్థూపం చుట్టూ గల రాతి ఫలకాల మీద కొన్ని బ్రాహ్మి లిపిలో ఉన్న శాసనాలు ఉన్నాయి. ధూళికోట (మట్టికోట) ధూళికట్టగా ఉచ్చరించబడుతున్నది. కోట లోపల రాజ భవనాలు, బావులు, ధాన్యాగారాలు, ప్రాకారాలు బయటపడ్డాయి. ఇనుప ఆయుధాలు, పనిముట్లు, టెర్రకోట బొమ్మలు, ఏనుగు దంతం దువ్వెన, మట్టి పాత్రలు ఇక్కడ దొరికాయి. మౌర్యుల కాలం నాటి విద్దాంక నాణేలు దొరికాయి.

బౌద్ధ నిర్మాణాల్లో ప్రధానమైనవి స్థూపాలు, చైత్యాలు, సంఘారామాలు. శాతవాహన శిల్పం  అమరావతి శిల్పంగా పేరుగాంచింది. ఈ శిల్పాల వల్ల ప్రజల వేషధారణ, శిరోజాలంకరణ, ఆభరణాలు మనకు తెలుస్తున్నాయి. ప్రజల మత భావాలు, శిల్ప కళారీతులు కూడా ఈ కళాఖండాల ద్వారా అవగతమౌతున్నాయి.

సాహిత్య ఆధారాలు

సాహిత్య ఆధారాల్లో పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు, విదేశీ రచనలు ఇత్యాదులున్నాయి. వాయు, బ్రహ్మాండ, విష్ణు, భాగవత, మత్స్య పురాణాలు ఆంధ్రుల వంశావళులను వివరించాయి. భవిష్య పురాణంలోని భాగమైన 'కలియుగ రాజ వృత్తాంతం'లో ఆంధ్రుల వంశావళికి సంబంధించిన వివరాలున్నాయి. పురాణాలు శాతవాహన పాలన అంతమైన కొన్ని శతాబ్దాల తరవాత రచించబడ్డాయి. పురాణాల ఆధారంగా శాతవాహనుల వంశ క్రమాన్ని చెప్పడం కష్టం. పురాణాల కంటే శాసనాలు, నాణేలు విశ్వసనీయమైన ఆధారాలు. పౌరాణిక జాబితాలోని 30 మంది రాజుల్లో నాలుగు నుంచి 22 వరకు చారిత్రక అంధకారం నెలకొంది. పార్గిటర్‌ పండితుడు పురాణాలను 'డైనాస్ట్రీస్‌ ఆఫ్‌ కలి ఏజ్‌' (Dynasties of Kali Ages) అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. హాలుని కాలానివి అని చెప్పే బృహత్కథ, గాథాసప్తశతి, హాలుని కాలపు సైనిక లావాదేవీలు వస్తువుగా గల ప్రాకృత గ్రంథం లీలావతి, బృహత్కథ ఆధారంగా రాసిన కథా సరిత్సాగరం, శాతవాహనుల కాలం నాటి పాలనా విశేషాలు, ప్రజల స్థితిగతులపై వెలుగును ప్రసరింపచేస్తున్నాయి. వాత్స్యాయనుడు రచించిన కామసూత్ర ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూంది.

విదేశీ ఆధారాలలో గ్రీక్‌, రోమన్‌ రచనలు ప్రధానమైనవిగా పేర్కొనొచ్చు. మెగస్తనీస్‌ క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్యుల ఆస్టానానికి రాయబారిగా వచ్చాడు. ఇతడు “ఇండికా” గ్రంథంలో ఆంధ్రుల గూర్చి పేర్కొన్నాడు. ప్లినీ అనే (క్రీ.శ. 23-79) రోమన్‌ చరిత్రకారుడు ఇండికాలో మెగస్తనీస్‌ పేర్కొన్న విషయాలను వివరించాడు. ప్లినీ రోమన్‌ చరిత్రకారుడు, ప్రకృతి శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. రోమన్‌ సేనా నాయకుడు. హిస్టోరియా నాచురాలి (Natural History) అనే గ్రంథాన్ని రాశాడు. ఇది తూర్పుదేశాల చరిత్ర, ప్రకృతి, సాంఘిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల గురించి తెలియచేసే మౌలిక గ్రంథం. క్రీ.శ.80 ప్రాంతంలో ఒక అజ్ఞాత నావికుడు రాసిన 'పెరప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ' అనాటి రోమ్‌, భారతదేశ వాణిజ్య సంబంధాలను, ఓడరేవులను పేర్కొంటూంది. ఈజిప్షియన్‌ గ్రీక్‌ అయిన టాలమీ (క్రీ.శ 1వ శతాబ్ది) తన గ్రంథం “జాగ్రఫీ" లో కూడా శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలను, ఓడరేవులను పేర్కొన్నాడు. 

శాతవాహనుల జన్మభూమి Birthplace of Satavahanas

శాతవాహనుల జన్మస్థానం గురించి, తొలి రాజధాని గురించి, చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.

కోస్తాంధ్ర వాదం

శాతవాహనుల తొలి నివాసం ఆంధ్ర అని, ఆర్‌. జి. భండార్కర్‌ (1895), వి. ఏ.స్మిత్‌ (1902), బార్నెట్‌, ఇజె.రాప్సన్‌ మొదలైన చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కృష్ణా. గోదావరి నదుల మధ్య భాగమే శాతవాహనుల మొదటి స్థావరమని, పురాణాల్లో ఆంధ్రులుగా పేర్కొన్న వీరు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని, వీరి జన్మభూమి కోస్తాంధ్ర అని, మొదటి రాజధాని ధాన్యకటకం (అమరావతి) అని, భండార్కర్‌ పేర్కొన్నాడు. వి.ఏ.స్మిత్‌, డా॥ బర్గెస్‌ ఆంధ్రుల తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, వారి నివాసం కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. బౌద్ధ వాఙ్మయంలోని “సెరివణిజ జాతకం” ప్రకారం, తెలివాహనదిపై ఉన్న ఆంధ్రనగరి శాతవాహనుల తొలి రాజధాని అని, డి. ఆర్‌. భండార్కార్‌ తెలిపాడు. తెలివాహ నది నేటి ఒడిశాలోని మహానదికి ఉపనదైన 'తెలొ' అని తెలిపాడు. హెచ్‌.సి. రాయచౌదరి తెలివాహ నదియే కృష్ణానది అని, నేటి విజయవాడ ఆంధ్రనగరి కావొచ్చు అన్నాడు. శాతవాహన జన్మస్థలం కోస్తాంధ్రగా, వారు తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించారని గుర్తి వెంకట్రావు అన్నారు. కోస్తాంధ్రలో మలి శాతవాహన రాజుల నాణేలు, శాసనాలు లభ్యం కావడం వల్ల, మలి శాతవాహనుల కాలానికి రాజధాని, కోస్తాంధ్రలోని ధాన్యకటకం (అమరావతి)కి మార్చారని చెప్పొచ్చు.

మహారాష్ట్ర వాదం

తొలి శాతవాహనులకు చెందిన నానేఘాట్‌, నాసిక్‌ శాసనాలు, నాణేలు మహారాష్ట్రలో లభ్యం కావడం వల్ల, వాటికి దగ్గరలోనే వారి రాజధాని ఉంటుందని, కాబట్టి మహారాష్ట్ర శాతవాహనుల జన్మస్థలమని, ప్రతిష్టానపురం (పైథాన్‌) వారి మొదటి రాజధానని, పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌, కె. గోపాలాచారి, డి.సి .సర్కార్‌, భండారీలు తెలిపారు. వీరు శాతవాహనుల జన్మభూమి మహారాష్ట్ర అని, వాసిస్టీపుత్ర పులుమావి ఆంధ్రదేశాన్ని జయించి పాలించాడని పేర్కొన్నారు. తమ వాదనకు మద్దతుగా, కింది కారణాలను పేర్కొన్నారు.

  1. తొలి శాతవాహనుల శాసనాలు నానేఘాట్, నాసిక్‌లలో మాత్రమే దొరకడం.
  2. కళింగ రాజు ఖారవేలుడు తన హాథిగుంఫ శాసనంలో శాతకర్ణి రాజ్యంపైకి దాడికి పంపినట్లు పేర్కొనడం.
  3. గౌతమీ బాలశ్రీ నాసిక్‌ శాసనంలో, గౌతమీపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలో ఆంధ్రలోని ఏ ప్రాంతాలను పేర్కొనక పోవడం.
  4. ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం అమరావతి శాసనం. దీన్ని వాసిష్టీపుత్రశ్రీ పులుమావి వేయించాడు. అంతకు పూర్వం రాజులెవ్వరి శాసనాలు ఆంధ్రలో లభించక పోవడం.

విదర్భ వాదం

శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతమని, వి.వి.మిరాశి (1941) పేర్కొన్నాడు. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాని, ఆంధ్రులు కారని తెలిపాడు. నాసిక్‌ దగ్గర గల శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి తనను బేనాకటసామి అని వర్ణించుకొన్నాడు. బేనానది మీద గల కటకము అనేది శాతకర్ణి రాజధానై ఉండొచ్చని, బేనానది వైన్‌గంగా నదికి ఉపనదైన 'కన్దాన్‌' తో ముడిపెట్టి, మిరాశి విదర్భ శాతవాహనుల మొదటి జన్మస్థలమని వాదించాడు. కాని, అనేకులు ఈ వాదాన్ని బలపర్చలేదు. మొదటి శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలో విదర్భ అంతర్భాగం మాత్రమేనని, నానాఘాట్‌, నాసిక్‌ శాసనాలను బట్టి చెప్పొచ్చు.

కర్ణాటక వాదం

శాతవాహనుల జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారనే వాదాన్ని డా. వి.యస్‌. సుక్తాంకర్‌ లేవనెత్తారు. అందుకు ఆయన 1) కడపటి శాతవాహన రాజు పులుమావికి చెందిన కర్నూలు జిల్లాలోని మ్యాకదోని శాసనం 2) పల్లవ రాజు నాల్గవ శివస్కందవర్మ వేయించిన హీరహడగళ్ళి, తామ్ర శాసనాలను సాక్ష్యంగా వివరించారు. మ్యాకదోని శాసనం “'సాతవాహని హారి" అనే ప్రదేశాన్ని పేర్కొంది. హీరహడగళ్ళి శాసనం కూడా 'సాతవాహని రట్ట' అనే పేరుతో ఆ ప్రదేశాన్ని పేర్కొంది. ఇవి రెండూ శాతవాహనుల పేరు మీద వెలసిన జిల్లా, రాష్ట్రాలు. శాతవాహనుల పేరు మీద ఒక ప్రాంతాన్ని పిలవడం వల్ల, ఆ ప్రాంతమే శాతవాహనుల జన్మస్థలమని సుక్తాంకర్‌ అభిప్రాయపడ్డారు. శాతవాహనులు ఆంధ్రుల్లో ఒక ఉప వంశమని, ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు రెండూ వేరు వేరు వంశాలని, అదే విధంగా పురాణాల్లో పేర్కొన్న ఆంధ్రులు, శాసనాల్లో పేర్కొన్న శాతవాహనులు కూడా ఒక్కటి కాదని, మొదటిసారి పేర్కొన్నాడు. ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతంలో పరిపాలిస్తుండగా, శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించారని డా॥ సుక్తాంకర్‌ వాదించాడు. సాతవాహనిహార, సాతవాహనిరథ్ధ అనే పేర్లు శాసనాల్లో పేర్కొన్నంత మాత్రాన, బళ్ళారి శాతవాహనుల జన్మస్థలమని నిర్ణయించలేం.

తెలంగాణ వాదం

తొలి శాతవాహన రాజులైన శాతవాహన, శాతకర్ణి, చిముకుని నాణేలు తెలంగాణాలోని కోటిలింగాల, పెద్ద బంకూరు, ధూళికట్ట, కదంబాపూర్‌, కొండాపూర్‌ల్లో లభ్యమయ్యాయి. శ్రీముకుని నాణేలు కేవలం కోటిలింగాల్లోనే దొరకడం వల్ల, అతడే శాతవాహన వంశ స్థాపకుడని, అందువల్ల శాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందని, అజయ్‌మిత్రశాస్త్రి, దేమె రాజిరెడ్డి, ఠాకూర్‌ రాజారాం సింగ్‌, కృష్ణశాస్త్రి మొదలైన వారు పేర్కొన్నారు. శాతవాహన అనే రాజు ఈ సామ్రాజ్య స్థాపకుడని, వీరి పాలన కోటిలింగాల నుంచే ప్రారంభమైందని, పురావస్తు తత్వవేత్త పి.వి. పరబ్రహ్మశాస్త్రి పేర్కొన్నాడు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల. దానికే, ఆంధ్రనగరమనే పేరుండేదని తెలుస్తోంది. శాతవాహనులకు పూర్వం పాలించిన స్థానిక రాజులైన గోబద, నారన, కంవాయసిరి, సమగోప మొదలైన రాజుల నాణేలు లభ్యమయ్యాయి. ఖారవేలుడు వాథిగుంఫా శాసనంలో కూడా శాతకర్ణి రాజ్యం పైన పశ్చిమ దిశగా దండెత్తాడనే విషయం కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూంది. మొదటి శాతవాహన రాజ్యం తెలంగాణలోనే ఏర్పడినట్లు చెప్పడమే సమంజసం.

శాసనాలు, నాణేలు లభ్యమైన ప్రదేశాల ఆధారంగా, నిస్సందేహంగా శాతవాహనులు కోటిలింగాల్లో రాజ్య స్థాపన చేసి, దక్షిణ మహారాష్ట్రకు మొదట వ్యాప్తి చేసినట్లు తెలుస్తుంది. కాని, తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు మొదట విస్తరించిన ఆధారాలు లేవని చెప్పొచ్చు.

శాతవాహనులు - ఆంధ్రులు ఒక్కటేనా? Are Satavahanas - Andhras one and the same

శాసనాల్లో శాతవాహనులని, పురాణాల్లో ఆంధ్రులు, ఆంధ్రభృత్యులని పేర్కొన్నవారు ఒక్కటేనని, విన్సెంట్‌ స్మిత్‌, ఇ.జె.రాప్సన్‌, ఆర్‌. జి.భండార్కర్‌, ఎల్‌:డి.బార్నెట్‌, మారెమండ రామారావు మొదలైన చరిత్రకారులు పేర్కొన్నారు. మత్స్య, వాయు పురాణాల్లో పేర్కొన్న ఆంధ్రుల వంశావళిలోని పేర్లు శాసనాల్లోని రాజుల పేర్లతో సరిపోవడం వల్ల, ఆంధ్రులు- శాతవాహనులు ఒక్కరేనని, ఆంధ్ర అనేది జాతినామమైతే, శాతవాహన అనేది వంశనామం, లేదా కుటుంబ నామం. కన్హరి, నాసిక్‌ శాసనాల్లో శాతవాహన కుల అనే మాట ఉంది. క్రీ.శ. 4 వ శతాబ్ది నాటి శివస్కంద వర్మ మైదవోలు శాసనంలో, అంధాపథ (ఆంధ్ర పథం) ముఖ్య పట్టణం ధాన్యకటకం అని చెప్పబడింది. కాబట్టి, జాతిపేరు మీదనే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు స్పష్టమౌతూంది. శాతవాహనులను, శాలివాహనులని, శాతకర్ణులని, ఆంధ్రులని, ఆంధ్రభృత్యులని పిలవడం జరిగింది. శాతవాహన రాజైన హాలుడు తాను సంకలనం చేసిన గాథాసప్తశతిలో శాలివాహన, శాతవాహన, శాతకర్ణి పేర్లను పర్యాయ పదాలుగా వాడాడు. హేమచంద్రుడు రచించిన వ్యాకరణంలో శాలివాహని అనే పదం శాతవాహనకు అపభ్రంశమని పేర్కొన్నాడు. శాతవాహన పదానికి సద, సార, సాలి అన్న రూపాంతరాలున్నాయి. నాణేలపై గల శాత, శతి అనే పదాలు శాతవాహన, శాతకర్ణి పదాల సంక్షిప్త రూపాలై ఉండొచ్చు. జినప్రభసూరి అనే జైన రచయిత, వందల కొద్దీ వాహనాలను దానం చేసినందున, శాతవాహనుడని పిలువబడ్డాడన్నాడు. 

శాతవాహనుడంటే, వాహనాన్ని పొందినవాడని అర్ధం. బహుశ, మౌర్యుల సైనిక సేవలో ఉన్నత హోదా పొందిన వ్యక్తి అని అర్ధం కావచ్చు. శాతవాహనులను ఆంధ్రభృత్యులని కూడా పురాణాలు పేర్కొన్నాయి. శాతవాహనులు ఆంధ్రుల్లో ఒక ఉప వంశమని, వారు భృత్యులు (సేవకులు) గా మహారాష్టలో పాలించి, తరవాత స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నారని అభిప్రాయపడ్డారు. ఈ వాదాన్ని హెచ్‌.సి.రాయ్‌చౌదరి, శ్రీనివాసశాస్రి సమర్ధించారు. కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించిన సమగోపుని వద్ద, సిరిశాతవాహనుడనే రాజు సేనానిగా పనిచేసి, తరవాత స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నాడని, అందుకే పురాణాలు శాతవాహనులను ఆంధ్రభృత్యులుగా పేర్కొన్నారని పి.వి. పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయపడ్డారు. శాతవాహనులు ఆంధ్రులు కారని, వారు పురాణాల్లో పేర్కొన్నట్లు ఆంధ్రభృత్యులని, అంటే ఆంధ్రులకు సామంతులుగా ఉండి, స్వతంత్రాధికారాన్ని సాధించారని రాయ్‌చౌదరి, శ్రీనివాసశాస్త్రి మొదలైనవారు భావించారు. శాతవాహనులు ఆంధ్ర దేశాన్ని పాలిస్తున్న కాలంలో సంకలనమైనందున, పురాణాలు వీరిని ఆంధ్రులని వర్ణించి ఉండొచ్చునని రాయ్‌చౌదరి అభిప్రాయపడ్డారు. ఆంధ్రుల భాష తెలుగు; కాని శాతవాహనులు వాడింది ప్రాకృత భాష. అందువల్ల శాతవాహనులు ఆంధ్రేతరులేనని శ్రీనివాసశాస్త్రి వాదన. అశ్వమేధ యాగాన్ని చేసిన రాజ కుమారుడిని శాతవాహనుడు, లేదా శాతహరనుడంటారు. గుణాధ్యుని బృహత్కథ ఆధారంగా రచించిన కథాసరిత్సాగరం ప్రకారం, సింహ రూపంలో ఉండే సాత అనే యక్షునిపై అధిరోహించిన వాడు కాబట్టి, సాతవాహనుడయ్యాడని భావించబడింది. దీపకర్ణిరాజు ఆ సింహాన్ని వధించి, ఆ బాలుడిని పెంచుకొన్నాడని, అందువల్ల అతడికి శాతవాహనుడనే పేరు వచ్చిందనే గాథ ఉంది.

కాల నిర్ణయం

శాతవాహనుల కాలనిర్ణయం ఒక జటిలమైన సమస్య. శాతవాహనుల పాలన ఆరంభంపై చరిత్రకారుల్లో భేదాభిప్రాయముంది. కాని, వారి సామ్రాజ్యం మాత్రం క్రీ.శ.225 లేదా 230 ప్రాంతంలో అంతమైందనే విషయంలో ఏకాభిప్రాయం కలదు. మత్స్య పురాణం 30 మంది ఆంధ్ర రాజులు సుమారు 456 సంవత్సరాలు పరి పాలించారని పేర్కొంది. వ్రాయు పురాణం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పాలించారని పేర్కొంది. శాసనాల్లో నాణేల్లో గల కొాందరు రాజుల పేర్లు పురాణాల్లో లేవు: పురాణాలు పేర్కొన్న రాజుల నాణేలు, శాసనాలు దొరక లేదు. పురాణాలను పరిశోధించిన పార్గిటర్‌ పండితుడు ఆంధ్ర రాజుల పట్టికను రూపొందించాడు. ఈ పట్టికపై ఆధారపడి, వి.వి.మిరాశి, డా॥ కె.గోపాలాచారి, గుర్తి వెంకటరావు, మారేమండ రామారావుల దీర్ఘకాల క్రమణికను సమర్ధించారు. సుమారు క్రీపూ.220 నుంచి క్రీ.శ.225 వరకు, అంటే, సుమారు 450 సంవత్సరాలుగా నిర్ణయించారు. క్రీ.పూ.271 లో బిందుసారుడు మరణించగా, అశోకుడికి తన సోదరులతో వారసత్వ పోరాటం జరుగుతున్న సమయంలో సిముకుడు దీన్ని అవకాశంగా తీసుకొని స్వతంత్రించాడని గుర్తి వెంకటరావు అభిప్రాయపడ్డాడు.

శ్రీముకుడు కణ్వ రాజు సుశర్మను వధించి, మగధను ఆక్రమించి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, అన్ని పురాణాలు పేర్కోన్నాయి. ఈ వాదనను అంగీకరిస్తే, శాతవాహనుల పాలన క్రీ.పూ. 30 ప్రాంతంలో ప్రారంభమౌతుంది. ఆర్‌.జి.భండార్కర్‌, శ్రీముకుడు శుంగులను నిర్మూలించి, క్రీపూ. 73 లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని పేర్కొన్నాడు. దినేష్‌ చంద్ర సర్కార్‌ పండితుడు క్రీ.పూ.30 లో శ్రీముకుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని అభిప్రాయపడ్డారు. శాతవాహనుల పాలనారంభాన్ని హెచ్‌.సి.రాయ్‌చౌదరి క్రీ.పూ.60, ఎ.ఎం.శాస్త్రి క్రీపూ.52, పి.వి.పరబ్రహ్మశాస్త్రి క్రీ.పూ.80 గా నిర్ణయించారు. ఇది. సంక్షిప్త కాలక్రమణిక. అంటే, రెండున్నర శతాబ్దాలు శాతవాహనులు పరిపాలించారనే వాదనను సమర్ధించారు.

తొలి శాతవాహన రాజుల్లో ఒకడైన శాతకర్ణికి, కళింగ చక్రవర్తి ఖారవేలుడికి గల సమకాలీనత ఆధారంగా కాల నిర్ణయం చేయబడింది. ఈ నిర్ణయం చాలా వరకు నానేఘాట్‌, హాతిగుంఫ శాసన లిపిని బట్టి శాస్త్రజ్ఞులు నిర్ణయించిన శాసనాల కాలం మీద ఆధారపడింది. మలి శాతవాహనుల కాల నిర్ణయం సమకాలీన శక, క్షహరాట, కరమ, పశ్చిమ క్షాత్రప రాజుల కాలంతో నిర్ణయించబడింది. చస్తనుడు, నహపాణుడు, రుద్రదాముడు మొదలైన వారికి శాతవాహన రాజుల సమకాలీనతను దృష్టిలో ఉంచుకొని కాల నిర్ణయం చేయబడింది.

గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని శక, యవన, క్షహరాటులపై విజయం సాధించాడని చెప్పబడింది. నహపాణుడు, అతని అల్లుడు ఉషవదత్తుడు వేసిన శాసన లిపి ఆధారంగా కూడా, సమకాలీనతను పరిశోధించారు. జోగల్‌తంబి నాణేల రాశిలో సహపాణుని నాణేలను పునర్‌ముద్రించినట్లు ఉంది. దీన్ని బట్టి, గౌతమీపుత్ర శాతకర్ణి నహపాణుని ఓడించినట్లు తెలుస్తోంది. తొలి శాతవాహనుల శాసనాలు క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందినవిగా లిపి శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. నేవస, బ్రహ్మపురి,చంద్రవల్లుల్లో జరిగిన తవ్వకాల ఆధారంగా, శాతవాహనుల పాలన క్రీపూ. మొదటి శతాబ్దంలో ప్రారంభమై, సుమారు 250 సంవత్సరాలు కొనసాగి, క్రీ.శ. 225 ప్రాంతంలో అంతమైందనే విషయాన్ని, అనేక మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.

శాతవాహనుల కులం Caste of Satavahanas

శాతవాహనులు బ్రాహ్మణులని, బ్రాహ్మణేతరులని పండితుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణిని 'ఏకబ్రాహ్మణుడని' అంటే, అద్వితీయమైన బ్రాహ్మణుడని, క్షత్రియ దర్చమానమర్దన అంటే, క్షత్రియుల గర్వమణిచాడని, ద్విజవర కుటుంబ వివర్ధనుడని, అంటే బ్రాహ్మణుల అభ్యుదయం కోసం పాటుపడినవాడని పేర్కొనడం జరిగింది. నాసిక్‌ శాసనంలోని వర్ణణను బట్టి, శాతవాహనులు బ్రాహ్మణులని కొందరు వాదించారు. శాతవాహన రాజులు తమ పేరుతో గౌతమీపుత్ర, వాశిష్టీపుత్ర వంటి తల్లి గోత్రం కూడా చేర్చడం జరిగింది. తమది బ్రాహ్మణ రక్తమని, సాధికారికంగా ప్రకటించుకొన్నారు. ధర్మశాస్త్రాలను అనుసరించి రాజ్యపాలన చేయడం క్షత్రియుల ధర్మం. నాసిక్‌ శాసనంలో గౌతమీ బాలశ్రీని 'రాజర్షివధువు' 'క్షత్రియపత్ని' అని పేర్కొనడం, శాతవాహనులు అశ్వమేధ, రాజసూయ యాగాలను చేయడం వల్ల, శాతవాహనులు క్షత్రియులని చెప్పడానికి అవకాశముంది. 'ద్వాత్రింశత్‌ పుత్తశిక' అనే గ్రంథం, శాతవాహనుల మూల పురుషుడు గోదావరి తీరంలోని ఓ నాగజాతి రాజుకు బ్రాహ్మణ వితంతువుకు జన్మించాడని పేర్కొంది. అందుకే శాతవాహనులు నాగజాతికి చెందినవారని కొందరు పండితులు పేర్కొన్నారు. భాగవత పురాణంలో సిముకుడు వృషలుడుగా పేర్కొనబడ్డాడు. అంటే, మిశ్రమ కులానికి చెందిన వాడని చెప్పబడింది. శాతవాహన అనే పదానికి కన్నడంలో రైతు అని, కాబట్టి, శూద్రులని కొందరు. పేర్కొన్నారు. మౌర్యుల అనంతగం మగధను పాలించిన శుంగ, కణ్వ వంశ రాజులు బ్రాహ్మణులు. దక్షిణ భారతదేశంలో శాతవాహనులు కూడా వైదిక మత పునరుద్ధరణకు కృషిచేశారు. శాతవాహనులు మరాఠా, శకులతో వైవాహిక సంబంధాల ద్వారా, వైదిక యజ్ఞయాగాలను నిర్వహించడం ద్వారా, సాంఘికంగా ఉన్నత స్థాయిని పొంది, బ్రాహ్మణీకతను సంతరించుకొన్నారని చెప్పొచ్చు.

శాతవాహనుల పాలన - రాజకీయ పరిణామాలు Rule of the Satavahanas - Political Consequences

చరిత్రకారులు శాతవాహనులను తొలి శాతవాహనులు, మలి శాతవాహనులుగా విభజించారు. స్థాపన నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చేవరకు గల రాజులను తొలి శాతవాహనులని, గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి చివరి రాజుల వరకు, మలి శాతవాహనులని అంటున్నారు.

List of First Satavahanas

శ్రీముకుడు who is the founder of Satavahana Dynasty

'సాదవాహన', 'సాతవాహన' చిముక పేరుతో నాణేలు కొండాపూర్‌, కోటిలింగాల, వరంగల్‌ సమీపంలో, ఔరంగాబాద్‌, జున్నార్‌, నెవాస వద్ద దొరికాయి. ఈ నాణేలపై ఉన్న లిపి ప్రాతిపదికగా 'సాద్వాహనుడు', శ్రీముకుడు ఒక్కటేనని అజయ్‌మిత్ర శాస్త్రి డా. దేమె రాజిరెడ్డిగార్లు పేర్కొన్నారు. 'శాతవాహని' అనే పేరు ధరించిన ఏకైక వ్యక్తి శ్రీముకుడేనని పేర్కోన్నారు.

ఆంధ్ర జాతీయుడైన శ్రీముకుడు కణ్వ వంశ రాజు సుశర్మను వధించి, నామమాత్రంగా ఉన్న శుంగుల అధికారాన్ని తొలగించి, రాజ్యాన్ని స్థాపించాడని పురాణాలు పేర్కొన్నాయి. పురాణాలు సింధకుడు, బలపుచ్చకుడు, బలి అని పేర్కొన్నాయి. ర్కొన్నాయి. కోటిలింగాల్లో మాత్రమే ఇతని నాణేలు లభ్యమయ్యాయి. కోటిలింగాల ఇతడి రాజధాని. నాణేలపై 'సిరిచిముకి, 'సిరిసాతవాహని', 'సిరిచిముక సాతవాహని' అనే మూడు రకాల పేర్లతో కూడిన నాణేలు దొరికాయి. నానేఘాట్‌ ప్రతిమా శాసనంలో 'రాయసిముక శాతవాహన సిరిమతో' అని ఇతడి గూర్చి రాయబడింది. ఒక జైన గాథ ప్రకారం, శ్రీముకుడు జైన మతాన్ని స్వీకరించి, అనేక ఆలయాలను నిర్మించాడు. ఇతడు 28 సంవత్సరాలు పరిపాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఇతడు తన పరిపాలన చివరి సంవత్సరాల్లో దుర్మార్గుడు, ప్రజాకంటకుదైనందున ప్రజలు తిరుగుబాటు చేసి, పదవీచ్యుతుణ్ని చేసి, హత్యగావించడం జరిగింది. చివరి రోజుల్లో శ్రీముకుడు వైదిక ధర్మాన్ని ఆచరించడం వల్ల, జైన సాహిత్యంలో ఇతడిని దుర్మార్గుడిగా చిత్రించారని చెప్పొచ్చు.

కృష్ణుడు (కన్హ) Satavahana Dynasty Founder

శ్రీముకుని తరవాత అతని సోదరుడు కృష్ణుడు రాజయ్యాడు. ఇతడు 18 సంవత్సరాలు పాలించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శాతవాహనుల్లో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఇతడే. ఇతడి నాసిక్‌ శాసనంలో శాతవాహన పోలనా పద్ధతిని, మౌర్యుల విధానంలో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. నాసిక్‌లో బౌద్ధ బిక్షువుల కోసం మహామాత్రుడు ఒక గుహను నిర్మించినట్లు, అది ప్రస్తావిస్తుంది. కృష్ణుడి కాలం నాటికి, శాతవాహన రాజ్యం పశ్చిమంగా నాసిక్‌ వరకు వ్యాపించింది.

మొదటి శాతకర్ణి About First Satakarni

పురాణాల జాబితాలో ఇతడు మూడో రాజు. ఇతడు శ్రీముకుని కుమారుడు. ఇతడే నానేఘాట్‌ శాసనంలో పేర్కొన్న శాతకర్ణి అని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలు పాలించాడు. శాతకర్ణి భార్య నాయనిక (నాగనిక) మహారఠి త్రణకయిరో కూతురు. నానేఘాట్‌ అలంకార శాసనంపై, నాగానిక, చనిపోయిన ఆమె భర్త శాతకర్ణి, మహారధి త్రణకయిరో, ఆమె కుమారులు-కుమార హకుత్రీ, సతిశ్రీమత్‌, కుమార  శాతవాహన, వేదిశ్రీ (పెద్ద కుమా కుమారుడు) ప్రతిమలున్నాయి. 

దేవి నాగానిక తన భర్తతో కలిసి అనేక యజ్ఞయాగాలను నిర్వహించింది. శాతకర్ణి  మరణాంతరం తన కుమారుడు వేదిశ్రీకి యుక్త వయస్సు వచ్చేంతవరకు, పాలనా బాధ్యతను చేపట్టింది. శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగంతో పాటు, 20 క్రతువులను నిర్వహించాడు. ఈ సందర్భంగా, ఏనుగులు, గుర్రాలను దానం చేశాడు. నాగనిక తన భర్త శాతకర్ణిని 'అప్రతిహత చక్ర' వీర, శూర, దక్షిణాపథపతి అని వర్ణించింది.

హాథిగుంఫ శాసనం ప్రకారం, తన రెండో పాలనా సంవత్సరంలో ఖారవేలుడు శాతకర్ణిని లెక్కచేయకుండా, పశ్చిమంగా సైన్యాన్ని పంపాడు. సైన్యం కణ్ణ బేణానదిని చేరుకొంది. మూషికా నగరంపై దాడి చెసి, బీభత్సాన్ని సృష్టించింది. మూషిక నగరం అంటే, శాతవాహనుల కొండాపూర్ అని, పితుండు నగరం గుంటుపల్లి అని డా॥ఆర్‌.సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డాడు. కాని, చుళ్ళ కళింగ జాతకం, అశ్మక రాజు అరుణుడు కళింగను జయించాడని పేర్కొంటుంది. బహుశ, ఖారవేలుడిపై శాతకర్ణి విజయం సాధించి ఉండొచ్చునని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.

మొదటి శాతకర్ణి తరవాత పురాణాల్లో 28 వ రాజుగా పేర్కొన్న గౌతమీపుత్ర శాతకర్ణి వరకు, 18. మంది రాజుల జాబితాను మత్స్య పురాణం పేర్కొంది. కాని, వీరికి సంబంధించిన శాసనాలు గాని, నాణేలు గాని లభించ లేదు. 

రెండో శాతకర్ణి About Second Satakarni

ఇతడు పురాణాల్లో పేర్కొన్న ఆరో రాజు. ఇతడు 56 సంవత్సరాలు పరిపాలించాడు. సాంచీ స్థూపంపై గల శాసనం ఇతడిదేనని కొందరు పండితులు భావిస్తున్నారు. ఇతడు శకుల నుంచి మాళవను ఆక్రమించాడు.

రెండో శాతకర్ణి తరవాత వరసగా లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేం ద్రస్వాతికర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతికర్ణి అనే ఎనిమిది మంది రాజులు పాలించారు. వీరిలో అపీలకుడిదిగా భావిస్తున్న పెద్ద రాగి నాణెం చాందా జిల్లాలో దొరికింది. అపీలకుడు పురాణాల్లో ఎనిమిదో రాజు. ఇతడు పన్నెండేండ్లు పాలన చేశాడని పురాణాల్లో చెప్పబడింది. మొదటి పులుమావి కాలంలో శక, పహ్లవ దాడులు, వాయవ్య భారతదేశంలో గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. ఇతని అధికారాన్ని అంతమొందించేందుకు శకులు, పహ్లవులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పులోమావి మరణానంతరం, శక రాజు సహపాణుడు శాతవాహన రాజ్యంపై దండెత్తి, మహారాష్ట్రలోని ప్రాంతాల్ని వశపర్చుకొని, మహాక్షాత్రప బిరుదును ధరించాడు. ఇతని చేతిలో ఓడిపోయిన రాజుల్లో సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి ఉన్నారు.

హాలుడు About Haludu Satavahana Dynasty

శాతవాహన చక్రవర్తుల్లో 17వ రాజు హాలుడు. ఇతడు సారస్వతాభిమాని, సాహితీవేత్త, కవి వత్సలుడని బిరుదు ఉంది. బాణుడు తన హర్ష చరిత్రలో గాథాసప్తశతిని హాలుడు రచించాడని పేర్కొన్నాడు. సింహళ రాకుమార్తె లీలావతిని వివాహం చేసుకొన్నాడు. సప్తమ గోదావరి వద్ద భీమేశ్వర సన్నిధిలో ఈ వివాహం జరిగినట్లు కుతూహలుడి లీలావతి కావ్యంలో పేర్కొనడం జరిగింది. సప్తమ గోదావరి కరీంనగర్‌ జిల్లాలోని వేంపల్లి వెంకట్రావు పేట అని డా॥సంగనభట్ల నర్సయ్య సాక్ష్యాధారాలతో నిరూపించాడు.

మలి శాతవాహనులు

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.106 - 130) Satavahana Dynasty Gowthamiputra Satakarni

గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో గొప్పవాడు. ఇతడు పురాణాలు పేర్కొన్న జాబితాలో 23వ వాడు. ఇతడు 24 సంవత్సరాలు సమర్ధవంతంగా పరిపాలించాడు. ఇతడి తల్లి గౌతమీ బాలశ్రీ, కుమారుడి విజయాలను, గొప్పతనాన్ని పొగుడుతూ, అతని మరణాంతరం నాసిక్ ప్రశక్తిని వేయించింది. ఈ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు వశిస్థి పులుమావి 18వ పాలనా సంవత్సరంలో వేయబడింది. అందుకే గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనంలో, తాను ఒక గొప్ప వ్యక్తికి తల్లిని, మరొక రాజుకు, మహారాజ పితామహినని చెప్పుకొంది. గౌతమీపుత్ర శాతకర్ణి శకులను, యవనులను, పల్లవులను ఓడించాడు. క్షాత్రప వంశాన్ని నిర్మూలించాడు. శాతకర్ణి, అనుప, అపరాంత, సౌరాష్ట్ర కుకుర, అవంతి రాజ్యాలను జయించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యంలో అశిక (హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలు) అశ్మక (నిజామాబాద్‌, బెరంగాబాద్‌ జిల్లాలు), ములక. (పైథాన్‌ ప్రాంతం), అపరాంత (బొంబాయి, కొంకణ్‌, పూనా ప్రాంతం), అనూప (మాహిష్మతి ఎగువ ప్రాంతం), విదర్భ (నాగపూర్‌, బీరార్‌), అకర (విదిశ, తూర్పు మాళవ), అవంతి (ఉజ్జయిని, పశ్చిమ మాళవ), సౌరాష్ట్ర (దక్షిణ కథియవాడ్‌ ప్రాంతం), కుకుర (దక్షిణ రాజస్తాన్‌) మొదలైనవి ఉన్నాయి. ఇతడికి వింధ్య, అచవత, పరియాత్ర, సహ్య, కజ్విగిరి, సిరితన, మలయ,/మహేంద్ర, సేత, చకోర మొదలైన పర్వత ప్రాంతాలకు అధిపతి అనే బిరుదు కలదు.Great king of Satavahana Dynasty

నాసిక్‌ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణిని శాతవాహన కుల యశః ప్రతిష్థాపనకరుడని' క్షత్రియ దర్పమాన మర్దనుడని, 'క్షహరాటవంశ నిరవశేషకరుడిని', శక, యవన, పహ్లాన నిషూదనుడని ప్రశంసించింది. అంతే కాకుండా, అతడు 'ఏకబ్రాహ్మణుడని', “ఏకశూరుడని', 'ఏకధనుర్థారుడని', 'ఆగమనిలయూ'డని, త్రివర్గాలయిన ధర్మార్థకామాలను చక్కగా ఆచరణలో పెట్టాడని, వర్ణసాంకర్యాన్ని మాన్పినవాడని చెప్తోంది. 'త్రిసముద్రతోయ పీతవాహని' (మూడు సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు) అనే బిరుదు కలదు. పశ్చిమ క్షాత్రప రాజు సహపాణుని నాణేలను గౌతమీపుత్ర శాతకర్ణి పునర్‌ముద్రించినవి, జోగల్‌తంబి వద్ద ఒక రాశిగా (9270 నాణేలు) లభ్యమయ్యాయి. గౌతమీపుత్ర శాతకర్ణి సహపాణునిపై విజయం సాధించినట్లు తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్‌ గుహల్లో రెండు శాసనాలను రాయించాడు. ఒకటి, అతని 18వ పాలనా సంవత్సరానికి చెందింది. మరొకటి 24 వ పాలనా సంవత్సరానికి చెందింది. ఇతడి నాణేలు కొండాపూర్‌, పెద్దబంకూర్‌లలో వందల కొద్ది దొరికాయి. Great emperor of Satavahana Dynasty

వాసిష్టీపుత్ర పులుమావి (రెండో పులుమావి) (క్రీ.శ. 180-154) Satavahana Dynasty second pulumavi

ఇతడి శాసనాలు నాసిక్‌, కార్లే, అమరావతి, మ్యాకదోని, బనవాసి మొదలైన చోట్ల ఉన్నాయి. ఇతడి రాజధాని ధాన్యకటకం. గౌతమీ బాలశ్రీ నాసిక్‌ శాసనం పులోమావిని దక్షిణాపథీశ్వరుడని పేర్కొంది.

వాసిస్టీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 154-165) About Vasisthiputra Satakarni

క్షాత్రపరుద్రదాముడు తన జునాగడ్‌ శాసనంలో దక్షిణాపథ ప్రభువు శాతకర్ణిని రెండు పర్యాయాలు ఓడించినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రస్తావన వాసిష్టీపుత్ర శాతకర్ణికి సంబంధించిందై ఉంటుంది. ఇతడి పేరుతో ఉన్న వెండి నాణేలు, సీసం నాణేలు గోదావరి, కృష్ణా ప్రాంతాల్లో దొరికాయి. ఇతడి రాణి చెక్కించిన కన్హారీ శాసనంలో, అతని ప్రస్తావన ఉంది. ఈమె తనను మహాక్షాత్రప (రుద్రదామన్‌) కుమార్తెగా చెప్పుకొంది. వాసిస్థీపుత్ర పులుమావి కాలం నాటికి, శాతవాహనులు తమ సామ్రాజ్యంలోని మహారాష్ట్ర భూభాగాన్ని క్షాత్రప రాజులకు కోల్పోయి ఉంటారు.

యజ్ఞశ్రీ శాతకర్ణి (క్రీ.శ. 165-194) Great Yajnasri satakarni

శాతవాహనుల్లో చివరి గొప్పవాడు. ఇతడు పురాణాల్లో 26వ వాడు. కన్హారి వద్ద రెండు శాసనాలు, నాసిక్, చినగంజాం (కృష్ణా జిల్లా) వద్ద కూడా శాసనాలు లభ్యమయ్యాయి. పురాణాలు 29 సంవత్సరాలు పాలించినట్లు పేర్కొన్నాయి. రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ నాణేలు దొరికాయి. ఇతడు ఆచార్య నాగార్జునుడిని, బౌద్ధ మఠాన్ని పోషించాడని అంటారు. ఇతడిని బాణుని హర్షచరిత్ర, 'త్రిసముద్రాధీశ్వరు'డని శ్లాఘించింది. అయితే, కథాసరిత్సాగరం ప్రకారం, నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యచేయబడ్డాడని, . అనంతరం రాజ్యం అల్లకల్లోలమైందని సూచిస్తోంది. యజ్ఞశ్రీ రుద్రదాముని చేతిలో ఓడిపోయి, పశ్చిమ ప్రాంతాన్ని కోల్పోయాడు.

యజ్ఞశ్రీ తరవాత ముగ్గురు శాతవాహన రాజులు 17 సంవత్సరాలు పాలించారు. వారు విజయశాతకర్ణి, చందశ్రీ, నాల్గవ పులుమావి. వీరిలో చివరివాడు మూడో పులుమావి. ఇతడు వేయించిన మ్యాకదోని (కర్నూలు జిల్లా) శాసనం దొరికింది. ఇతని తరవాత సామ్రాజ్యం పతనమైంది. అభీరులు, ఇక్ష్వాకులు, చుటు వంశీయులు, పల్లవులు విజృంభించి, స్వతంత్రులై, సొంత రాజ్యాల నేర్పాటు చేసుకొన్నారు. అంతటితో, శాతవాహన యుగం అంతరించింది.

పరిపాలనా వ్యవస్థ Administrative system of Satavahana Dynasty

శాతవాహనులు మొదట్లో మౌర్యుల పాలనా సంప్రదాయాలను అనుసరించారు. తమ తరవాతి రాజ వంశాలకు పరిపాలనా విధానంలో ఆదర్శప్రాయులయ్యారు. నాసిక్‌, కార్లే గుహ శాసనాల ద్వారా, వీరి పాలనా విధానం గూర్చి వివరాలు తెలుస్తున్నాయి.

చక్రవర్తి అధికారాలు

రాజు రాజ్యానికి అధిపతి. అతడే సర్వాధికారి, సర్వ సైన్యాధ్యక్షుడు. వంశపారంపర్య రాచరికం కొనసాగింది. శాతవాహన రాజులు కొందరు మాతృనామాలు కలిగి ఉన్నా రాజ్యాధికారం మాత్రం మగ వారికే సంక్రమించేది. రాజులు రాజ, మహారాజ వంటి బిరుదులను ధరించారు. అశ్వమేధ, రాజసూయ యాగాలను నిర్వహించారు. శాతవాహనుల కాలం నాటికి, రాజు దైవాంశ సంభూతుడనే భావన ఏర్పడింది. రాజును రాముడు, విష్ణువు మొదలైన పురాణ పురుషుల లక్షణాలు కలిగి ఉన్నట్లుగా భావించారు. ధర్మశాస్త్రబద్ధంగా పరిపాలించాలనేది ఆనాటి రాజుల ఆదర్శం. రాజు ధర్మశాస్త్రబద్ధంగా, ధర్మరక్షకుడిగా ఉండాలనే నియమం ఉండేది.

చక్రవర్తి పరిపాలనా సిబ్బంది

రాజుకు పరిపాలనలో సహాయపడటానికి అమాత్యులు, మహామాత్రులు, విశ్వాసమాత్యులు అనేవారుండేవారు. మహారఠులు (రాష్ట్రాన్ని పాలించే అధికారులు), మహాభోజకులు (రాష్ట్ర పాలకుడి హోదా), మహాసేనాపతి (సైన్యాధిపతి), భండారిక (వస్తురూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవాడు), హెరణిక, లేదా హిరణ్యక (కోశాధికారి), దూతకులు (గూఢచారులు), లేఖక (చక్రవర్తి కార్యదర్శి), నిబంధకర (దస్తావేజులను నమోదుచేసే ఉద్యోగి), మహాతరక (రాజు అంగరక్షకుడు), మహామాత్రులు (బౌద్ధభిక్షువుల బాధ్యతలను చూచేవారు), గ్రామకుడు. (గ్రామాధికారి) మొదలైన ఉద్యోగులుండేవారు.

The Great Empire of the Satavahanas

పరిపాలనా విభాగాలు - అధిపతులు Satavahana Dynsty Administrative Departments – Heads

శాతవాహనుల రాజ్యాన్ని 1) రాజకంఖేట ప్రాతం, 2) సామంతుల ప్రాంతాలు, 3) సరిహద్దు ప్రాంతాలని మూడు విభాగాలుగా విభజించారు. రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాన్ని రాజకంఖేట అనేవారు. మైసూరులో చుటు, కొల్లాపూర్‌లో కుర, విజయపురిలో ఇక్ష్వాక, మహారాష్ట్రలో మహారధులు, మహాభోజులు మొదలైనవారు సామంత రాజులు. సామంత రాజులతో శాతనాహనులకు వివాహ సంబంధాలుండేవి. శాతవాహనుల పాలనా చివరి కాలంలో రాజ్య రక్షణ కోసం, సరిహద్దు ప్రాంతాలను సేనాపతుల ఆధీనంలో . ఉంచారు. వీరే క్రమంగా భూస్వాములుగా అవతరించారు. ఒక మహారఠి సదకన (శాతకర్ణి) కలలాయ, తన సొంత నాణేలను కూడా జారీ చేశాడు.

శాతవాహనులు తమ రాజ్యాన్ని కొన్ని ఆహారాలుగా (రాష్ట్రాలు) విభజించారు. వీటి పాలకులను అమాత్యులనేవారు. సోపారహార, గోవర్ధనహార (నాసిక్‌), మామలహార (పూనే), సాతవాహనిహార మొదలైన ఆహారాలు, రాజధాని పేర్లతో కనిపిస్తాయి. నగరాలను నిగమాలనేవారు. వీటి పాలక సంస్థలను నిగమ సభలనే వారు. భట్టిప్రోలు శాసనంలో ఇటువంటి నిగమ సభ ప్రస్తావన ఉంది. కుల పెద్దలను గహపతులనేవారు. వీరు నిగమ సభలో సభ్యులుగా ఉండేవారు. నగరాలు వాణిజ్య కేంద్రాలు కూడా కాబట్టి, నిగమ సభలు వాణిజ్య సంఘాలు కూడా. తెలంగాణలో కోటిలింగాల, ధూళికట్ట, ఏలేశ్వరం (నల్గొండ), కొండాపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యకటకం, విజయపరి (నాగార్జున కొండ), మహారాష్ట్రలో గోవర్ధన, సోపార, ప్రతిష్టానపురం (పైథాన్‌), కర్ణాటకలోని బ్రహ్మగిరి, ఆనాటి నగరాలు. 

గ్రామీణ పాలనా వ్యవస్థ Satavahanas Rural governance system

ఆహారం తరవాత పాలనా విభాగం, గ్రామం. గ్రామ పాలనా బాధ్యతను చూసే అధికారిని 'గామిక' (గ్రామిక), లేదా గుమిక (గుల్మిక లేదా గౌల్మిక) అనేవారు. హీరహడగళ్ళి శాసనంలో, గాథాసప్తశతిలో గుమికుల ప్రస్తావన ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ గ్రామ పెద్దలు ఒక్క గ్రామానికి కాక, అనేక గ్రామాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. సైనికాధికారులనే గ్రామాధికారులుగా నియమించేవారు. రాజుకు చెల్లించాల్సిన పన్నులను వసూలు చేయడం, శాంతిభద్రతలను కాపాడటం, ఇతని ముఖ్య విధులు. గ్రామాధికారి పదవి వంశపారంపర్యంగా సంక్రమించేది. వంశపారంపర్యంగా పదవులను పొందడం వల్ల, గ్రామాధికారులు రాజకీయంగా బలపడటానికి అవకాశం ఉండేది. ఇది క్రమంగా భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. గ్రామంలోని ప్రజలు వెట్టి చేయాల్సివచ్చేది. ఇంటి పనులు, పొలం పనులు చేయాలి. స్రీలు చేసే రకరకాల వెట్టిని కామసూత్రం పేర్కొంది.

సైన్య నిర్వహణా విధానం Satavahanas Army management system

శాతవాహనులు పెద్ద సైన్యాన్ని పోషించారని, ప్లినీ, సంగమ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. రాజే సర్వసైన్యాధికారి. మహాసేనాపతి సైనిక విషయాలను చూచేవాడు. యుద్ధ సమయంలో రాజే స్వయంగా సైన్యాలను నడిపేవాడు. పశ్చిమాన శకులతో నిరంతరం యుద్ధాలను చేశారు. వీరి సైన్యంలో రథ, గజ, అశ్విక, పదాతి అనే చతురంగ బలాలుండేవి. విలుకాండ్రు కూడా ఉండేవారు. గజ, అశ్వ దళాధిపతులు తలపాగాలను ధరించేపారు. మిగిలిన వారికంటే వీరి హోదా ఉన్నతంగా ఉండేది. శాతవాహనుల సైనిక శిబిరాలను స్కందవారం, కటకమని పిలిచేవారు. స్కందవారం అనేది తాత్కాలిక సైనిక శిబిరం. నగరాల్లోని సైన్యాగారాలను కటకాలనేవారు. ప్రతి ఆహారంలో సైన్యాన్ని పోషించేవారు. శాతవాహనుల పాలనలో సైనిక వర్గాలు ప్రధాన పాత్రను వహించాయి. గ్రామీణ పాలన గౌల్మికుల (గుల్మిక) చేతిలో ఉండేది. వీరు కూడా సైనికాధికారులే. తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, ఇరువది ఐదు గుర్రాలు, నలభై ఐదు మంది కాల్చలాన్ని కలిగిన సైనిక పటాలాధికారిని గౌల్మికుడనేవారు. రాజ్య రక్షణలో కోటలకు ప్రాధాన్యత ఉండేది. పట్టణాల చుట్టూ కోటలను నిర్మించేవారు. కోటిలింగాల, ధూళికట్టల్లో కోటలు, బురుజులు, సింహద్వారాలు బయల్పడ్డాయి. అమరావతి శిల్పాల్లో యుద్దాలు, సైనిక నిర్వహణ గురించిన చిత్రాలున్నాయి. సైనికులు కత్తి, గద, చిన్నసైజు బల్లేలు, డాలు, రక్షక కవచం వంటి ఆయుధాలను ఉపయోగించేవారు.

న్యాయ నిర్వాహణ Satavahanas administration of justice

న్యాయాన్ని 'ధర్మం' అని కూడా ఉంటారు. రాజు ధర్మశాస్త్రాల ఆధారంగా పాలించడం ఆనాటి సంప్రదాయం.అధర్మపరులను శిక్షించడం, సాంఘిక కట్టుబాట్టైన ఆశ్రమ ధర్మాలను కాపాడటం, రాజు విధుల్లో ఒకటి. సామాజిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడటం రాజుల విధి. గ్రామాల్లో తలెత్తే వివాదాలను గ్రామాధికారి పరిష్కరించేవాడు. మౌర్యుల కాలంలో లాగా సివిల్‌, క్రిమినల్‌ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానాలున్నట్లు ఆధారాలు లేవు. స్వల్ప నేరాలకు జరిమానా లాంటి శిక్షలను విధించేవారు. ఇతర నేరాలకు అంగచ్చేదం, దేశాంతరవాస శిక్ష, మరణ శిక్షలను అమలు చేసేవారు. న్యాయ విధానం ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉండేది. అమాయకులను పట్టుకొని, హింసించి నేరం అంగీకరించేట్లు చేసేవారు.

భూమి శిస్తు, రెవిన్యూ విధానం Satavahana Dynasty Land System and Revenue System

ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ మార్గం. రాజులు భూమి శిస్తుగా రాజభోగ్య దేయమేయ అనే రెండు రకాల పన్నులను విధించేవారు. సాధారణంగా భూమి శిస్తును పంటలో 1/6 వంతు మేరకు వసూలు చేసేవారు. గౌతమీపుత్ర శాతకర్ణి ధర్మాన్ని న్యాయాన్ని అనుసరించే పన్నులను విధించేవాడని నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. రహదార్లపై సుంకాలు, గనులు, రేవులు, బాటలు, వృత్తులపై పన్ను విధించడం జరిగింది. వృత్తులపై 'కరుకర' అనే పేరు గల పన్నును విధించేవారు. ఉప్పు తయారీపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. జరిమానాల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ప్రభుత్వానికి పన్నులను ధన రూపంలో చెల్లించేవారు. ధాన్య రూపంలో చెల్లించే అవకాశం కూడా ఉండేది. బ్రాహ్మణులు, సన్యాసులు అన్ని పన్నుల నుంచి మినహాయింపును పొందేవారు. బ్రాహ్మణులకు, బౌద్ధ భిక్షువులకు భూదానాలు చేయడం, మొదటి సారి. శాతవాహనుల నుంచి ప్రారంభమైంది. ఈ విధంగా దానం చేసిన మొదటి చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ప్రభుత్వ అధికారులకు దానం చేసిన భూములపై ఎటువంటి అజమాయిషీ ఉండేది కాదు. రాజులు దాన. ధర్మాలకు, మత: సంస్థలకు, యజ్ఞయాగాదులకు బాగా ఖర్చుపెట్టడం వల్ల, ప్రభుత్వ ఖజానా పై అధిక భారం పడింది.

సామంతుల అధికారాల పెంపు - ప్రభావం Satavahanas Enhancement of Feudal Powers

శాతవాహనుల కాలం నాటికి ప్రభుత్వ విధానంలో భూస్వామ్య పద్ధతి క్రమక్రమంగా చోటు చేసుకోసాగింది. ప్రాంతీయ ప్రభుత్వాలు సామంత ప్రభువుల చేతిలోకి రావడం మొదలైంది. చక్రవర్తికి వార్షిక కప్పం చెల్లిస్తూ, సైనిక సహాయం అందిస్తూ, మహాభోజులు, మహారధులు అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పదవులు వాడుకలోకి వచ్చాయి. శాతనాహనుల పతనానంతరం, వీళ్ళలో చాలా మంది స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు.

మ్యాకదోని (కర్నూలు జిల్లా) లో శాతవాహన రాజు శ్రీ పులుమావి 8వ పాలనా సంవత్సరానికి సంబంధించిన శాసనంలో, మహాసేనాపతి, పదవీ నిర్వహణ ఒప్పందం కింద ఒక ఆహారం (జిల్లా) మీద హక్కును పొందాడు. సైన్యాల నిర్వాహణ కోసం దీన్ని పొందాడు. అందులోని ఒక గ్రామాన్ని తన కింది అధికారికి తిరిగి కౌలుకు ఇచ్చాడు. దీన్నే ఎగువ స్థాయి నుంచి భూస్వామ్య వ్యవస్థ వచ్చిందనడానికి మొదటి ఆధారమని డి.జి.కోశాంబి పేర్కొన్నాడు. గ్రామీణ పాలన 'గౌల్మికుల' (గుల్మిక) చేతిలో ఉండేది. వీరు కూడా సైనికాధికారులే. గౌల్మికుడు అంటే 30 మంది సైనికులకు నాయకుడని అర్థం. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సైనికాధికారులనే నియమించేవారు.

ఆర్థికాభివృద్ధి Satavahanas Economic development

వ్యవసాయం

శాతవాహనుల కాలంలో దక్కన్‌లో ఎక్కువ ఆర్థికాభివృద్ధి జరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి. వరి, జొన్న జనుము, నువ్వులు, చెరకు ప్రధాన పంటలు. గోధుమ, కంది, పెసర, ఆముదం, కొబ్బరి, పత్తి ఇతర పంటలు. భూములను దున్నడానికి ఎద్దులతోపాటు, గాడిదలు, దున్నలను కూడా ఉపయోగించేవారు. శాసనాల్లో ఆవులు, భూములు, గ్రామాలను దానంగా ఇచ్చేవారని పేర్కొనడాన్ని బట్టి, ప్రజా జీవితంలో వాటికున్న ప్రాముఖ్యత స్పష్టమౌతుంది. రాజుకు సొంత భూములుండేవి. బంజరు భూముల సాగు కోసం, గ్రామాల్లో రైతుల చేత వెట్టి (విష్టి) చేయించేవారు. కాలువలు, ఆనకట్టలు ఉన్నప్పటికి, వ్యవసాయానికి బావులే ప్రధాన నీటి సరఫరా ఆధారాలు. కాలువలు, బావుల నుంచి నీళ్ళు తోడటానికి ఉదక యంత్రాలను వాడేవారు. దీన్నే 'పర్షియా చక్రం' అంటారు. దీనికి బక్కెట్లను ఒక దండగా చక్రానికి అమర్చి, జంతువులతో నడిపేవారు. మ్యాకదోని శాసనం ప్రకారం, ఒక గహపతి (ఇంటి యజమాని) జలాశయాన్ని నిర్మించినట్లు ప్రస్తావించబడింది.

శాతవాహనుల కాలం నాటి శాసనాల వల్ల, మత సంస్థలకు, వ్యవసాయానికి, చెట్లు పెంచేందుకు, గ్రామాలు, భూములను దానంగా ఇచ్చారని తెలుస్తుంది. రాజు గ్రామాలను గాని, భూములను గాని దానంగా ఇచ్చేందుకు, రైతుల యాజమాన్యంలోని భూములనాక్రమించకుండా వాటిని రైతుల నుంచి ఖరీదుకు కొని మాత్రమే దానంగా ఇచ్చేవాడు. కన్హారీ శాసనాల ద్వారా జౌద్ధ ఆరామాలకు, బౌద్ధ సన్యాసులకు, వర్తకులు, సామాన్య ప్రజలు భూములను స్వతంత్రంగా దానం ఇచ్చేవారని తెలుస్తుంది. ఒక సన్యాసికి వస్త్రాలను సమర్పించేందుకు .ముగుదాసుడు అనే వ్యక్తి కొంత భూమిని దానమిచ్చినట్లుగా, నాసిక్‌ శాసనం పేర్కొంది. క్షాత్రప సహపాణుని అల్లుడు, ఉషవదత్తుడు (బుషభదత్తుడు) అశ్వభూతి అనే ఒక బ్రాహ్మణుని నుంచి భూమిని 4000 కర్షాపణాలకు కొని దాన్ని తిరిగి దానం ఇచ్చినట్లుగా మరొక నాసిక్‌ శాసనం పేర్కొంది. గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇవ్వడమే గాక, ఆ భూముల మీద పరిపాలన, ఆర్థిక సంబంధమైన హక్కులను కూడా వారికి ఇచ్చాడని, నాసిక్‌ శాసనం తెలుపుతుంది. ఈ భూములపై వారు పన్ను చెల్లించనవసరం లేదు.

పరిశ్రమలు, వృత్తులు

శాతవాహనుల కాలంలో కుటీర పరిశ్రమలు అభివృద్ధిచెందాయి. మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని ఇనుప ఖనిజ నిక్షేపాలను శాతవాహనులు ఉపయోగించుకొన్నట్లు ఆధారాలున్నాయి, ఇటుకలను కాల్చడం, గుండ్రని చేద బావుల్ని తవ్వడం నేర్చుకొన్నారు. పెద్ద బంకూర్‌ (కరీంనగర్‌ జిల్లా) లో క్రీ.పూ.200 నుంచి క్రీ.శ. 200 మధ్య కాలంలో కాల్చిన ఇటుకలను, ఇంటి కప్పులకు పనికివచ్చే సమతలంగా ఉన్న పెంకులను ఉపయోగించారు. ఇక్కడే 22 ఇటుక కట్టడం బావులు బయటపడ్డాయి. ఇక్కడ మురికి నీటి కాలువలను కూడా నిర్మించుకొన్నారు.

శాతవాహన యుగంలో 18 రకాల వృత్తులుండేవని శాసనాల వల్ల తెలుస్తుంది. కోలికులు (నేతకారులు), తిలపిషకులు (నూనె తీసేవారు), కొసాకారులు (ఇత్తది పనివారు), కులరికులు (కుమ్మరులు), తెసకారులు (మెరుగుపెట్టే వారు), కమారులు (కమ్మరులు), మాలాకారులు (పూల వర్తకులు), ఓదయంత్రికులు (ఉదక యంత్రాలను తయారుచేసేవారు), లోహవాణియలు (ఇనుప వర్తకులు), సువణకారులు (సువర్జకారులు), వధకులు (వడ్రంగులు), సేలవధకులు (రాతి పనివారు) అవేసినులు (చేతి వృత్తులవారు), లేఖకులు (రాయసగాళ్లు), చమ్మకారులు (చర్మకారులు), పసకరులు (మేదరివారు), మీఠికులు (రాయి మెరుగుపెట్టే వారు), గధికులు (సుగంధ ద్రవ్యాల వర్తకులు), మణికారులు (రత్నపనివారు) అనే వృత్తుల వారిని శాసనాలు పేర్కొంటున్నాయి.

శాతవాహన యుగంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించిన వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. ప్రతి శ్రేణికి 'శ్రేష్టి' అనే అధ్యక్షుడు ఉండేవాడు. శ్రేణులు వారి ప్రయోజనాలను పలురకాలుగా కాపాడేవి. జున్నార్‌ శాసనాలు 'ధన్నుక' (ధాన్యం) 'కాసాకార' 'తెసకారి శ్రేణులను పేర్కొన్నాయి. గోవర్ధనలో  “కొలీకనికాయ” శ్రేణులుండేవి. నాసిక్‌ శాసనాలు 'కులరిక','శ్రేణి, 'తిలపషక' శ్రేణి, 'ఒదయంత్రిక శ్రేణి, మొదలయిన శ్రేణులను పేర్కొన్నాయి. శ్రేణులు నేటి బ్యాంకుల కార్యకలాపాలను కూడా నిర్వహించేవి. అవి డిపాజిట్లను తీసుకొనేవి. అప్పులను కూడా ఇచ్చేవి. జున్నార్‌ శాసనం నుంచి బౌద్ధ మతానికి చెందిన ఒక వ్యక్తి, రెండు వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని, 'కొనచిక' అనే పట్టణంలో ఉన్న శ్రేణిలో డిపాజిట్‌ చేసి, దానిపై వడ్డీ ద్వారా వచ్చే ఆదాయాన్ని చెట్లు నాటేందుకు నిర్దేశించాడని తెలుస్తుంది. జున్నార్‌ శాసనం నుంచి ధాన్యం వ్యాపారుల శ్రేణి, ఏడు గదులు కలిగిన గుహను, జలాశయాన్ని దానంగా ఇచ్చిందని తెలుస్తుంది. వాటి కార్యకలాపాల్లో నిజాయితీ, నిష్పక్షపాతం ఉండేవి. శ్రేణుల్లో ఉంచబడిన డిపాజిట్లు, వ్యాపారస్థులకు పెట్టుబడులుగా ఉపయోగపడి, వారి వ్యాపార కార్యకలాపాలకు ప్రోత్సహకరంగా ఉండేవి. శ్రేణులు దానంగా ఇచ్చిన ఆస్తిని కూడా స్వీకరించేవి. వాటిపై వచ్చిన ఆదాయాన్ని నిర్దేశించిన ప్రత్యేక ప్రయోజనాల మీద ఖర్చుపెట్టేవి. అప్పులు ఇచ్చి, వాటి మీద వడ్డీ కూడా వసూలు చేసేవారు. సాధారణంగా సంవత్సరానికి 12 శాతం వడ్డీ ఉండేది. ఉషవదత్తుని నాసిక్‌ శాసనం, గోవర్ధనలోని చేనేత పనివారి శ్రేణి రెండు డిపాజిట్లను స్వీకరించినట్లుగా పేర్కొంది. అందులో మొదటిది నెలకు ఒక శాతం వడ్డీరేటు మీద 2,000 కార్షాపణలు; రెండోది నెలకు 3/4 శాతం వడ్డీరేటు మీద రూ.1000 కార్షాపణలు; మొదటి డిపాజిట్‌ మీద వచ్చే వడ్డీ మొత్తాన్ని, నాసిక్‌లోని గుహలో .వర్షా కాలం నివాసం ఏర్పాటు చేసుకొన్న బౌద్ధ సన్యాసులకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి వస్త్రాలు కొనేందుకు గాను, 12 కార్షాపణలుగా ఖర్చుపెట్టడానికి ఉద్దేశింపబడింది. రెండో డిపాజిట్‌ మీద వచ్చే వడ్డీ మొత్తాన్ని, ఆ బౌద్ధ సన్యాసులకు ఇతర అవసరాల నిమిత్తం ఖర్చుపెట్టేందుకు ఇవ్వబడింది.

దేశీయ, విదేశీయ వ్యాపార ప్రగతి Satavahanas Domestic and foreign business progress

శాతవాహన యుగంలో దేశీయ, విదేశీయ వ్యాపారం అభివృద్ధిచెందింది. విదేశీ వ్యాపారం చేసే వర్తకులకు సార్ధవాహులని పేరు. వర్తకులు కూడా శ్రేష్టి (సెట్టి) అనే వాని నాయకత్వంలో, ఒక శ్రేణిగా ఏర్పడ్డారు. శాతవాహన రాజ్యంలో, మహారాష్ట్రలో ప్రతిష్థానం, తగర, జున్నార్‌, నాసిక్‌, వైజయంతి; ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యకటకం, విజయపురి, గూడూరు (కృష్ణా జిల్లా), కంటకసేల. (ఘంటసాల) వర్తక కేంద్రాలుగా ప్రధానమైనవి. తెలంగాణాలో కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌లు ప్రధానమైన వర్తక కేంద్రాలు. వివిధ ప్రాంతాలను కలుపుతూ మార్గాలు కూడా ఉండేవి. ఎడ్ల బండి ప్రధాన ప్రయాణ సాధనం. భారతదేశం, రోమ్‌ మధ్య జరిగిన వాణిజ్యాన్ని గూర్చి తెలిపే అనేకాధారాలున్నాయి. ఒక అజ్ఞాత నావికుడు రాసిన 'పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌సి',  'ఈజిప్షియన్‌-గ్రీక్‌ భౌగోళిక శాస్త్రవేత్త' టాలమీ రచించిన 'జాగ్రఫీ' అనే గ్రంథం, రోమన్‌ నావికుడు ఫ్లీనీ రచించిన 'నాచురల్‌  హిస్టరీ' అనే గ్రంథం వివరాలను అందిస్తున్నాయి. భారతదేశంలోని వర్తక కేంద్రాలు, రేవు పట్టణాలు, వర్తకి మార్గాలు, వాణిజ్య వస్తువులు, ఆదిగా గల వివరాలను అందిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా దొరికిన రోమన్‌ నాణేలు, సాహిత్య గ్రంథాల్లోని వివరాలను ధృవపరుస్తున్నాయి. రోమన్‌ నాణేలు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, అత్తిరాల (కడప జిల్లా), అమరావతి, నాగార్జునకొండ, వినుకొండ, చేబ్రోలు, ఒంగోలు, నంద్యాలలో; తెలంగాణలో నల్గొండ జిల్లాలో గూటిపర్తి, అక్కెనపల్లి, ఏలేశ్వరం, కరీంనగర్‌ జిల్లాలో స్తులాపూర్‌, పెద్దబంకూర్‌, ఖమ్మం జిల్లా నాగవరప్పాడులో, విడివిడిగా, కుప్పలుగా కూడా దొరికాయి. తమిళనాడులోని అరికమేడు. (పాండిచ్చేరి సమీపంలో) వద్ద ఎన్నో బంగారు నాణేలు దొరికాయి. అరికమేడు రోమన్‌ వర్తక కేంద్రం. ప్రతి. సంవత్సరం రోమ్‌ నుంచి భారతదేశానికి ఒక కోటి 25 లక్షల దీనార్‌లు, రోమన్‌ సామ్రాజ్యం నుంచి చేరేవని ప్లినీ పేర్కొన్నాడు. రోమన్‌ సామ్రాజ్యానికి బానిస స్త్రీలు, రకరకాలైన జంతువులను, నెయ్యి, నువ్వుల నూనె, పట్టు, పట్టు వస్త్రాలు, నూలు బట్టలు, మిరియాలు, వనమూలికలు, తమలపాకులు, బెల్లం, చందనం చెక్కలు, టేకు చెక్కలు, కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, ఉల్లిపాయలు, చింతపండు, సుగంధ ద్రవ్యాలు, ఉక్కు నూలు గుడ్డలను ఎగుమతి చేసేవారు. శ్రీలంక నుంచి ముత్యాలు, ఇండియా నుంచి వజ్రాలు ఎగ్గుమతయ్యేవి. ముజిరిస్‌ (క్రాంగనూర్‌, కేరళ) నుంచి మిరియాలు పెద్ద మొత్తంలో ఎగుమతవుతున్నట్లు పెరిప్లస్‌ పేర్కొంది. భారతదేశం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో బంగారం, వెండి, రాగి, గాజు సామానులు, మైపూతలు, మత్తుపానీయాలు, మొదలయినవున్నాయి. వాణిజ్యం మొదటి నుంచి భారతీయులకే లాభదాయకంగా ఉండేది. అందువల్ల రోమన్‌ దేశపు బంగారం పెద్ద మొత్తంలో భారతదేశం చేరింది.

శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలోని సొపార్‌ (సోపార), కల్యాణ్‌ (కల్యాణి), భరుకచ్చం (బోచ్‌) వంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వర్తకం కొనసాగింది. తూర్పు తీరంలో కంటకసేల (ఘంటసాల), కొడ్డూర (గూడూరు), మైసోలియా (మచిలీపట్నం), అల్లోసిగ్నేలు (అదుర్రు) ఓడరేవులని టాలమీ తెలిపాడు.

సామాజిక వ్యవస్థ Satavahanas Social system

కుతూహలుని లీలావతి, హాలుని గాథాసప్తశతి, గుణాధ్యుని బృహత్మథ ఆధారంగా రాయబడ్డ కథాసరిత్సాగరం, అమరావతి, భట్టిప్రోలు నాగార్జునకొండ స్టూపాలపై గల శిల్పాల ఆధారంగా, శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులను గ్రహించొచ్చు. శాతవాహన యుగం నాటికే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చాతుర్వర్ణ వ్యవస్థ తెలంగాణ సమాజంలో వేళ్ళూనింది. దీన్ని ఆర్యుల సంస్కృతి తెలంగాణాకు వ్యాపించిన పరిణామంగా భావించొచ్చు. బ్రాహ్మణులు వేద, వేదాంగాల అధ్యయనం చేసేవారు. క్షత్రియులు క్షత్రియ విద్యను అభ్యసించేవారు. వైశ్యులు వర్తక వ్యాపారాలను నిర్వహించడం, శూద్రులు వ్యవసాయం చేయడం వృత్తి ధర్మంగా భావించారు. సమాజంలో బ్రాహ్మణులకు గౌరవముండేది. బ్రాహ్మణులకు దానాలను కూడా చేసేవారు. వారికి పన్నుల నుంచి మినహాయింపు ఉండేది. వర్ణ ధర్మాలను పాటించేలా చూడటం రాజుల విధి. గ్రీకులు, శకులు, పహ్లా హ్హవులు, కుషాణులు, మొదలగు విదేశీయులు భారతీకరణ పొంది, క్షత్రియులుగా గుర్తింపు పొందారు. వారు హిందూ మతాన్ని గాని, బౌద్ధ మతాన్ని గాని స్వీకరించారు. శక నహపాణుని కుమార్తె దక్షమిత్ర, అల్లుడు ఉషవదత్తుడు, చస్తనుని కుమారుడు జయదమనుడు, శక రుద్రదమనుడు మొదలైన వారందరూ హిందువుల పేర్లను పెట్టుకొన్నట్లు గమనించొచ్చు. శాతవాహన యుగంలో కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు. కులాంతర వివాహాలు జరిగినట్లు, కథాసరిత్సాగరంలో ఉంది. హాలుడు శ్రీలంక రాకుమారి లీలావతిని వివాహం చేసుకొన్నట్లు, లీలావతి కావ్యంలో ఉంది. మొదటి శాతకర్ణి, మహారఠి త్రణకయిరో కూతురును వివాహం చేసుకొన్నాడు. మరొక శాతవాహన రాజు శక రుద్రదమనుని కూతురును వివాహం చేసుకొన్నాడు. అయితే, గౌతమీపుత్ర శాతకర్ణి, పైవాటికి భిన్నంగా, తాను వర్ణ సాంకర్యాన్ని రూపుమాపడానికి ప్రయత్నించానని గర్వంగా చెప్పుకోవడం జరిగింది.

శాతవాహనుల కాలంలో సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది: కుటుంబంలోని సభ్యులందరు ఉమ్మడిగా చేసిన దానాల వివరాలు శాసనాల్లో ఉన్నాయి. పితృస్వామ్య వ్యవస్థ నెలకొన్నప్పటికి, స్త్రీలకు సమాజంలో గౌరవం, స్వేచ్చఉండేవి. ఉన్నత కుటుంబీకులైన మహిళలు తమ భర్త పదవుల హోదాను ధరించేవారు. మహాభోజియని, మహాసేనాపతి, మహాతలవరిని లాంటి బిరుదులు ధరించేవారు. చాలా మంది శాతవాహన రాజులు తమ పేరుకు ముందు, తల్లిపేరును ధరించేవారు. గౌతమీపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులుమావి, కౌశకీపుత్ర శాతకర్ణి తమ పేర్లకు ముందు తల్లి గోత్రాన్ని (గౌతమీ, వశిష్ట) ధరించారు. కొందరు రాణులు పరిపాలనలో కూడా భాగస్వాములయ్యారు. మొదటి శాతకర్ణి భార్య నాగానిక, తన భర్త మరణానంతరం, కుమారుడు వేదిశ్రీకి సంరక్షకురాలుగా రాజ్యభారాన్ని వహించింది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌ ప్రశస్తిలో, తాను స్వతంత్రంగా చేసిన దానాల వివరాలు ఉన్నాయి. స్త్రీలు వర్తక సంస్థల్లో, వివిధ పరిశ్రమలకు సంబంధించిన శ్రేణి, నిగమాల్లో, పెట్టుబడులను కూడా పెట్టేవారు.

శాతవాహనుల నాటి శాసనాలు వివిధ వృత్తి పనివారిని పేర్కొన్నాయి. ఒక్కొక్క వృత్తి తరవాతి కాలంలో ఒక్కొక్క కులంగా మార్పు చెందింది. హాలిక (వ్యవసాయదారులు), గధిక (సువాసన ద్రవ్యాలను తయారుచేసేవారు), వధ (వడ్రంగి), కోలికులు (నేతపనివారు), తిలపిసక (గానుగ కట్టేవారు), కమర (కమ్మరి), కులరిక (కుమ్మరులు), ఉదయంత్రిక (నీటిపారుదల నిపుణులు), ధన్నిక (ధాన్య వర్తకులు), వసకర (వెదురు పనివారు), ధన్నక (ధాన్యవర్తకులు) మొదలగు వృత్తులుండేవి.

శాతవాహనుల కాలం నాటి తెలుగు ప్రజల వస్త్రధారణ ఆనాటి శిల్పాలు, చిత్రాల వల్ల తెలుస్తుంది. తెలంగాణలో కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబంకూరు, కదంబాపూర్‌, కొండాపూర్‌, మొదలైన చోట్ల జరిపిన తవ్వకాల్లో మట్టి గాజులు, కడియాలు, రకరకాల పూసలు, చెవి పోగులు, కంకణాలు, కాళ్ళ అందెలు, దండ కడియాలు లభ్యమయ్యాయి. స్త్రీ, పురుషులు ఆభరణాలను ధరించేవారు. అమరావతి శిల్పాలు, చిత్రాలు, ప్రజల వస్త్రధారణకు సా క్ష్యంగా ఉన్నాయి. సంగీతం, నృత్యం అభివృద్ధిచెందాయి. ఎడ్ల పందేలు, కోడి పందేలు నాటి ప్రజల ఇతర వినోదాలుగా ఉన్నాయి.

శాతవాహనుల. కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. ధనవంతుల ఇళ్ళలోను, . కర్మాగారాల్లోను, వ్యవసాయ పనుల్లోను, వ్యాపారుల వద్ద బానిసలు పనిచేసేవారు. గుణాధ్యుని బృహత్కథలో అనేక సందర్భాల్లో బానిస వ్యాపారాన్ని గురించి ప్రస్తావన చేయబడింది. వారిని అతి నీచంగా చూచేవారని పేర్కొన్నాడు.

నాటి మత రంగ పరిణామాలు

శాతవాహనుల కాలంలో వైదిక, బౌద్ధ, జైన మతాలు  దక్కన్‌లో విరాజిల్లాయి.

వైదిక మతం

శాతవాహన రాజుల్లో చాలా మంది వైదిక మతస్థులు. మొదటి శాతకర్ణి అనేక వైదిక క్రతువులను నిర్వహించాడు. ఈ సందర్భంలో బ్రాహ్మణులకు వేలకొలది గోవులను, కార్షాపణాలను దానం చేసినట్లు నానేఘాట్‌ శాసనం తెలుపుతుంది. తన కుమారులలో ఒకరికి వేదశ్రీ అని పేరు పెట్టుకొన్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుల సమర్ధకుడు మాత్రమే కాదు (ఏక బ్రాహ్మణ). అతడు సంప్రదాయ శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు (ఆగమ నిలయుడు), రాముడు, కేశవుడు, అర్జునుడు, భీమసేనుడు వంటి పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకొన్నాడని నాసిక్‌ శాసనం పేర్కొంటుంది. నానేఘాట్‌ శాసనంలో సంకర్షణ, వాసుదేవుడు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, దిక్పాలకులైన వాసవ, కుబేర, వరుణ, యమ లను స్తుతించడమైంది. క్రతువు ప్రధానంగా ఉన్న వైదిక మతం స్థానంలో, భక్తియే ప్రధానమైన పౌరాణిక హిందూ మతం చోటు చేసుకొన్నట్లు తెలుస్తుంది. నానేఘాట్‌ శాసనంలో సంకర్షణ, వాసుదేవ, కేశవ, గోవర్ధన, కృష్ణ, గోపాల వంటి పేర్లను బట్టి, వైష్ణవ మతం, లేదా భాగవత మతం కూడా ప్రారంభమైందని తెలుస్తుంది. గాధాసప్తశతి కృష్ణుని మధుమధనుడని, దామోదరుడని కీర్తించింది. ఇందులో గోపికలు, యశోద ప్రస్తావన ఉంది. విష్ణువు సర్వవ్యాపకుడు అని భోధించే తత్వాన్ని వైష్ణవం అంటారు. కృష్ణవాసుదేవుడు భాగవత తత్వానికి ఆద్యుడు. భాగవత తత్వం రెండవ దశలో వైష్ణవ మతంగా మారింది. గాధాసప్తశతిలో ప్రారంభం, ముగింపులో పశుపతి, గౌరీ స్తోత్రముంది. శైవారాధన కూడా క్రీ.పూ. 2 శతాబ్దం నాటికి చోటు చేసుకొంది. క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి అతిపెద్ద శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో ఉంది. ఇక్కడి శివలింగంపై శివుని ప్రతిమ ఉంది. శైవంలో అతి ప్రాచీనమైన పాశుపత శైవాన్ని క్రీ.శ ఒకటవ శతాబ్దంలో లకులీస శివాచార్యులు స్థాపించారు. శాతవాహనుల కాలంలో ఇది దక్షణాదికి వ్యాపించింది. శక్తీ తత్వం కూడా ప్రారంభమైంది.

శాతవాహన యుగం - పరిణామాలు

జైనం

బౌద్ధమతం కోస్తాంధ్రలో, జైన మతం తెలంగాణలో ప్రబలంగా ఉండేది. మొదటి జైన మత తీర్ధంకరుడైన బుషభనాధుడు వారణాసి రాజు. ఇతని తర్వాత అతని పెద్ద కుమారుడు ఉత్తముడు కాశీకి రాజు కాగా, రెండవ రాజు బాహుబలి అశ్శక (బోధన్‌) కు పాలకుడయ్యాడు. జైన తీర్థంకరుల్లో, పదవ వాడైన శీతలనాధుడి జన్మస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం (భాదలపురి). క్రీ.పూ.4వ శతాబ్దంలో మగధలో కరువు సంభవించగా, భధ్రబాహు నాయకత్వంలో, జైనులు కర్ణాటకలోని శ్రావణ బెళగోళకు వెళ్ళి, 12 సంవత్సరాలుండి తిరిగి మగధ వెళ్ళారు. భధ్రబాహు మూలంగా జైన మతం కర్తాటక, ఆంధ్ర, తెలంగాణాకు వ్యాపించింది. అశోకుని మనుమడు సంప్రతి జైన మతాన్ని స్వీకరించి, ఆంధ్ర దేశానికి జైన ప్రచారకులను పంపాడు.

బౌద్దమతం

క్రీపూ6వ శతాబ్దంలో బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం అతడి జీవిత కాలంలోనే తెలంగాణా-ఆంధ్ర ప్రాంతాలకు వ్యాపించింది. షంబల రాజు సుబేంద్రుని కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించి, కాలచక్రమూల తంత్రోపదేశం చేశాడని, టిబెటన్‌ బౌద్ధుల విశ్వాసం. కాలచక్ర అనేది టిబెటన్‌ అత్యున్నత యోగ తంత్రంకు చెందిన ఒక బౌద్ధతాంత్రిక పద్ధతి. అశోకుని పాలనకు పూర్వమే బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతానికి. వ్యాపించినట్లు సుత్తనిపాదం, కథావత్తులాంటి గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. సుత్తనిపాదంలోని బావరి వృత్తాంతం దీనికి ఉదాహరణ. అశ్మక రాజ్యంలో (కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌) గోదావరి నదిలోని కవిటవన ద్వీపంలో నివసిస్తున్న బావరి, రాజగృహలోనున్న బుద్ధుడిని కలుసుకోవడానికి, 16 మంది జ్ఞానులైన తన శిష్యులను పంపాడు. వారు బుద్ధుడిని కలుసుకొని అతని బోధనలు విని బౌద్ధ మతం స్వీకరించారు. వారు తిరిగొచ్చి, తమ గురువు బావరికి ఈ విషయాన్ని తెలుపగా, అతడు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కరీంనగర్‌ జిల్లాలోని బావనకుర్తి ఇతని నివాసమని కొందరు పండితుల అభిప్రాయము. 

బుద్ధుని మహాపరినిర్యాణం తర్వాత వంద సంవత్సరాలకు రెండవ బౌద్ధ సంగీతి (మహాసభ) వైశాలిలో జరిగింది. మహాదేవ భిక్షువు నాయకత్వంలో ఆంధ్ర నుంచి వెళ్ళిన యువ భిక్షువులు బౌద్ధ సంఘ నియమావళిలో (వినయ) మార్పులు కావాలని పట్టుబట్టినారు. సనాతన భిక్షువులు మార్పులను వ్యతిరేకించారు. దీనితో బౌద్ధ సంఘంలో విభేదాలేర్పడి, థేరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయారు. మహాసాంఘిక శాఖకు జన్మభూమి ధాన్యకటకమేనని భావించొచ్చు. అశోకుని 13 వ శిలా శాసనం ఆంధ్రులు అప్పటికే బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నది. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సభలోని చర్చల్లో అంధకులు (ఆంధ్రులు) పాల్గొన్నారని 'కథావత్తు' పేర్కోన్నది.

క్రీ పూ. 2వ శతాబ్దం నాటికి తెలంగాణలో బౌద్ధ మతం గట్టిగా వేళ్ళూనుకొని ఉన్నట్లు ధూళికట్ట, పాశగాం స్టూపాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. పాశీగాం బౌద్ధ స్టూపాన్ని 'చెన్నుపూస' అనే బౌద్ధ పండితుడు నిర్మించినట్లు బి.యన్‌. శాస్త్రి పేర్కొన్నాడు. దీని ప్రాచీన పేరు చెన్న పూసగాం. అది తర్వాత కాలంలో పాశగాం గా మారింది. పూస అంటే ఆచార్యుడని అర్ధం.

శాతవాహన రాజులు వైదిక మతావలంబికులైనప్పటికి, బౌద్ధ మతాన్ని కూడా పోషించారు. శాతవాహన రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించారు. గౌతమీపుత్ర శాతకర్ణి తన తల్లి గౌతమీబాలశ్రీ గౌరవార్థం,త్రిరశ్మి వద్ద ఒక గ్రామాన్ని బౌద్ధ భిక్షువులకు దానంగా ఇచ్చాడు. శాతవాహనుల సమకాలీనుడైన సింహళ రాజు దుప్పిగామిణి, (క్రీ.పూ.మొదటి శతాబ్దం) తామ్రపర్ణిలోని (సింహళం) అనురాధపురంలో నిర్మించిన బౌద్ధ స్థూపోత్సవానికి పల్లవబొగ్గ (పల్నాడు) నుంచి చైత్యకవాద ప్రవర్తకుడైన మహాస్థవిరుడి నాయకత్వంలో 4 లక్షల అరవై వేల మంది భిక్ష సంఘంతో వెళ్ళాడని, సింహళ బౌద్ధ గ్రంథం, మహావంశం తెలుపుతుంది.

రాజ కుటుంబీకులే గాకుండా, అధికారులు, వర్తకులు, వృత్తిపనివారు, ధనవంతులైన స్త్రీలు బౌద్ధాన్ని ఆదరించి పోషించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. బౌద్ధ బిక్షువుల కోసం సంగ్రామాలను, భూములను, ధనాన్ని దానం చేయడంలో పోటీపడ్డారు. నాసిక్‌, జున్నార్‌, కన్హారి మొదలైన శాసనాలు, వివిధ శ్రేణులు కొంత ధనాన్ని డిపాజిట్‌ చేసి దాని మీద వచ్చే వడ్డీని బౌద్ధ భిక్షువుల కోసం దానం చేసినట్లు వివరిస్తున్నాయి. రాజుల ఆదరణ కంటే, వ్యాపార వర్గాలు, వివిధ వృత్తుల వారి ఆదరణ మూలంగానే బౌద్ధ మతం విరాజిల్లిందని చెప్పొచ్చు.

బౌద్ధ మత మూలంగా దక్కన్‌లో చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మించబడ్డాయి. మహారాష్ట్రలో భాజ, కారా, నాసిక్‌, కన్టేరి, కొండనె, బేడా. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు, శాలిహుండం, అల్లూరు, ఘంటసాల, జగ్ధయ్యపేట, చందవరం, దూపాడు, చినగంజాం, శంఖవరం, గుంటుపల్లి, రామతీర్థం, బొజ్జన్నకొండ, గుమ్మడిదుర్రు, గుడివాడ, గోలి, తెలంగాణలో కొండాపూర్‌, ఫణిగిరి, తిరుమలగిరి (నల్గొండ జిల్లా) ధూళికట్ట, పాశెగాం, మీర్జంపేట (కరీంనగర్‌ జిల్లా) ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు.

క్రీశ మొదటి శతాబ్దంలో ఆంధ్రలోనే మహాయాన బౌద్ధం అవతరించింది. మహాసాంఘికులే మహాయానులుగా, పిలువబడ్డారు. అందుకే బుద్ధఘోషుడు మహాసాంఘికులను అంధక శాఖలుగా వ్యవహరించాడు. హీనయానం అంటే చిన్న బండి అని అర్ధం. వీరు సంప్రదాయవాదులు. బుద్ధుడు మహోన్నత వ్యక్తి. ప్రతి ఒక్కడు ఆ స్థితికి చేరుకోవచ్చు.ఎవరికి వారు నిర్వాణం పొందడం వీరి లక్ష్యం. బుద్ధుడిని విగ్రహాలుగా చెక్కి పూజించ రాదు. బుద్దుని కేవలం చిహ్న రూపంలో మాత్రమే ఆరాధించాలి. మహాయానం అంటే పెద్ద బండి అని అర్ధం. వీలైనంత మందిని నిర్వాణ మార్గంలో పెట్టాలి. ఎవరికి వారు నిర్వాణం పొందటమనే సూత్రం బుద్దుని బోధనలకు వ్యతిరేకం. అది స్వార్ధంతో కూడుకున్నది. మహాయానులు బుద్ధుడిని విగ్రహాలుగా చెక్కి పూజిస్తారు. బౌద్ధ నియమావళిలో, బౌద్ధ ధర్మంలో మార్చు కోరే వారిని మహాయానులు అంటారు. నాసిక్‌, కార్లా శాసనాల్లో భద్రయానీయుల ప్రసక్తి ఉంది. సోపారలో ధర్మోత్తరీయులనే మరొక శాఖ వారున్నారు. ఈ రెండూ థేర వాదంలోని శాఖలే. మహా సాంఘికుల్లో పూర్వశైలీయులు (పుబ్బతైలం) అపరశైలీయులు అనే శాఖలు అవతరించాయి. అమరావతి పూర్వశైలీయులకు, నాగార్జునకొండ అపరశైలీయులకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. బౌద్ధ మతంలోని రాజగిరుకులు, మహిశాసకులు, సిద్ధాంతికులు వంటి శాఖలు కూడా ఆంధ్రదేశంలో ఉండేవి. బౌద్ధ మతంలో 18 శాఖలేర్చడగా, అందులో తొమ్మిది శాఖలు ఆంధ్రదేశంలోనే ఉండేవి. శాసనాల ఆధారంగా అమరావతిలో చైత్యక అనే మరొక శాఖ ఉండేదని తెలుస్తుంది. బుద్దుడికి మొదట లోకోత్తర లక్షణాలు ఆపాదించి, విగ్రహారాధనకు అంకురార్పణ చేసిన వారు ఆంధ్రులైన చైత్యకులు. ఈ నూతన భావం ఫలితంగా బుద్దుని జీవిత ఘట్టాలను-కమలం (పుట్టుక), గుర్రం (మవాభి నిష్రమణం), బోధి వృక్షం (జ్ఞానోదయం), ధర్మచక్రం (ధర్మచక్ర ప్రవర్తనం), స్తూపం (నిర్వాణం), త్రిశూలం (త్రిరత్నాలు), ఉనికి (పాదాలు) - మొదలైన వాటిని చెక్కి ఆరాధించడం ప్రారంభమైంది.

ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక శాస్త్రాల్లో పండితుడు. ఇతనిని రెండవ బుద్ధుడు అంటారు. “లంకావతార సూత్రం” ననుసరించి, ఇతను 'వేదలి' అనే గ్రామంలో జన్మించాడు. 'వేదలి' తెలంగాణలోనే ఉండి ఉంటుందని పండితుల అభిప్రాయం. చైనా యాత్రికుడు హ్యాయన్‌త్సాంగ్‌ ప్రకారం, దక్షిణ కోసల ప్రాంతానికి చేరువలో నాగార్జునుడు నివసించాడు. నాగార్జునకొండ, అమరావతిలో విశ్వవిద్యాలయాల నేర్పరచి సర్వ విద్యలను బోధించిన మహ పండితుడు. నాగార్జున తత్వానికి మాధ్యమికవాదమని పేరు. నాగార్జునుడు ఆత్మ తత్వాన్ని ఆమోదించ లేదు. దీనినే 'శూన్యవాదం' అంటారు.ఇతడు మహాయాన తత్వాన్ని శూన్యవాదంగా చెప్పాడు. దీనిని మాధ్యమికకారికి అనే గ్రంథంలో ప్రస్తావించారు. చైనా వాజ్మయంలో దాదాపు 20 గ్రంథాలు నాగార్జునుని రచనలుగా ఉన్నట్లు చెప్పడం జరుగుతుంది. ఈ గ్రంథంలో కొన్నింటిని ఇత్సింగ్‌ భారతదేశాన్ని సందర్శించిన సమయంలో, చిన్న పిల్లలు కంఠస్థం చేస్తున్నట్లు, పెద్దలు జీవిత కాలమంతా  పఠిస్తున్నట్లు పేర్కొన్నాడు. 

బౌద్ధ మతంలో నాగ దేవతారాధన కూడా ఉంది. స్టూపాలను పెనవేసుకొని ఉన్నట్లు సర్పాలను చిత్రించారు. ధూళికట్ట స్థూపంపై ఐదు తలల నాగముచిలింద శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు. అమరావతి, నాగార్జునకొండల్లో ఆసీనుడైన బుద్ధుని తలపై నాగులు పడగపట్టి ఉంటాయి. నాగులు, నాగ రాజులు, వారి భార్యలు, స్థూపాల ముందు ప్రార్ధనా భంగిమల్లో ఉండి, బోధనలను తిలకిస్తున్నట్లుగా. శిల్పాలు చెక్కారు.

విద్యా, సాహిత్య ప్రగతి

శాతవాహన యుగంలో ప్రాకృతం, పాళీ, సంస్కృత భాషల్లో అపార సాహిత్యం వెలువడింది. శాతవాహనుల కాలంలో ప్రాకృతం రాజభాష. మహారాష్ట్రి ప్రాకృతం ఒక మాండలిక భాష. ప్రాకృతం తెలుగుభాషను ప్రభావితం చేసింది. శాతవాహన రాజు హాలుడు స్వయంగా కవి. 700 ప్రాకృత పద్యాలతో 'సత్తసయి' (గాథాసప్తశతి)ని సంకలనం చేశాడు. గాథలంటే పద్యాలు. ఇందులో చక్కటి సాహిత్య విలువలున్నాయి. గాథాసప్తశతిలో అనేక తెలుగు పదాలున్నాయి. ఉదాహరణకు, అత్తం, అమ్మి, అందం, అద్దం, పొట్టి, పాడి మొదలగునవి. హాలుడికి 'కవి వత్సలుడు' అనే బిరుదు ఉంది. కుమారిలుడు, శ్రీపాలితుడు మొదలగు కవులు, హాలుని చేత సన్మానం పొందారు. గాథాసప్తశతి రచనకు తోడ్పడిన  వారిలో అణులక్ష్మి, అనుపలబ్ది, రేవ, మాధవి మొదలైన స్త్రీలున్నారు. భాష చక్కని ప్రకృతి వర్ణణ, గ్రామీణ జీవితం ఇందులో ఉన్నాయి.

పైశాచి భాషలో మంత్రి గుణాధ్యుడు ఏడు వేల శ్లోకాలతో బృహత్కథలో ఏడు కథలను వివరించాడు. పైశాచి భాష ప్రాకృతంలో మాండలికం. పైశాచి భాషలో ఉన్నందున శాతవాహన రాజు ఆదరణకు నోచుకోలేదని, ఆ బాధతో గుణాధ్యుడు తాళపత్ర గ్రంథంలోని పత్రాలను ఒకటి తరవాత ఒకటి అగ్నికి ఆహుతి చేస్తుండగా, అది తెలిసిన రాజు అక్కడకు వెళ్లి ఆపాడని, మిగిలింది మాత్రమే మనకు దక్కిందని తెలుస్తోంది. గాంగ వంశీయుడైన దుర్వినుతుడు దీన్ని సంస్కృతంలోకి అనువాదం చేశాడు. పంచతంత్రం వంటి నీతి కథలు ఇందులో ఉన్నాయి. గుణాధ్యుడి నివాసం కొండాపూర్‌ అని కృష్ణశాస్త్రి అభిప్రాయం. బృహత్కకథ ఆధారంగానే సోమదేవసూరి సంస్కృతంలో కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని రచించాడు. క్షేమేంద్రుడు బృహత్కథామంజరి'ని రాశాడు. హాలుని కాలానికి చెందినవాడుగా భావిస్తున్న శర్వవర్శ్మ 'కాతంత్ర వ్యాకరణ' మనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు.

వాత్స్యాయనుడు 'కామ సూత్రాలు' అనే గ్రంథాన్ని మలి శాతవాహనుల కాలంలోనే లేదా తరవాత కాలంలోనో రాశాడు. శృంగారం, శృంగార జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను నిర్మొహమాటంగా, శాస్త్రీయంగా వివరించాడు. కుతూహలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో 'లీలావతి' అనే కావ్యాన్ని రాశాడు. హాలుడు, సింహళ రాకుమారి లీలావతికి సప్తమ గోదావరి సమీపంలోనే, భీమేశ్వర సన్నిధిలో వివాహం జరిగిందని, ఆ ప్రదేశం కరీంనగర్‌ జిల్లాలోని వేంపల్లివెంకట్రావు పల్లి అని, కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. ఒక శాతవాహన రాజు ఆచార్య నాగార్జునుని ఆదరించాడని లీలావతి గ్రంథంలో ఉంది. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. టిబెటన్‌ సంప్రదాయాన్ననుసరించి, తన చివరి రోజులు నాగార్జునకొండలో గడిపినట్లు తెలుస్తుంది. శాతవాహన రాజు యజ్ఞశ్రీకి రాసిన “సుహృల్లేఖ” అనే లేఖా సముదాయాన్ని, చిన్న పిల్లలు కూడా కంఠస్థం చేసేవారని, క్రీ.శ. 700 ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు తెలిపాడు. ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో ప్రజ్ఞాపారమిత, అష్టా సాహస్రిక, మూలమాధ్యమికారికావళి, విగ్రహవ్యార్తిని, ద్వాదశనికాయము, శూన్యసప్తతి మొదలైన అనేక గ్రంథాలను రచించాడు. మహాయాన బౌద్దులు సంస్కృతాన్ని బోధనా భాషగా, రచనా మాధ్యమంగా స్వీకరించారు.

ప్రాకృతం, సంస్కృత భాషలే కాకుండా, దేశి అనే ఒక భాష కూడా ఉండేది. తెలుగు, కన్నడ భాషలకు ఈ భాష మూలమని, తెలుగు భాషకు, దేశీ భాషకు సంబంధమున్నదని, డి.సి.సర్కార్‌ అభిప్రాయపడ్డాడు.

శాతవాహన యుగంలో ధాన్యకటకం, నాగార్జునకొండల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. వీటిలో వ్యాకరణం, రాజనీతి, అర్థశాస్త్రం, తర్కం, గణితం, న్యాయశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలయినవి బోధించేవారు. ఈ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులు సైతం విద్యాభ్యాసం చేసేవారు.

వాస్తు కళల ప్రగతి

బౌద్ధ మతం దక్కన్‌కు వ్యాప్తి చెందడం వల్ల, శాతవాహనుల కాలంలో అనేక స్టూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మించబడ్డాయి. స్థూపమనగా బుద్ధుడు, లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించే ఒక కట్టడం. మొదట మూల స్థానంలో అవశేషాలను నిక్షిప్తం చేసి, చుట్టూ గుండ్రంగా మేధి (సిలిండర్‌) నిర్మిస్తారు. దానిపై అర్ధగోళాకారపు డోమ్‌ను నిర్మిస్తారు. చుట్టు ప్రదక్షణ పథం, ఆయక స్థంభాలు, ప్రాకారాలు, ద్వారాల చుట్టూ తోరణాలను నిర్మిస్తారు. చివరగా దీనిపైన 'హర్మిక' ఛత్రం వంటిది అలంకరిస్తారు. విహారమనగా భిక్షువులు, భిక్షుకిల నివాస మందిరం. వీటిని సంఘారామాలని కూడా వ్యవహరిస్తారు. వీటిని చైత్యం సమీపంలో నిర్మించేవారు. విహారాలు దీర్ణదతురస్ర లేదా చతురస్రాకారంలో ఉంటాయి. విహారాలు వరండాను కలిగి ఉంటాయి. లోపల మందిరం, దానికి మూడు వైపులా వరుసగా గదులు, ప్రతి గదిలో భిక్షువులు నిద్రించడానికి రాతి బల్లలు ఉండేవి. చుట్టూ తోటలూ, ప్రార్ధనకు, సమావేశానికి, వ్యాయామానికి సదుపాయాలున్న విహారాలను ఆరామాలు అంటారు. పట్టణాలకు దగ్గరగా తాత్కాలికంగా వర్షా కాలంలో విడిది చేసిన తోటలను వర్షారామాలు అనేవారు. చైత్యం బౌద్ధుల ప్రార్ధనా మందిరం. అనేక స్థంభాలు గల విశాలమైన గదిని దీని కోసం తొలిపిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గల స్థూపాల్లో అమరావతి, నాగార్జునకొండ ముఖ్యమైనవి. ఇవి కాకుండా, భట్టిప్రోలు, ఘంటసాల, జగ్గయ్యపేట, శాలిహుండం, బావికొండ, తొట్లకొండ, సంకరం (బొజ్జన్నకొండ), గోలి, అనుపు, మొదలైనవి కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ధూళికట్ట, పాశాయిగాం, మీర్జంపేట (కరీంనగర్‌ జిల్లా), ఫణిగిరి (నల్గొండ), తిరుమలగిరిల్లో స్ఫూపాలున్నాయి. ధూళికట్ట, పాశాయిగాం స్థూపాలు అమరావతి స్థూపం కంటే ప్రాచీనమైనవి. ధూళికట్ట బౌద్ధ స్థూపం క్రీ.పూ. రెండో శతాబ్దంలో నిర్మించబడినట్లు తెలుస్తుంది. ఇక్కడి ఒక ఫలకం మీద గౌతమ బుద్దుని పాద ముద్రల పైన ఐదు శిరస్సులు గల ముచిలింద నాగుని శిల్పాన్ని చెక్కారు. ఆ కాలంలో బుద్ధుని మానవ రూపంలో చూపడం నిషేధం కాబట్టి, బుద్ధునికి గుర్తుగా ఆయన పాదాలను చూపించారు. బ్రాహ్మి లిపిలో లఘు శాసనాలు కూడా ఉన్నాయి.

అమరావతి బౌద్ధ స్థూపం

శాతవాహనుల కాలం నాటి శిల్ప కళకు అమరావతి శిల్ప కళ అని పేరు. క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. రెండో శతాబ్దం వరకు ఈ కళ ఉచ్చ స్థితిలో ఉంది. అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట కేంద్రాలుగా, ఈ శిల్ప కళారితి అభివృద్ధిచెందింది. నలు వైపుల వేదికపై ఐదు  స్థంభాలు నిర్మించబడ్డాయి. ఇవి బుద్ధుడి జీవితంలోని ఐదు ఘట్టాలను సూచిస్తాయి. కమలం పుట్టుకను, గుర్రం మహాభినిష్క్రమణాన్ని, బోధి వృక్షం అతని జ్ఞానోదయాన్ని ధర్మచక్రం అతని దివ్య సందేశాన్ని స్థూపం అతని పరినిర్వాణాన్ని సూచిస్తాయి. అమరావతి శిల్ప కళా రీతి ఆనాం, థాయిలాండ్‌, జావా, సుమత్రా, బోర్నియో మొదలగు ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. జేమ్స్‌ ఫెర్లుసన్‌ “ట్రీ అండ్‌ సర్పెంట్‌ వర్షిప్" గ్రంథంలో అమరావతి వాస్తు కళకు అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించాడు.

చిత్రలేఖనం

అజంతా గుహల్లోని తొమ్మిది, పది సంఖ్యల, గుహల్లోని వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటివని కళా విమర్శకుల అభిప్రాయం. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాదు జిల్లాలో ఉన్నాయి. బౌద్ధ మతంలోని మహాయాన శాఖకు చెందిన జాతక కథల్లోని ఇతివృత్తాన్ని చిత్రాలుగా వేశారు. బుద్ధుడు, బోధిసత్వుల చిత్రాలు ఇందులో ఉన్నాయి. బోధి వృక్షాన్ని పూజించడం, 15 మంది బృందం నాట్యం చేయడం, తదితర చిత్రాలు ఇందులో ఉన్నాయి. అజంతా చిత్రాలకు అమరావతి శిల్పాలకు గల పోలికలను బట్టి, ఇవి శాతవాహనుల కాలానికి చెందినవిగా నిర్ధారణ చేశారు. బేడ్సా, పిఠల్‌ఖోరా, జున్నార్‌లలోని గుహాలయాల్లో కూడా ఆనాటి చిత్రాలున్నాయి.

మౌర్య సామ్రాజ్య పతనం తరవాత దక్కన్‌లో శాతవాహనులు స్వతంత్రించి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య, దక్కన్‌ వారధిగా పని చేసింది. క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచి, క్రీ.శ. మూడో శతాబ్దం వరకు, సుమారు రెండున్నర శతాబ్దాలు పరిపాలించారు. మొదటి కోటిలింగాలను, తరవాత ప్రతిష్థానం, ధాన్యకటకంలను రాజధానిగా చేసుకొన్నారు. శాతవాహన రాజుల్లో మొదటి శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, రెండో శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులుమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి సుప్రసిద్ధులు. దక్షిణా పథాన్ని రాజకీయంగా సమైక్యం చేసి, శాంతిభద్రతలను సమకూర్చారు. సమర్ధవంతమైన పాలనను నెలకొల్పారు. శాతవాహన రాజ్యం ఆర్థికంగా, సుసంపన్నంగా ఉండేది. దేశీయ, విదేశీయ వాణిజ్యం అభివృద్ధి చెందింది. రోమ్‌ దేశంతో ముమ్మరంగా వ్యాపారం జరిగింది. పట్టణాలు, వృత్తి శ్రేణులు అభివృద్ధి చెందాయి. శాతవాహనులు గొప్ప సాహితీ ప్రియులు. ప్రాకృత భాషను పోషించారు. శాతవాహన యుగంలో వైదిక, బౌద్ధ మతాలు ప్రజాదరణ పొందాయి. బౌద్ధ మతం సంపూర్ణ వికాసాన్ని పొందింది. బౌద్ధ మతంలోమహాయానం, హీనయానమే కాకుండా, అనేక శాఖలేర్పడ్డాయి. శాతవాహనుల కాలం నాటి కళ బౌద్ధ కళగా పేరుగాంచింది.స్తూపాలు, చైత్యాలు, విహారాల నిర్మాణం విస్తృతంగా జరిగింది. దక్కన్‌లో ప్రథమ విశాల సామ్రాజ్యాన్ని ఏర్పర్చి, సుదీర్ఘ, సుస్థిర పాలనందించి ఆర్జిక, సామాజిక వికాసానికి, వైదిక, బౌద్ధ మతాలు, ప్రాకృత, సంస్కృత భాషలు వాస్తు శిల్పి చిత్ర కళల విశేష ప్రగతికి దోహదమొనర్చిన శాతవాహనుల పాలన చరిత్రలో చిరస్మరణీయం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)