Ikshvaku Dynasty in Telugu
శాతవాహనంతర యుగం - ఇక్ష్వాకులు
శాతవాహన సామ్రాజ్యం పతనమయిన తరవాత, దక్షిణాపథంలో వివిధ ప్రాంతీయ రాజ్యాలు అవతరించాయి. కర్ణాటకలోని బనవాసి (వైజయంతి) రాజధానిగా, చుటు శాతకర్ణిలు; మహారాష్ట ప్రాంతంలో (కొంకణ్, అపరాంత) అభీరులు; తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. శాతవాహన సామ్రాజ్యం పతనమై, తూర్పు చాళుక్య. రాజ్యం (వేంగి) ఏర్పడేవరకు గల నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో, మొదటి 80 సంవత్సరాలు, క్రీ.శ. 220 నుంచి క్రీ.శ.300 వరకు ఇక్ష్వాకులు రాజకీయాధిపత్యాన్ని చెలాయించారు. చివరి శాతవాహన రాజు నాల్లో పులుమావిని ఇక్ష్వాకు రాజు 'శ్రీశాంతమూలుడు' తొలగించి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నాడు. వీరి శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలను బట్టి, వీరి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణాలోని నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ వరకు విస్తరించిందని చెప్పొచ్చు. వీరు నాగార్జునకొండ లోయలోని విజయపురి రాజధానిగా చేసుకొన్నారు. శాతవాహన రాజు విజయశాతకర్ణి శాసనం ఇక్కడ దొరకడం వల్ల, బహుశ ఇతని పేరు మీద దీనికి విజయపురి అనే పేరు వచ్చి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్ష్వాకుల రాజ చిహ్నం సింహం. వీరి పాలనా కాలంలో నాగార్జునకొండ, లేదా విజయపురి, ప్రముఖ బౌద్ధక్షేత్రంగా, వైజ్ఞానిక కేంద్రంగా విరాజిల్లింది. ఇక్ష్వాకుల కాలంలో వాస్తు, శిల్ప కళలు అభివృద్ధి చెందాయి.
First Capital of Ikshvaku Dynasty, Founder of Ikshvaku Dynasty, First King of Ikshvaku Dynasty, Who is the founder of Ikshvaku Dynasty
ఆధారాలు
ఇక్ష్వాకుల చరిత్రకు పురావస్తు, సాహిత్య ఆధారాలున్నాయి. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు, వాస్తు శిల్పాలు మొదలయినవున్నాయి. నాగార్జునకొండ, జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా) రామిరెడ్డిపల్లి, ఫణిగిరి మొదలగు చోట్ల దొరికిన శాసనాలు, ఇక్ష్వాకుల చరిత్రకు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయ. ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మ లిపిలో రాయబడ్డాయి. ఎహువల శాంతమూలుడి కాలం నుంచి, శాసనాలు సంస్కృతంలో వేయబడాయి. ఇక్ష్వాకుల శాసనాలను నాలుగు రకాలుగా వర్గీకరించొచ్చు: 1. మహాస్థూపం, ఆయక స్థంభాలపై చెక్కినవి; 2. చైత్య గృహ శాసనాలు; 3. వేరుచేయబడిన స్థంభాల శాసనాలు; 4. శిల్పాలపై గల శాసనాలు.
ఇక్ష్వాకుల నాణేలు నాగార్జునకొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, వడ్డమాను (మహబూబ్‌నగర్ జిల్లా) ఏలేశ్వరం (నల్గొండ జిల్లా) మొదలగు చోట్ల దొరకడాన్ని బట్టి, వారి రాజ్యం ఆ ప్రాంతాలకు విస్తరించిందని చెప్పొచ్చు. శాతవాహనుల నాణేలు విస్తారంగా దొరకగా, ఇక్ష్వాకుల నాణేలు చాలా పరిమితంగా దొరికాయి. ఇక్ష్వాకులు బంగారు, వెండి నాణేలను ముద్రించ లేదు. అవి పరిమాణంలో కూడా చిన్నవి. నాగార్జునకొండలో 148 శాతవాహన రాజుల నాణేలు దొరికాయి. శాతవాహనుల పాలనలో కూడా నాగార్జునకొండ ఒక ముఖ్య కేంద్రంగా ఉన్నట్లు చెప్పొచ్చు. నాగార్జునకొండలో రోమన్ చక్రవర్తుల, రాణుల నాణేలు దొరికాయి. టైబీరియస్ హెడ్రియాన్, ఫాస్టేనా రాణి నాణేలు నాగార్జునకొండలో, ఏలేశ్వరంలో, సెస్టిమస్ సెవెరస్ మొదలయిన రోమన్ చక్రవర్తుల నాణేలు దొరికాయి.
నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లి, నేలకొండపల్లి, ఫణిగిరి, అనుపు మొదలయిన చోట్ల గల బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, తోరణాలు, వాటి మీద గల శిల్పాలు, సమకాలీన మత, సాంఘిక పరిస్థితులను తెలుసుకోవడానికి తోడ్పడుతున్నాయి. నాగార్జునకొండ త్రవ్వకాల్లో ఇక్ష్వాకుల నాటి క్రీ.శ.3వ శతాబ్దం) కోట, బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలయినవి ఎన్నో బయల్పడ్డాయి. 1926 లో ఎ.రంగనాధ సరస్వతి అనే పురావస్తు శాఖలో పనిచేసే తెలుగు అసిస్టెంట్, మొదటి సారి నాగార్జునకొండ అవశేషాలను గుర్తించాడు. తర్వాత ఎన్. హెచ్. లాంఘ్‌రెస్ట్, 1938 లో బి.యన్.రామచంద్రన్ తవ్వకాలను నిర్వహించారు. 1954 లో రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. తవ్వకాల్లో బయల్పడిన ప్రాఛీన శిల్పాలు, శాసనాలు, ఇతర వస్తువులను, కొన్నింటిని నాగార్జునకొండ పైకి, మరి కొన్నింటిని సమీపంలోని 'అనుపు'కు తరలించారు.
సాహిత్య ఆధారాల్లో, మత్స్య, వాయు, బ్రహ్మండ, విష్ణు, భాగవత పురాణాలు ముఖ్యమైనవి. ఇక్ష్వాకు రాజుల పేర్లు, వారి పరిపాలనా కాలాన్ని వివరిస్తున్నాయి. పురాణాలన్ని దాదాపు క్రీశ. 2వ శతాబ్దంలో రాయబడ్డ భవిష్య పురాణంలోని సమాచారాన్నే స్వీకరించాయి. పురాణాలు క్రీ.శ. 4వ శతాబ్దం వరకు, అంటే, గుప్త రాజుల పాలనారంభం (మొదటి చంద్రగుప్తుడు) వరకు గల రాజవంశాల గూర్చి వివరించాయి. 11వ శతాబ్దానికి చెందిన కన్నడ గ్రంథం 'ధర్మామృతం' అంగదేశపు ఇక్ష్వాకు రాజు యశోధరుడు కృష్ణానది ముఖద్వారం వద్ద, ప్రతిపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా, ఒక. రాజ్యాన్ని నెలకొల్పినట్లు పేర్కొంటున్నది. ఒక ప్రాచీన ప్రాకృత కావ్యమాధారంగా, న్యాయసేనుడు 'ధర్మామృతం' అనే గ్రంథాన్ని రాశాడు.
జన్మస్థలం
ఇక్ష్వాకుల జన్మస్థలం పై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఇక్ష్వాకులు మొదట ఆంధ్రభృత్యువులు (ఆంధ్రుల సేవకులు) అంటే, వీరు శాతవాహనులకు మహాతలవరులుగా, మహాసేనాపతులుగా పనిచేశారు. శాతవాహనుల లాగా మాతృనామాలు ధరించడం, 'స్కంధ'ళతో కూడిన అణకతో పూర్తయ్యే పేర్లను కల్గి ఉండటం వల్ల, వీరిపై శాతవాహనుల ప్రభావం ఉందని తెలుస్తుంది. వాయు పురాణం ప్రకారం, సూర్య వంశ కర్త ఇక్ష్వాకువు. ఇతడు మనువు యొక్క తొమ్మిది మంది కుమారుల్లో పెద్దవాడు. ఇతడు అయోధ్య రాజధానిగా పాలించాడు. ఇతనికి వంద మంది కుమారులున్నారు. వారిలో వికాక్షి పెద్దవాడు. ఇక్ష్వాకువు తర్వాత అయోధ్యకు వికాక్షి రాజైనాడు. మిగిలిన వారిలో ఏబదిమంది, ఉత్తర హిందూస్థానంలో చిన్న చిన్న రాజ్యాలకు అధిపతులు కాగా, మిగిలిన 49 మంది రాకుమారులు దక్షిణ భారతదేశంలో రాజ్యాలను స్థాపించారు. విష్ణు పురాణం ప్రకారం కోసల (దక్షిణ ప్రాంతం) రాజ్యాన్ని కుశుడు స్థాపించి, కోశస్థలి నుంచి పాలన సాగించాడు. ధర్మశాస్త్ర కర్తల్లో ఒకడైన బౌద్ధాయనుడు దక్షిణ. భారతీయుల్లో మేనత్త కూతుళ్ళను వివాహం చేసుకొనే సంప్రదాయం ఉందని పేర్కొన్నాడు. వీరపురుషదత్తుడు తన ఇద్దరు మేనత్త కూతుళ్ళను వివాహం చేసుకొనడాన్ని బట్టి, ఇక్ష్వాకులు దక్షిణ భారతీయులేనని కొందరు పండితులు పేర్కొన్నారు. ఉత్తర భారతీయుల్లో ఈ సంప్రదాయం లేదు.
ఇక్ష్వాకులు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవారు. ముఖ్యంగా కన్నడిగులని (పశ్చిమ దక్కన్) స్టెన్‌కోనో, వోగెల్‌లు అభిప్రాయపడ్డారు. ఇక్ష్వాకులు తమిళులని డా॥ కె.రాజగోపాలాచారి పేర్కొన్నాడు. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలోని కోసల నుంచి వలసవచ్చారని రాప్సన్, బూలర్‌లు అభిప్రాయపడ్డారు. కన్నడ జైన గ్రంథం “ధర్మామృతం” అంగ దేశపు రాజు యశోధరుడు, కృష్ణా నది ముఖ ద్వారం వద్ద ప్రతిపాలపురం (భట్టిప్రోలు)రాజధానిగా ఒక రాజ్యాన్ని నెలకొల్పినట్లు పేర్కొంటున్నది. బిషప్ కాల్డ్‌వెల్, ఇక్ష్వాకులు స్థానికులైన ఆంధ్రులేనని, వీరు ఉత్తర్త భారతదేశం నుంచి వలస వచ్చిన వారు కాదని పేర్కోన్నాడు. ఇక్ష్వాకులు “ఇక్షు” చిహ్నం గల ప్రాచీన స్థానిక గణికులని, బి, యస్. యల్. హన్మంతరావు అభిప్రాయపడ్డారు.
శ్రీపర్వతీయులు - ఇక్ష్వాకులు: పుట్టు పూర్వోత్తరాలు
ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పురాణాలు వీరిని శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులు, శ్రీపర్వతీయాంధ్రులు అని పేర్కొన్నాయి. నాగార్జునకొండ నుంచి ప్రారంభమై, శ్రీశైల పర్వతం చుట్టూ ఉన్న నల్లమలై కొండల వరకు గల పర్వత శ్రేణిని శ్రీపర్వతమని పురాణాలు, బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి. జగ్గయ్యపేట, నాగర్జునకొండలో దొరికిన ఇక్ష్వాకుల ప్రాకృత శాసనాలు, శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక మహారాజనియు, అతని రాజధాని విజయపురి, శ్రీపర్వతానికి పశ్చిమ దిశలో ఉందని తెలియచేశాయి. క్రీ.శ. 3, 4 శతాబ్దాల్లో శ్రీపర్వతానికి విజయపురి అనే పేరుండేదని శాసనాల వల్ల తెలుస్తుంది. ఇక్ష్వాకు రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సంప్రదాయాన్ని శాతవాహనుల నుంచి స్వీకరించారు. ఈ సంప్రదాయం వీరితోనే అంతమైంది. తర్వాత పాలించిన పల్లవులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రజులు, శాలంకాయనులు, ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. అంతే గాకుండా, సిరి, సామి పదాలను (కొడబలిసిరి, శాంతిసిరి, హమ్మసిరి) బట్టి, ఇక్ష్వాకులు శాతవాహనుల భృత్యులనే సంకేతాన్ని సూచిస్తున్నట్లుగా కనపడుతుంది. అంతే గాకుండా, శాతవాహనుల దగ్గర వీరు మహాతలవరులుగా పనిచేశారు. కాబట్టి, ఇక్ష్వాకులు, శ్రీపర్వతీయులు ఒక్కరేనని, ఆంధ్రశాతవాహనుల భృత్యుల వంశానికి చెందినవారే, శ్రీపర్వతీయాంధ్రులని మొదట కె.పి. జయస్వాల్ వివరించారు. అందువల్ల శ్రీపర్వతీయులు, ఇక్ష్వాకులు, ఆంధ్రభృత్యులు ఒక్కటేనని, వేర్వేరు కాదని స్పష్టంగా చెప్పొచ్చు.
కాల నిర్ణయం
ఇక్ష్వాకుల పాలనా కాలంపై చర్తిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. మత్స్య పురాణం ఆంధ్రుల అనంతరం వారి బృత్యులైన శ్రీపర్వతీయులు ఏడుగురు రాజులు 52 సంవత్సరాలు పాలించారని తెలియచేస్తుంది. మత్స్య పురాణంలోని “ద్విపంచాశతమ్” అనే పదాన్ని బట్టి 52 సంవత్సరాలు రాలు లేదా 100 సంవత్సరాలని భావించాల్సి ఉంటుందని, పార్గిటర్ అభిప్రాయపడ్డాడు. శాసనాలననుసరించి, శాంతమూలుడు కనీసం 13 సంవత్సరాలు పాలించాడని, అతని 13వపాలనా సంవత్సరంలో వేసిన శాసనాన్ని బట్టి చెప్పొచ్చు. శాంతమూలుని తర్వాత, అతని కుమారుడు వీరపురుషదత్తుడు 20 సంవత్సరాలు పాలించాడు. ఇతని కుమారుడు ఎహువల శాంతమూలుడు 24 సంవత్సరాలు పాలించాడు. ఫణిగిరి శాసనాన్ని బట్టి, రుద్రపురుషదత్తుడు 18 సంవత్సరాలు పాలించినట్లు తెలుస్తుంది. నాగార్జునకొండలో బయల్పడిన శాసనాల ప్రకారం, ఇక్ష్వాకుల పాలనా కాలం కనీసం 75 సంవత్సరాలుంటుందని డి.సి. సర్కార్ పేర్కొన్నాడు. ఆయన వీరపురుషదత్తుని నాగార్జునకొండ శాసనాన్ని పునఃక్రోడీకరించి, ఇక్ష్వాకుల పాలనా కాలాన్ని ఈ విధంగా సవరించాడు.
- వీరపురుషదత్తుడు - క్రీ.శ. 255 - 275
- ఎహువల శాంతమూలుడు - క్రీ.శ. 280 - 335
- రుద్రపురుషదత్తుడు -క్రీ.శ: 335 - 345
నాగార్జునకొండలోని అభీర వసుసేనుని శాసనం క్రీ.శ.278 నాటిదని సర్కార్ నిర్ణయించాడు. ఇక్ష్వాకులను ఓడించి, క్రీ.శ.275 నుంచి 280 వరకు, ఐదు సంవత్సరాలు నాగార్జునకొండను వారి స్వాధీనంలో ఉంచుకొన్నారని, అభిప్రాయపడ్డాడు. కాని, మారేమండ రామారావు, వి.వి.మిరాశీలు సర్కార్ వాదనను ఆమోదించలేదు. వీరపురుషదత్తుని, ఎహువల శాంతమూలుని పాలనా కాలంలో విజయపురిలో బౌద్ధ, హిందూ నిర్మాణాలు విరివిగా జరిగాయని, అభీరవసుసేనుని దండయాత్ర జరిగి ఉంటే, ఆ నిర్మాణాలు జరిగి ఉండేవి కావని వాదించారు. అభీర వసుసేనుడి శాసనం పేర్కొంటున్న రాజులు ఇక్ష్వాకుల బంధుమిత్రులని, కాబట్టి, అష్టభుజస్వామి విగ్రహ ప్రతిష్టాపన సమయాన, వారు సమావేశమైనట్లు, ఈ శాసనం తెలుపుతుందని రామారావు పేర్కొన్నాడు.
పి.వి.పరబ్రహ్మశాస్త్రి గారు ఇక్ష్వాకుల కాల నిర్ణయాన్ని ఈ విధంగా చేశారు.
- శాంతమూలుడు - క్రీ.శ.230 - 245
- వీరపురుషదత్తుడు - క్రీ.శ. 245 - 270
- ఎహువల శాంతమూలుడు - క్రీ.శ.270 - 285
- రుద్రపురుషదత్తుడు - క్రీ.శ.285 - 300
శాతవాహన సామ్రాజ్యం క్రీ.శ.220-225 మధ్యలో పతనమైందనే విషయంలో చరిత్రకారుల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇక్ష్వాక రాజ్యంపై పల్లవ దండయాత్రను తెలిపే మంచికల్లు శాసనాన్ని అనుసరించి, క్రీ.శ.300 ప్రాంతంలో ఇక్ష్వాక రాజ్యం పతనమైనట్లు చెప్పొచ్చు. కాబట్టి, ఇక్ష్వాకుల పాలన క్రీ.శ. 220-300 మధ్య, 80 సంవత్సరాలు కొనసాగిందని భావించొచ్చు. దీనిననుసరించి, ఇక్ష్వాక రాజుల పాలనా కాలాన్ని ఈ విధంగా నిర్ణయించొచ్చు.
- శాంతమూలుడు - క్రీ.శ.220 - 233
- వీరపురుషదత్తుడు - క్రీ.శ. 233 - 258
- ఎహువలశాంతమూలుడు - క్రీ.శ.253 - 277
- అభీరవసుసేనుని మధ్యంతర పాలన - క్రీ.శ.277-78 - 283
- రుద్రపురుషదత్తుడు - క్రీ.శ.288 - 301
ఇక్ష్వాకుల కులం
ఇక్ష్వాకులు బ్రాహ్మణులని, క్షత్రియులని, స్థానిక గణ జాతులకు చెందిన వారని, పండితులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరపురుషుదత్తుడు నాగార్జునకొండ శాసనంలో, తాము అయోధ్యను పాలించిన (కోసల రాజ్యం) ఇక్ష్వాక వంశస్థుడైన శ్రీరామచంద్రుని, శాక్యముని గౌతమబుద్దుని వంశానికి చెందిన వారమని, చెప్పుకొన్నాడు. ఇక్ష్వాకులు స్థానిక గణ జాతులలో ఒకరు బౌద్ధ మతాన్ని స్వీకరించిన వీరపురుషదత్తుడు, తాము శాక్యముని బుద్ధుని వంశానికి చెందిన వారమని, చెప్పుకొన్నారు. ప్రాచీన చరిత్రలో రాజులు తమ వంశాన్ని పౌరాణిక రాజుల వంశాలకు జోడించి చెప్పుకొనే సంప్రదాయముంది. ఇక్ష్వాకులు తమ పేరుతో వాసిష్టీపుత్ర, మాఠరీపుత్ర వంటి తల్లి యొక్క బ్రాహ్మణ గోత్రాన్ని చేర్చడం చేత, వీరు బ్రాహ్మణులని కొందరు అభిప్రాయపడ్డారు. శాంతమూలుడు అశ్వమేధ, వాజపేయ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర యాగాలను నిర్వహించాడు. ఈ యాగాలు క్షత్రియులే నిర్వహిస్తారు. కాబట్టి, ఇక్ష్వాకులు క్షత్రియులని మరి కొందరి వాదన. ఇక్ష్వాకులు క్షత్రియులని డా॥భండార్కర్ అభిప్రాయపడ్డాడు. శాసనాల్లో తాము సూర్య వంశానికి చెందిన ఇక్ష్వాకు రాజు సంతతికి చెందిన వారమని చెప్పుకొన్నారని అన్నాడు. ఇక్ష్వాకులు బహుశ క్షత్రియుడైన తండ్రికి, బ్రాహ్మణురాలైన తల్లికి జన్మించిన మిశ్రమ సంతతి వారై ఉండొచ్చని భండార్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక్ష్వాకులు మొదట స్థానిక గణ జాతులకు చెందిన వారుగా ఉండి, పాలకులైన తర్వాత, శాతవాహనుల లాగా సాంఘిక ఔన్నత్యాన్ని పొంది, బ్రాహ్మణీకరణ చెందినవారై ఉండొచ్చు.
ఇక్ష్వాకుల పాలనా కాలం : రాజకీయ పరిణామాలు
ఇక్ష్వాకుల శాసనాల ఆధారంగా నలుగురు ఇక్ష్వాక రాజుల గురించి మాత్రమే సమాచారం లభిస్తుంది. వారే:
- వాసిష్టీపుత్ర శాంతమూలుడు (క్రీ.శ 220-233)
- మాఠరీపుత్ర వీరపురుషదత్తుడు (క్రీ, శ 233-253)
- ఎహువల శాంతమూలుడు (క్రీ.శ. 253-277)
- రుద్రపురుషదత్తుడు (క్రీ.శ. 283-301)
వాసిష్టీపుత్ర శాంతమూలుడు (క్రీ.శ. 220-233)
ఇతడు స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. హిరణ్యకులు, పూగియ వంశీయులతో కలిసి, శాతవాహన రాజు నాల్లో పులుమావిని తొలగించి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నాడు. తెలంగాణ - కోస్తాంధ్ర ప్రాంతాన్ని తన పరిపాలనలోకి తెచ్చాడు. ఇతడి శాసనాలు రెంటాల, కేశనపల్లి వద్ద దొరికాయి. శాంతమూలుడి గొప్పతనాన్ని గురించి, అతని కుమారుడు వీరపురుషదత్తుడు వేసిన నాగార్జునకొండ శాసనాల్లో ఉంది. 'అవేక గో హలశత సహస్ర పద యిశ' అంటే, కోట్ల బంగారు నాణేలను, వేలకొలది గోవులను, ఎద్దులను, నాగళ్ళను, భూమిని, దానంగా ఇచ్చాడని అర్ధం. శాంతమూలుడి స్మారక స్తూపం ఐదో ఫలకంపై గల శిల్పంలో శాంతమూలుడు శిరోముండనం చేయించుకొని, చేతిలో కర్రతో, అగ్నిష్టోమ నిర్వాహకుడిగా కన్పిస్తాడు. అతడి భుజాలపై జింక చర్మం కప్పి ఉంది. సాధారణ దుస్తులతో, కాళ్ళకు చెప్పులు లేకుండా, అతని తలపై ఛత్రముంది. ఒక సేవకుడు నీటితో ఉన్న పాత్రను పట్టుకొని కన్పిస్తాడు. ఐదుగురు బ్రాహ్మణుల్లో ఒకరు కుడిచేయితో రాజు నుంచి దానాన్ని స్వీకరిస్తున్నాడు. శాంతమూలుడి ఘనతను అతని సోదరీమణులు హర్యశ్రీ, శాంతిశ్రీలు, తమ శాసనాల్లో ప్రశంసించారు. కాని, వారు తమ తండ్రి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించ లేదు. శాంతమూలుడు అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలను చేశాడు. వాజపేయ యాగాన్ని కేవలం సామ్రాట్‌లు, చక్రవర్తులు మాత్రమే నిర్వహించేవారు. నాగార్జునకొండ తవ్వకాల్లో అశ్వమేధ వేదిక బయటపడ్డది. శాంతమూలుడికి 'మహారాజ' అనే బిరుదు ఉంది. అతడి సామ్రాజ్య విస్తరణపై ఎటువంటి సమాచారం దొరకలేదు. సమకాలీన రాజవ రాజవంశాలైన పూగియ, ధనిక కుటుంబాలతో వివాహ సంబంధాలనేర్పర్చుకొన్నాడు. తన సోదరి శాంతిశ్రీని 'పూగియ' వంశానికి చెందిన మహాసేనాపతి, మహాతలవరైన మహాస్కందశ్రీకిచ్చి వివాహం చేశాడు. అందుకే శాంతిశ్రీని శాసనాలు మహాదానపత్ని, మహాతలవరని వర్ణించాయి. వీరికి స్కందసాగరుడనే కుమారుడున్నాడు. శాంతమూలుడి ఇంకొక సోదరిహర్మ్యశ్రీ భర్త పేరు, అతని వంశాన్ని గూర్చి వివరాలు లభ్యం కాలేదు. శాంతమూలుడు తన కూతురు అడవి శాంతిశ్రీని ధనిక కుటుంబానికి చెందిన మవాసేనాపతి, మహాదండనాయకుడైన స్కందవిశాఖనాగకిచ్చి వివాహం చేశాడు. శాంతమూలుడు వైదిక మతావలంబికుడు. ఉజ్జయినిలోని స్కందకార్తికేయుని (మహాసేనుడు) భక్తుడని శాసనాల్లో ఉంది. ఇతడి ఇద్దరు సోదరీమణులు మాత్రం బౌద్ధ మతంలో విశ్వాసమున్నవారు.
మాఠరీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు (క్రీ.శ.233 - 253)
వీరపురుషదత్తుడు శాంతమూలుని కుమారుడు. ఇతడి శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, అల్లూరులో దొరికాయి. ఇతడు ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు. సమకాలీన రాజవంశాలతో వైవావిక సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నాడు. వారి మద్దతుతో, సుస్థిరమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. నాగార్జునకొండ శాసనాన్ననుసరించి, ఇతడికి ఐదుగురు భార్యలున్నారు. ఇతని మేనత్త హర్మశ్రీ, కూతుళ్ళు, బపిశ్రీ, షష్టిశ్రీ, మరో మేనత్త శాంతిశ్రీ కూతురును వివాహం చేసుకొన్నాడు. చస్తనుని సంతతికి చెందిన శక క్షాత్రప రాకుమారి (ఉజ్జయిని) మహాదేవి రుద్రభట్టారికను వివాహం చేసుకొన్నాడు. ఐదో భార్య మహాదేవి భట్టిదేవ. వీరపురుషదత్తుని ఏకైక కూతురు కొడబలిశ్రీని, చుటు వంశానికి చెందిన కుంతలదేశ మహారాజైన విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికిచ్చి (బనవాసి), వివాహం చేసినట్లు, ఎహువల శ్రీశాంతమూలుని 11వ రాజ్య సంవత్సరంలో, కొడబలిశ్రీ వేయించిన శాసనంలో ఉంది.
వీరపురుషదత్తుడు మొదట వైదిక మతాన్ని అనుసరించాడు. తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇతడి పాలనా కాలాన్ని ఆంధ్రదేశ బౌద్ధ మతచరిత్రలో ఉజ్వలమైన ఘట్టంగా పేర్కొనొచ్చు. నాగార్జునకొండలోని ఒక శిల్పంలో రాజు తన కుడి కాలుతో శివ లింగాన్ని తాకుతున్నట్లు ఉంది. అది వీరపురుషదత్తుడు శైవ మతాన్ని త్యజించిన విషయాన్ని తెలుపుతుందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. కాని, ఆ శిల్పం మాంధాత జాతకంలోని భాగమే కాని, వీరపురుషదత్తునికి చెందినది కాదని తెలుస్తుంది. నాగార్జునకొండపై బౌద్ధ నిర్మాణాలకు కారకురాలైన రాకుమార్తె,వీరపురుషదత్తుని మేనత్త శాంతిశ్రీ. వీరపురుషదత్తుని ఆరవ రాజ్య సంవత్సరంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించింది. నాగార్జునకొండ శాసనాన్ననుసరించి, బ్రాహ్మణులు, శ్రమణులు, పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండి, వారి క్షేమాన్ని కోరింది. తన అల్లుడు వీరపురుషదత్తుని 18వ పాలనా సంవత్సరంలో అతడి విజయాన్ని ఆయురారోగ్యాలను కోరుతూ, మరొక శాసనాన్ని వేయించింది. శాంతిశ్రీ వల్ల ఇక్ష్వాక రాణులు, వీరపురుషదత్తుని ఐదుగురు భార్యలు బౌద్ధ మతాన్ని ఆదరించి పోషించారు.
మాధురిపుత్ర వీర పురుషదత్తుడు వైదిక మతాన్ని అణచడానికి చేసిన ప్రయత్నాన్ని సూచించే శిల్పం |
ఎహువల శాంతమూలుడు (క్రీ.శ. 258-277)
ఇతడినే వాసిష్టీపుత్ర బహుబల శాంతమూలుడు, రెండవ శాంతమూలుడని అంటారు. ఇతడు మహాదేవి వాసిష్టీభట్టిదేవ, వీరపురుషదత్తుల కుమారుడు. తాత పేరును పెట్టుకొనే సంప్రదాయం ఇక్ష్వాకుల నుంచే ప్రారంభమైంది. తర్వాత ఈ సంప్రదాయాన్ని గుప్తులు, వాకాటకులు, పల్లవులు, విష్ణుకుండులు, శాలంకాయనులు అనుసరించారు. ఇతడి శాసనాలు నాగార్జునకొండ తవ్వకాల్లో దొరికాయి. శాంతమూలుని 11 వ పాలనా సంవత్సరం కంటే ముందే, ఒక ముఖ్యమైన యుద్ధం చేసినట్లు ఈ యుద్ధంలో అతడి సేనాధిపతైన 'ఎలిశ్రీ' కార్తికేయుని కృప వల్ల విజయం సాధించినట్లు, ఒక శాసనంలో ఉంది. ఈ శాసనం ఎహువల శాంతమూలుని పదకొండవ రాజ్య సంవత్సరంలో ఎలిశ్రీ వేయించాడు. ఎలిశ్రీ 'ఏలేశ్వరం' అనే పట్టణాన్ని నిర్మించి, 'సర్వదేవాలయ' మనే పేరు మీద ఒక శివాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది.
ఇక్ష్వాకు రాజ్యం
ఇక్ష్వాకు రాజ్యం |
నాగార్జునకొండ తవ్వకాల్లో అభీర రాజు వసుసేనుడు, ముప్పదవ (30) రాజ్య సంవత్సరాన వేయించిన ఒక శాసనం దొరికింది. ఈ శాసనంలో అవంతి రాజు శకరుద్రదైమనడు, అభీరరాజు వసుసేనుడు, బనవాసి (చుటు) రాజైన విష్ణురుద్ర శివలానంద శాతకర్ణి మొదలైన వారి ప్రస్తావన ఉంది. వీరు అష్టభుజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఈ శాసనంలో ఉంది. కాని, అప్పటి ఇక్ష్వాక రాజు పేరు శాసనంలో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇక్ష్వాక రాజ్యంపై అభీర వసుసేనునికి అండగా నిల్చి, విజయపురిని ఆక్రమించి, అష్టభుజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని, డి.సి.సర్కార్ అభిప్రాయం. కొన్ని సంవత్సరాలు అభీరులు నాగార్జునకొండ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తుంది. ఇక్ష్వాక రాజ్య రాజధానిలోనే అభీరవసుసేనుని శాసనముందంటే, అది ముమ్మాటికి అతని దండయాత్రగానే భావించాల్సి ఉంటుంది. ఎహువల శాంతమూలుని కాలం నాటికి ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజ భాషగా స్థిరపడింది. ఇతడు వైదిక మతాన్ని అనుసరించాడు. స్వామి మహాసేనుని భక్తుడు. ఇతడి పాలనలో విజయపురిలో కార్తికేయాలయం, పుష్పభద్రస్వామి ఆలయం, నోడిగిరీశ్వరాలయం, దేవీ ఆలయం మొదలయినవి నిర్మించబడ్డాయి.
రుద్రపురుషదత్తుడు (క్రీ.శ. 283-301)
గురజాల (గుంటూరు జిల్లా), నాగార్జునకొండ, ఫణిగిరిలో దొరికిన నాణేలపై గల లిపి ఆధారంగా, శాసనాలపై గల పేరును బట్టి, రుద్రపురుషదత్తుడు చివరి ఇక్ష్వాక రాజని, చరిత్రకారులు గుర్తించారు. ఇతడు ఎహువల శాంతమూలుని కుమారుడు. ఇతడి నాల్గో పాలనా సంవత్సరంలో, నోదుకశ్రీ అనే అతడు. తన దైవమైన హలంపురస్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చాడని శాసనంలో ఉంది. దీనిని, గుంటూరు జిల్లాలోని నాగులాపురంగా చరిత్రకారులు గుర్తించారు.
రెండో వీరపురుషదత్తుడు
ఇతడు రుద్రపురుషదత్తుని సోదరుడు. యువరాజుగా ఉన్నప్పుడే మరణించినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. కంచి పల్లవుల విజ్బంభణ వల్ల, ఇక్ష్వాకుల రాజ్యం పతనమైంది. పల్లవులు ఇక్ష్వాకుల రాజధాని విజయపురిని ఆక్రమించారు. పల్లవ సింహవర్మ శాసనం గుంటూరు జిల్లా, మంచికల్లు గ్రామంలో దొరికింది. ప్రాకృత భాషలోనున్న ఈ శాసన లిపి, ఇక్ష్వాకుల శాసన లిపిని పోలి ఉందని, శాసన లిపిశాస్త్ర పరిశోధకులు గుర్తించారు. ఇంతవరకు దొరికిన పల్లవ శాసనాల్లో, ఇదే అతి పురాతనమైంది. ఇక్ష్వాకుల రాజధానికి ఇంత దగ్గరలో పల్లవుల శాసనం ఉండటాన్ని బట్టి, పల్లవుల దండయాత్ర జరిగిందని తెలుస్తుంది. ఇక్ష్వాక రాజ్యం పతనమైన తర్వాత, వారి సామంతులు కృష్ణా లోయలో బృహత్పలాయనులు, గుంటూరు మండలంలో ఆనందగోత్రజులు, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు.
పరిపాలనా వ్యవస్థ
శాతవాహనుల పాలనా విధానాన్నే, కొద్ది మార్పులతో, ఇక్ష్వాకులు అనుసరించారు. వీరి పరిపాలనా విధానాన్ని గూర్చి తెలుసుకోవడానికి శాసనాలే ప్రధాన ఆధారం.
కేంద్ర ప్రభుత్వం
రాజు పరిపాలనలో సర్వాధికారి, నిరంకుశుడు. అన్ని అధికారాలు అతని చేతుల్లోనే ఉండేవి.రాజు ధర్మశాస్త్రాలు, స్మృతులు వివరించిన విధంగా పరిపాలించేవాడు. రాజులు బ్రాహ్మణుల పట్ల అనుసరించాల్సిన విధులను పేర్కొనడం జరిగింది. అందువల్ల, రాజు ధర్మాన్ని రక్షించే వాడే కాని, రూపొందించేవాడు కాదని అర్ధం చేసుకోవాలి. రాజులు తమ విజయాలను వర్ణిస్తూ, తమ తండ్రి, తాతల గొప్పతనాన్ని శ్లాఘిస్తూ, శాసనాలు వేయించారు. వాసిష్టీపుత్ర శాంతమూలుడు 'మహారాజు బిరుదు'ను ధరించాడు. రాజులు పొరుగు రాజ్యాలపై విజయం సాధించడానికి ఆసక్తిని ప్రదర్శించేవారు. తమ విజయ సూచకంగా, అశ్వమేధ, వాజపేయ, అగ్నిష్టోమ వంటి యాగాలను నిర్వహించారు. ఈ వైదిక క్రతువుల ద్వారా తాము దైవాంశ సంభూతులుగా ప్రకటించుకొన్నారు. శాతవాహనుల కాలంలో సూత్రప్రాయంగా ఉన్న దైవదత్త రాజ్యాధికారం, ఇక్ష్వాకుల కాలం నాటికి స్పష్టంగా ఏర్పడింది. రాజు భూమి మీద భగవంతుని స్వరూపమని, రాజు అధికారాన్ని వ్యతిరేకిస్తే, భగవంతుడిని వ్యతిరేకించినట్లేనని భావించేవారు. అమాత్యులు, అధికారులు.
ఇక్ష్వాకుల శాసనాలు మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక, కోష్టాగారిక (కోశాధికారి) అనే అధికారులను పేర్కొన్నాయి. ఒకే వ్యక్తి రెండు లేదా అ౦తకంటే ఎక్కువ పదవులను కూడా నిర్వహించేవాడు. పూగియ వంశానికి చెందిన వాసిష్టీపుత్ర స్కందశ్రీ, హిరణ్య వంశానికి చెందిన వాసిష్టీపుత్ర స్కందచలికి రెమ్మణకలాంటి వారు, మహాసేనాపతి, మహాతలవరి, మహాదండనాయక బిరుదులను ధరించారు. మహాతలవరులు సామంత స్థాయి కలిగిన అధికారులు. వీరు శాంతి భద్రతలను కాపాడేవారు.
స్థానిక పాలన
ఇక్ష్వాకులు తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. అల్లూరు, అమరావతి శాసనాల్లో 'రఠ'ల (రాష్ట్రం) ప్రస్తావన ఉంది. కొన్ని గ్రామాల సముదాయమే రాష్ట్రం. రాష్ట్రం శాతవాహనుల పాలనలోని 'ఆహారం' కు సమానమైన విభాగం. పూగి రాష్ట్రం, హిరణ్య రాష్ట్రం, ముండ రాష్ట్రం మొదలగు పేర్లు శాసనాల్లో ఉన్నాయి. ఇక్ష్వాకుల శాసనాల్లో గల 'రథికుడు, 'రథి', రాష్ట్ర పాలకుడు. ఇక్ష్వాకులు రాష్ట్రాలను వేర్వేరు పేర్లతో, వీవిధ స్థాయిల్లో విభజించారు. ఐదు గ్రామాలను 'గ్రామపంచకి' గా పిల్చేవారు. 'మహాగ్రామ' అనే విభాగాన్ని 'మహాగ్రామికి' అనే ఉద్యోగి అధీనంలో ఉంచారు. గ్రామ పాలనాధికారం వంశపారంపర్యంగా జరిగేది. ఇక్ష్వాకుల శాసనాలు గ్రామాధికారిని 'తలవరి' అని పేర్కొంటున్నాయి. అనేక గ్రామాధికారులపై అధికారం కలిగిన వాడు 'మహాతలవరి' అని భావించొచ్చు. రాజులు గ్రామాలను, భూములను దానం చేసినప్పుడు, ఆ గ్రామాధికారిని, గ్రామ ముఖ్యులను సమావేశపర్చి తెలియచేసేవారని తెలుస్తుంది.
న్యాయ పాలన
న్యాయ పాలనలో రాజే అత్యున్నతాధికారి. మహాదండనాయకుడు కేంద్రంలో నేరాలను విచారణ చేసి, శిక్షలను విధించేవాడు. న్యాయ విచారణకు ప్రత్యేకంగా ధర్మాసనాలు కూడా ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. దేశద్రోహం, రాజద్రోహం నేరాలకు మరణ శిక్షను విధించేవారు. చిన్న నేరాలకు జరిమానాలను విధించడం, కొరడాలతో కొట్టడం వంటివి ఉండేవి. ఇక్ష్వాకుల న్యాయ విధానాన్ని గూర్చి తెలిపే ఆధారాలు ఎక్కువగా లభ్యం కాలేదు. కాని, శాతవాహనానంతర యుగానికే చెందిన విష్ణుకుండు రాజు మూడో మాధవవర్మ పాలమూరు శాసనంలో, తనను అనేక దివ్య పరీక్షలను నిర్వహించిన వాడుగా వర్ణించుకొన్నాడు. నేర నిర్ధారణ కోసం తొమ్మిది రకాల దివ్య పరీక్షలుందేవని తెలుస్తుంది. అవి
- తులా దివ్య: తూకం వేసి నేరస్థుణ్ని నిర్ధరణ చేయడం
- అగ్ని దివ్య: నేరస్థుడు కాళ్ళు కాలకుండా నిప్పుల మీద నడవాలి.
- జల దివ్య: నీళ్ళలో [ప్రయోగించిన బాణాలను మునిగి తేవాలి
- విష దివ్య: త్రాచు పామున్న కుండ నుంచి కాటు పడకుండా ఉంగరాన్ని తీయాలి.
- కోశ దివ్య: దేవతా విగ్రహాలను కడిగిన నీరు తాగి బ్రతకాలి.
- తండుల దివ్య; మంత్రించిన బియ్యాన్ని నమలాలి.
- తప్తమస్క దివ్య: మరుగుతున్న నూనెలోంచి నాణేన్ని తీయాలి.
- ఫల దివ్య: కాలుతున్న బల్లపు ఆరును చేతపట్టుకోవాలి. తర్వాత ఆ చేతిలో ధాన్యాన్ని నలపాలి
- ధర్మాధర్మ దివ్య: ధర్మమూర్తి విగ్రహాన్ని అధర్మమూర్తి విగ్రహాన్ని ఒక జాడిలో వేసి నేరం మోపబడిన వ్యక్తి తీసే విగ్రహాన్ని బట్టి, నేర నిర్ధారణ చేసేవారు.
సైనిక వ్యవస్థ
శాతవాహనుల సైనిక విధానాన్నే ఇక్ష్వాకులు పాటించారు. సైన్యంలో రథ, గజ, తురగ, కాల్బలాలనే చతురంగ బలాలుండేవి. విలకాండ్రు కూడా ఉండేవారు. మహాసేనాపతి సైన్యాన్ని పర్యవేక్షణ చేసేవాడు. రాజు దండయాత్రల సందర్భంలో సైన్యానికి అవసరమైన నిత్యావసరాలను అంటే పాలు, పెరుగు, కూరగాయలను ఆయా గ్రామ ప్రజలు సమకూర్చాలి. కూర్చునేందుకు ఆసనాలు, పడుకొనేందుకు మంచాలను అమర్చడం లాంటి సౌకర్యాలను కల్పించాలి. సైనిక వర్గాలకు పాలనలో అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. నాటి రాజ్య మనుగడ, దాని సైనిక బలం, విజయాలపై ఆధారపడింది కాబట్టి, సైన్య నిర్వహణ, పోషణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రాజ్యాదాయంలో అధిక శాతాన్ని వినియోగించడం జరిగింది. సర్వసాధారణంగా, యుద్ధ సమయాల్లో రాజే స్వయంగా సైన్యాన్ని నడిపిస్తూ, నాయకత్వాన్ని చేపట్టేవాడు. గూఢచారుల ద్వారా శతృ సైన్య బలాబలాలను, బలహీనతలను తెలుసుకొని తదనుగుణంగా యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేసుకోవడం జరిగేది. కత్తులు, బల్లెంలు ప్రధాన ఆయుధాలుగా ఉండి, శిరస్త్రాణం, డాలు రక్షణకు వాడబడేవి. బాణాలను కూడా సంధించడం జరిగేది. యుద్ధ సమయాల్లో, సమీప గ్రామాల పంటలకు, ప్రజలకు విపరీత నష్టం జరిగి, భయానక వాతావరణం నెలకొనేది.
ఆదాయ, వ్యయాలు
ప్రభుత్వానికి భూమి శిస్తే ప్రధాన ఆదాయ మార్గం. దానిని 'భాగి' అనే వారు. అంటే, పంటలో రాజు భాగమని అర్థం. సాధారణంగా, పంటలో 1/6 వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు. 'భోగి' అనే మరొక రకమైన భూమి శిస్తును స్థానిక పాలకులు వసూలు చేసుకొని, అనుభవించేవారు. ధన .రూపంలో “హిరణ్యం” లేదా 'దేయం', ధాన్య రూపంలో 'మేయం' అనే పన్నును వసూలు చేసేవారు. పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారంపైన 'కరి' అనే పన్నును వసూలు చేసేవారు. ఉప్పు, పంచదార లాంటి వివిధ వాణిజ్య వస్తువులపై పన్నులను విధించే వారు. రహదారులపై సుంకాన్ని విధించేవారు. అడవులు, పచ్చిక మైదానాలు రాజుకే చెందుతాయి. నీటి తీరువా పన్నును కూడా వసూలు చేసేవారు. వస్తు రూపంలో చెల్లించే సుంకాల్లో ప్రధానంగా చెప్పవల్సింది పశువులకు సంబంధించి విధించేది. వ్యవసాయదారులు తమ పశువులు ఈనిన మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించే వారని మిరాశి వివరించారు.
రాజ్యాదాయాన్ని నాలుగు భాగాలుగా ఖర్చు చేసే వారని తెలుస్తుంది. ఒక భాగం ప్రభుత్వ నిర్వహణకు, సైన్య పోషణకు, పెద్ద ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకిచ్చేందుకూ, రెండో భాగం దేవాలయ నిర్మాణానికి, దైవారాధనకు, అందలి ఉత్సవ నిర్వహణకు, మూడో భాగం కవులు, పండితులు, మహామేధావంతుల పోషణకు, నాల్లో భాగం వివిధ మతాలకు బహుమతులుగా ఇచ్చేందుకు ఖర్చు చేసేవారని తెలుస్తుంది. అధిక సంఖ్యాక ప్రజలు చేపట్టిన వ్యవసాయాభివృద్ధి దోహదం చేసే చెరువులు, కాలువల నిర్మాణానిక్కూడా పాలకులు రాజ్యాదాయంలో కొంత సొమ్మును వెచ్చించడం జరిగింది.
సామాజిక పరిస్థితులు
శాతవాహనానంతర సమాజంలో చాతుర్వర్థాలతో పాటు, అనేక మిశ్రమ కులాలు, ఉపకులాలు అవతరించాయి. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే, తన పూర్వీకుల వృత్తి, దానితో కూడిన సాంఘిక స్థితిని పొందేవాడు. తర్వాత కాలంలో వృత్తిపరంగా కులాలు ఏర్పడ్డాయి. వర్ణ సాంకర్యం కాకుండా చూడటం, రాజులు తమ ధర్మంగా భావించారు. అయినప్పటికి, వర్ణ సాంకర్యం జరిగేది. తమ వృత్తి ధర్మానికి భిన్నమైన వృత్తులను కూడా స్వీకరించిన సందర్భాలున్నాయి. దీనిని వర్ణసాంకర్యమనే వారు. నాగార్జునకొండ శాసనాలననుసరించి, ఇక్ష్వాకుల కాలంలో పూగీయులు, హిరణ్యకులు, ముండలు, ధనికులు, నాగులు, సెబకులు, కులహకుల్లాంటి శాఖలున్నాయని తెలుస్తుంది. ఇక్ష్వాకులు పూగీయ, ధనిక, హిరణ్యక లాంటి స్థానిక కుటుంబాల వారితోనూ, ఉజ్జయినీ క్షాత్రపులతోనూ, వైవాహిక సంబంధాలను పెట్టుకోవాల్సొచ్చింది.
సమాజంలో బ్రాహ్మణుల స్థాయి మెరుగుపడింది. ఇక్ష్వాక రాజులు వైదిక క్రతువులను నిర్వహించడం, బ్రాహ్మణులను ఉన్నత పదవుల్లో నియమించడం, దేవాలయాలను నిర్మించడం వల్ల, బ్రాహ్మణుల ఆర్థిక స్థితి మెరుగు పడింది. రాజులు బ్రాహ్మణులకు భూమిని బ్రహ్మదేయంగా ఇచ్చారు. దానం చేసిన గ్రామంలోకి రాజోద్యోగులు ప్రవేశించరాదు. ఇటువంటి గ్రామాలకు 18 రకాల పన్నుల నుండి మినహాయింపు ఉండేది. క్రమంగా, దాన గ్రహీత సమాజంలో బలమైన వ్యక్తిగా అవతరించాడు. ఈ భూములను శూద్రులే సాగు చేసేవారు. రాజుకు, ప్రజలకు మధ్య భూస్వాములనే వర్గం అవతరించింది. బ్రాహ్మణులు తాము అధ్యయనం చేసే వేదశాఖను, అనుసరించే ధర్మసూత్రాలను బట్టి, మూడు శాఖలుగా ఏర్పడ్డారు. వారు, వేద పండితులు, దేవాలయ అర్చకులు, రాజోద్యోగులు. క్రీ.శ. రెండో శతాబ్దం నాటికి, శక, యవన, పహ్లవ, అభీర మొదలయిన విదేశీ జాతుల సంస్కృతీకరణ జరిగింది. వారు భారతీయ జీవన స్రవంతిలో కలిసిపోయారు. వారు పరిపాలకులు కావడం వల్ల, సమాజంలో క్షత్రియ సాంఘిక హోదాను పొందారు. శూద్రులు కూడా రాజకీయ ప్రాబల్యాన్ని పొంది, బ్రాహ్మణులను ఆదరించి, వైదిక క్రతువులను నిర్వహించి, క్షత్రియులుగా పరిగణింపబడ్డారు. వైశ్యులు వర్తక, వ్యాపారాలను చేసేవారు. పెద్ద వ్యాపారాలను వర్తక సంఘాలే నిర్వహించేవి. వీరు శ్రేణులుగా ఏర్పడేవారు. వైశ్యులే గాకుండా, సాలె, తెలిక, కమ్మరులు కూడా వర్తకాన్ని నిర్వహించేవారు.
సమాజంలో అధిక సంఖ్యాకులు శూద్రులు. వీరిలో వివిధ వృత్తుల వారున్నారు. వ్యవసాయదారులను హాలికులనే వారు. కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, సాలెవారు, రజకులు, క్షురకులు, చర్మకారులు మొదలగు అనేక చేతి వృత్తుల వారున్నారు. ఈ యుగం నాటి శాసనాల్లో 'రథకరు'లకు చేసిన దానాలను గూర్చి పేర్కొనడం జరిగింది. వీరిప్పటికి యజ్ఞోపవీతాన్ని ధరించి, విశ్వబ్రాహ్మణులమని, విశ్వకర్మ సంతతి వాళ్ళమని చెప్పుకుంటారు. కంసాలి, కమ్మర, కంచర, కాశి, వడ్రంగి వృత్తుల వారు, రథకులు ఒక్కటేనని చెబుతారు. వీరిక్కూడా రాజులు మాన్యాలనివ్వడం జరిగింది.
ఇక్ష్వాకుల కాలంలో కూడా, ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని అమరావతి, నాగార్జునకొండ శాసనాలు పేర్కొంటున్నాయి. నాగార్జునకొండ వద్ద మహాచైత్యానికి, రాజ కుటుంబానికి చెందిన స్రీలు విరివిగా దానధర్మాలను చేశారు. ఇక్ష్వాక రాజులు వైదిక మతాన్ని అనుసరించినప్పటికి, స్రీలు మాత్రం బౌద్ధ మఠాన్ని ఆదరించి, అనేక చైత్యాలను నిర్మించి, దానధర్మాలను చేశారు. శాతవాహనుల లాగా, ఇక్ష్వాక రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకొన్నారు.
ఆర్థిక పరిస్థితులు
భూస్వామ్య వ్యవస్థ
శాతవాహనానంతర యుగంలోని రాజ్యవ్యవస్థ, భూస్వామ్య విధానంపై ఆధారపడింది. రాజు భూమికి సర్వాధికారనే సిద్ధాంతం భూస్వామ్య విధానానికి మూలమైంది. దీనికి దైవదత్తరాచరిక విధానం. కూడా దోహదం చేసింది. భూమిని సాగుచేస్తున్న రైతుకు, భూమిపై హక్కులు తొలగిపోయాయి. అతడు సేద్యపు బానిస లాగా దిగజారిపోయాడు. రాజులు తమ ఇష్టానుసారం బ్రాహ్మణులకు, మత సంస్థలకు భూదానాలు, గ్రామ దానాలు ప్రకటించడం వల్ల, వారికి భూమిపై సర్వ హక్కులు లభించాయి. తర్వాత కాలంలో పరిపాలనా యంత్రాంగంలోని ఉన్నతాధికారులకు జీతాలు చెల్లించకుండా, అంతకు సమానమైన ఆదాయాన్నిచ్చే భూములనిచ్చేవారు. రాజులు మత సంస్థలకు, ఉద్యోగులకు, బ్రాహ్మణులకు భూదానాలను చేశారు. ప్రభుత్వాదాయానికి వ్యవసాయం ్రధానమైనందున, రాజులు దాని అభివృద్ధి కోసం కృషి చేశారు. శాంతమూలుడు లక్షలాది నాగళ్ళను, ఆవులను, ఎద్దులను, బంగారాన్ని దానం చేశాడు. అంటే, వ్యవసాయాభివృద్ధికి కృషిచేశాడు. అడవులను నరికివేసి, కొత్తగా భూములను సాగులోకి తేవడమైంది. నీటి పారుదల కోసం కాలువలను, చెరువులను నిర్మించారు. నాగార్జునకొండలో అటువంటి కృత్రిమ నిర్మాణమొకటి బయల్పడింది.
రాజులు చేపట్టిన భూదానాలు కూడా వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డాయి. బ్రాహ్మణులకు రుతువులు, పంచాగం, విత్తనాలు, నేలల స్వభావం, ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసు. బ్రాహ్మణులకు దానమిచ్చిన గ్రామాలకు 18 రకాల పన్నుల నుండి మినహాయింపు ఉండేది. ఈ విషయాన్ని పల్లవ శివస్కందవర్మ వేయించిన హీరహడగళ్ళి, మైదవోలు దాన శాసనాలు తెలియచేస్తున్నాయి. దానమిచ్చిన గ్రామాల్లోకి రాజోద్యోగులు కూడా ప్రవేశించరాదు. శాతవాహనానంతర యుగంలో కొత్త తరహా భూసంబంధాలు ఏర్పడ్డాయి. భూస్వామ్య వ్యవస్థ వేళ్ళూనడం ప్రారంభమైంది. స్థానిక పాలకులు రాజుకు విధేయులుగా ఉంటూ, కప్పాన్ని చెల్లించేవారు. సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో రాజుకు సరఫరా చేసేవారు. గ్రామాధికారులు స్థానిక పాలకుడికి విధేయులుగా ఉంటూ, వారి ఆదాయం నుండి కొంత భాగాన్ని చెల్లించడం జరిగేది.
వ్యవసాయం - పంటలు
వ్యవసాయం ప్రజల ప్రధానమైన జీవనాధారమైంది. వరి, గోధుమ, చెరకు వంటి మాగాణి పంటలు, జొన్న, సజ్జ, రాగులు వంటి మెట్ట పైరులు, కందుల వంటి పప్పు ధాన్యాలు, నువ్వులు, ఆముదాల వంటి నూనె గింజలు, జనుము వంటి పశుగ్రాసం, పత్తి అనాటి ముఖ్యమైన పంటలుగా ఉన్నాయి. పత్తి మెట్ట, మాగాణి పంటగా పండించబదేది. వ్యాపార పంటైన కొబ్బరి, తీర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. క్రీ.శ. రెండో శతాబ్దంలో ఉన్న శక పాలకుడు, రిషభదత్తుడు ముప్పై రెండు వేల కొబ్బరి చెట్లు, ఎనిమిది వేల కొబ్బరి చెట్లు ఉన్నరెండు తోటలను బ్రాహ్మణులకు దానం చేశాడని, నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. రవాణా సౌకర్యాలు, నౌకాయానం అంతగా అభివృద్ధి కాని నాడు, పంటల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్లే వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి.
చేతివృత్తులు - శ్రేణులు
నాగార్జునకొండ తవ్వకాల్లో వృత్తిపని వారి ఇండ్లు బయటపడ్డాయి. ఒక ఇంట్లో స్వర్ణకారుల వృత్తి సామాగ్రి, అంటే, అచ్చులు, మూసలు దొరికాయి. అనేక రకాలైన బంగారు, వెండి కళాత్మక వస్తువులు దొరికాయి. ఇక్ష్వాకుల శాసనాల్లో “పర్ణిక శ్రేణి” (తమలపాకుల వారి శ్రేణి), పూసిక శ్రేణి (మిఠాయి తయారీదార్లు), మరొక శాసనంలో కులిక ప్రముఖుడు (శ్రేణి నాయకుడు) అనే పదాలు కన్పిస్తున్నాయి. కొంతమంది వృత్తి పనివారు ఒక దేవాలయాన్ని మంటపాన్ని కట్టించి, దాని నిర్వహణకై అక్షయ నిధిని ఏర్పాటు చేసినట్లు తెల్పే ఒక శాసనం దొరికింది. గ్రామాల్లో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లు విళపట్టి శాసనం సూచిస్తుంది.
దేశీయ, విదేశీయ వాణిజ్యం
ఇక్ష్వాకుల కాలంలో కూడా రోమ్ దేశంతో వాణిజ్యం కొనసాగింది. నాగార్జునకొండలో రోమన్ నాణేలు లభ్యమయ్యాయి. విజయపురి (నాగార్జునకొండ) లో రోమన్ వర్తక కేంద్రముండేదని తెలుస్తుంది. దేశీయ, విదేశీయ వాణిజ్యం వైశ్యుల అధీనంలో ఉండేది. క్రీ.శ. 3 వ శతాబ్దం నాటికే రోమ్ దేశంతో వాణిజ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. దేశంలో బలమైన కేంద్రీకృతాధికారం లేనందు వల్ల చిన్న చిన్న రాజ్యాలేర్పడి తరచుగా యుద్దాలు చేయడం వల్ల, దేశీయ వాణిజ్యానికి, కుటీర పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. నగరాలు, గ్రామాల పతనం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో దొరికిన శాతవాహనుల నాణేలతో పోల్చినప్పుడు, శాతవాహనానంతర రాజ వంశాల నాణేలు అత్యల్పం. అంతేగాక, శాతవాహనుల తదుపరి మరెవ్వరూ ఓడ బొమ్మతో నాణేలను వెయ్యలేదు. క్రీ.శ. మూడో శతాబ్దం తర్వాత రోమన్ సామ్రాజ్యంలో వర్తకం ఇంతకు పూర్వం లాగా సముద్ర మార్గం ద్వారా కాక, ఎక్కువగా భూమార్గాల ద్వారా జరిగింది. కాబట్టి, ఉత్తర భారతదేశపు వర్తక కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కల్గింది. ఇక్ష్వాక రాజు వీరపురుషదత్తుని పరిపాలనా 14వ సంవత్సరంలో వేసిన నాగార్జునకొండ శాసనం, ఘంటసాలను పేర్కొంది. కృష్ణానది ముఖద్వారంలో ఉండటం చేత, ప్రధాన ఓడరేవుగా వర్ధిల్లింది. శాతవాహనుల కాలం నుండి బరుకచ్చం (బ్రోచ్), కల్యాణి (మహారాష్ట్ర, సొపార్, మైసోలియా (మచిలీపట్నం) లు ఓడ రేవులుగా కొనసాగాయి. భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు, ఇనుము, ఉక్కు నూలు గుడ్డలు, కొబ్బరి కాయలు, మొదలగు వాటిని ఎగుమతి చేసి, బంగారం, వెండి, రాగి, మత్తు పానీయాలు, గాజు సామగ్రి మొదలగు వాటిని దిగుమతి చేసుకొనేవారు. వాణిజ్యం భారతదేశానికి అనుకూలంగా ఉండేది. అందువల్ల రోమన్ సామ్రాజ్యం భారతదేశ వ్యాపారం మీద నిషేధాన్ని విధించడంతో చేతివృత్తులు, పట్టణాలు పతనమైనాయి.
దేశీయ, విదేశీయ వాణిజ్యం క్షీణించడం చేత, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ద్రవ్య ఆర్థిక వ్యవస్థకు బదులు, వస్తు మార్పిడి విధానం బలపడింది. కావలసిన వస్తువులు, సేవలను పొందేందుకు, ధాన్యం బదులు ఇవ్వడం జరిగింది. రాజులు నాణేలను జారీచేసే అవసరం లేకుండా పోయింది. నగర సంస్కృతి క్షీణించి, దాని స్థానంలో గ్రామీణ సంస్కృతి వృద్ధి చెందింది. గ్రామ అవసరాలను తీర్చడమే అనాటి లక్ష్యంగా మారింది.
సాంస్కృతిక వికాసం
ఇక్ష్వాకుల పాలనలో మత, సాహిత్య, వాస్తు కళారంగాలు గణనీయమైన ప్రగతిని సాధించాయి. వైదిక, బౌద్ధ, జైన మతాలు వర్ధిల్లాయి. ప్రాకృతం రాజభాషలైనప్పటికీ, సంస్కృతం మంచి ఆదరణ, అభివృద్ధిని సాధించింది. బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు, నవగ్రహ, సర్వదేవాలయ హైందవ దేవాలయాలు నాటి వాస్తు శిల్ప కళారీతులను కనువిందు చేస్తున్నాయి.
మత రంగ ప్రగతి
బౌద్ధం
ఇక్ష్వాకు రాజుల్లో వీరపురుషదత్తుడు తప్ప, మిగిలిన ముగ్గురు రాజులు వైదిక మతావలంబులు. కాని, వారి రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని ఆదరించి, దానాలను చేశారు. క్రీశ. రెండో శతాబ్దం నాటికి నాగార్జునకొండ భారతదేశంలోనే ప్రసిద్ధ బౌద్ధ ఆరామంగా విలసిల్లింది. నాగార్జునకొండ శాసనాలు అనేక బౌద్ధ మత శాఖలను పేర్కొంటున్నాయి. మహా సాంఘికుల్లో పూర్వశైలీయులు (పుబ్బతైలులు) అపరశైలీయులు, బహు(శ్రుతీయులు అనే శాఖలు అవతరించాయి. అమరావతి పూర్వశైలీయులకు, నాగార్జునకొండ అపరశైలీయులకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. బౌద్ధంలోని రాజగిరికులు, మహీశాసకులు, సిద్ధాంతికులు వంటి శాఖలు కూడా నాగార్జునకొండలో ఉండేవి. ఇక్ష్వాక రాజు వీరపురుషదత్తుని కాలం బౌద్ధ మతానికి ఉజ్వలమైందని చెప్పొచ్చు. ఇతడి మేనత్త శాంతిశ్రీ, వీరపురుషదత్తుని ఆరో పాలనా సంవత్సరంలో, బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించి, తొమ్మిది ఆయక స్థంభాలను నెలకొల్పింది. ఆయక స్థంభంపై ప్రాకృతంలో “సమ్మ సంభుధన ధాతు వర పరిగ్రహిత' అని ఉంది. అంటే, “బుద్దుని యొక్క శ్రేష్టమైన అస్తికను పరిగ్రహించినది” అని అర్ధం. బ్రాహ్మణులు, శ్రమణులు, పేద ప్రజలను కనికరించి, శాంతిశ్రీ అనేక దానాలను చేసింది. ఆమె కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమ కలిగి, వారి క్షేమాన్ని కోరింది. మొత్తం ప్రపంచ ప్రజానీకం, సమస్త జీవులు ఉభయ లోకాల్లో ఆనందాన్ని పొందాలని శాంతిశ్రీ ఆకాంక్షించింది. తన ప్రయోజనాల కంటే అందరి క్షేమం కోరే మహాయన బౌద్ధాన్ని గుర్తు చేస్తుంది. నాగార్జునకొండలో బయల్పడిన బౌద్ధ శిల్పాలు అక్కడ మహాయానం విలసిల్లిందని రూఢి పరుస్తున్నాయి.
రాజ కుటుంబానికి చెందిన వీరేగాక, సామాన్య స్త్రీలు కూడా బౌద్ధ విహారాలకు దానాలను చేసి, శాసనాలను వేయించారు. రాజ భాండాగారికుదైన బోదిశర్మ మేనకోడలు, ఉపాసిక బోదిశ్రీ, విజయపురిలో, చుళదమ్మగిరి వద్ద ఒక ఆరామాన్ని నిర్మించింది. ఇది సింహళ విహారంగా ప్రసిద్ధికెక్కింది. సింహళ దేశం నుండి వచ్చిన బౌద్ధ ప్రచారకులు, కాశ్మీర, గాంధార, చీన, చిలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాస, యవన, దమిళ, పాలూర, మొదలగు దేశాల్లో ధర్మ ప్రచారం చేసేవారని పేర్కొనడం జరిగింది. వీరపురుషదత్తుని కుమార్తె కొడబలిశ్రీ, మహీశాసికుల కోసం ఒక విహారాన్ని నిర్మించినట్లు ఒక శాసనంలో ఉంది. ఎహువల శాంతమూలుని కాలంలో, అతని తల్లి మహాదేవి భట్టిదేవ బహుశ్రుతీయులు కొరకు, ఒక మహావిహారాన్ని, ఒక మహాచైత్యాన్ని నిర్మించింది.
సింహళం, నాగార్జునకొండ మధ్య, బౌద్ధ మత సంబంధాలుండేవి. శ్రీలంక నుండి బౌద్ధ భిక్షువులు నాగార్జునకొండను సందర్శించడానికి వచ్చేవారు. నాగార్జునకొండ శాసనాలననుసరించి, మహా సాంఘిక ఆచార్యులు ఐదు నికాయల్లోని దిఘనికాయ, మజ్జిమ నికాయలను కంఠస్తం చేసేవారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునకొండతో పాటు, జగ్గయ్యపేట, చినగంజాం, రామిరెడ్డిపల్లి, బావికొండ, తెలంగాణాలో నేలకొండపల్లి, తుమ్మల గూడెం, గాజులబండ (నల్గొండ జిల్లా) ప్రధాన బౌద్ధ మత కేంద్రాలుగా విరాజిల్లాయి. దిఘ, మజ్జిమ నికాయలననుసరించి, బాదంత ఆనందుడు అపరమహావినశైలీయ శాఖకు చెందిన వాడని తెలుస్తుంది. ఇతడు క్రీ.శ. మూడో శతాబ్దికి చెందినవాడు. బహుశా ఇతని పరుష ప్రోద్బలం మీదనే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉంటాడు. ఆర్యదేవుడు, ధర్మనంది, బాధంత ఆనందుడు, ఆచార్య నాగార్జునుని శిష్యులు. ఆర్యదేవుడు 'చిత్తశుద్ధి ప్రకారణ' అనే గ్రంధాన్ని రచించాడు. ఇతడు వైదికాచారాలను అపహాస్యం చేసినందు వల్ల, వైదికులచేత హత్యకు గురయ్యాడు.
శాతవాహనానంతర యుగంలో (క్రీ.శ.మూడో శతాబ్దం నుండి క్రీ.శ. ఏడవ శతాబ్దం మొదటి పాదం వరకు) భావవివేకుడు, బుద్ధఘోషుడు, ధర్మకీర్తి సిద్ధ నాగార్జునుడు వంటి వారు తమ కార్యకలాపాలను సాగించారు. క్రీ.శ. ఐదవ శతాబ్దానికి చెందిన భావవివేకుడు నాగార్జునుని మాధ్యమిక శాస్త్రం పై ''ప్రజ్ఞాప్రదీప' అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. మహాయానానికి ఆచార్య నాగార్జునుడెంతటి వాడో, థేరవాదానికి (హీనయానం) బుద్ధఘోషుడంతటివాడు. శ్రీలంక భాషలో ఉన్న అట్ట కథలను పాళీ భాషలో రాయాలనే సంకల్పంతో శ్రీలంకకు వెళ్లి, అమరాధపురం విహారంలో నివసిస్తూ, అక్కడి ధేరవాదుల కోసం 'విశుద్ధమొగ్గ అనే గ్రంథాన్ని రాశాడు. ధర్మకీర్తి నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు. కంచి ధర్మపాలుని శిష్యుడు. ప్రపంచంలో బౌద్ధ తర్కానికి పేరు ప్రఖ్యాతులను కల్పించాడు. సిద్ధనాగార్జునుడు ధాన్యకటకం, శ్రీపర్వతంపై నివాసమున్నాడు. ఇతడు బౌద్ధంలో తాంత్రిక వాదమైన వజ్రయాన మతస్థుడు. ఇతడు తెలుగువాడని రామిరెడ్డిపల్లి శాసనం తెలుపుతుంది. ఇతడు రససిద్ధి, స్వర్దసిద్ధి, వజ్రయాన సిద్ధిని పొందాడు. మధువు, మాంసం, మత్స్యం, ముద్ర, మైధునం అనే పంచమ కార్యాలను వజ్రయానశాఖ వారు ఆచరిస్తారు. సాధారణ నీతి నియమాలు తమకు వర్తించవని తమ చర్యలను సమర్థించుకొంటారు. ధాన్యకటకం, శంఖవరం, రామతీర్థం, శాలిహుండం వజ్రయాన కేంద్రాలు. ఇక్ష్వాకుల కాలంలో రాజాదరణ, ప్రజాదరణ పొందిన బౌద్ధ మతం, తర్వాత కాలంలో క్షీణించడం ప్రారంభమైంది.
ఇక్ష్వాకుల కాలంలో పెనుగొండ, పిఠాపురం, నేదునూరు, తాటిపాక, ఆర్యవటం, ద్రాక్షారామం ప్రధాన జైన మత కేంద్రాలు. ఆర్యవటంలో క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందిన ఆరు తీర్థంకరుల విగ్రహాలు దొరికాయి.
పౌరాణిక హిందూ మతం - శైవ, వైష్ణవాలు
ఇక్ష్వాక రాజు శ్రీశాంతమూలుడు అశ్వమేధ, వాజపేయ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర ఇత్యాది వైదిక క్రతువులను నిర్వహించాడు. ఇతడు పౌరాణిక దేవతలైన విరూపాక్షపతి (శివుడు), మహాసేన (స్కంద), కార్తికేయుల పాదభక్తుడు. ఎహువల శాంతమూలుడు పుష్పభద్రస్వామి అనే పేరుతో, శివాలయాన్ని నాగార్జునకొండలో నిర్మించాడు. ఇతని సేనాని ఎలిశ్రీ, కుమారస్వామికి 'సర్వదేవ' అనే పేరుతో, శివాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 'నోడగేశ్వర' అనే ఆలయం నాగార్జునకొండలో ఉన్నట్లు, దాని కోసం ఒక వర్తకుని కూతురు రతవశ్య, మరికొందరు కలిసి 'నోడగేశ్వర' స్వామికి దానధర్మాలు చేసినట్లు తెలుస్తుంది. ఎహువల శాంతమూలుని కాలంలో, ఇక్ష్వాక రాజ్యంపై దండెత్తి వచ్చిన అభీర వసుసేనుడి సేనాని శివసేనుడు, నాగార్జునకొండలో “అష్టభుజస్వామి” అనే పేరున, వైష్ణవాలయాన్ని నిర్మించినట్లు, అతడి శాసనం తెలియజేస్తుంది. ఇక్ష్వాకుల కాలంలో మాతృదేవతారాధన కూడా ఉండేది. నాగార్జునకొండలో హారీతి దేవాలయం నిర్మింపబడింది. ఆనాడు స్త్రీలు సంతానం కోసం, హారీతి దేవాలయంలోని సప్తమాత్రికల వద్ద గాజులను సమర్పించేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్ష్వాకుల కాలంలో పౌరాణిక శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలు ఆదరింపబడ్దాయి. స్కంద గణపతి, యక్షుడు, హారీతి దేవతా గణాన్ని పూజించారు.
భాషా సాహిత్యాలు - ప్రగతి, పురోగతి
ఇక్ష్వాకుల కాలంలో ప్రాకృతమే రాజభాషైనప్పటికి, క్రీ.శ. నాల్గో శాతాబ్దం నుండి శాసనాల్లోనూ, సాహిత్యంలోనూ ప్రాకృత భాష స్థానాన్ని సంస్కృతం ఆక్రమించింది. మహాయాన బౌద్ధ మతం అవతరించడం, బౌద్ధ మతం స్థానంలో వైదిక మతం బలపడటం కూడా ఇందుకు కారణాలుగా చెప్పొచ్చు. ఎహువల శాంతమూలుని పరిపాలనా పదకొండవ సంవత్సరానికి పూర్వం, శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి. తర్వాత కాలం నాటివి సంస్కృతంలో ఉన్నాయి. ఆయనకు ముందు పాలించిన వీరపురుషదత్తుని శాససాలు సంస్కృతంలో ఉన్నాయి. ఎహువల శాంతమూలుని సేనాని ఎలిశ్రీ వేసిన సర్వదేవ శాసనం కూడా సంస్కృతంలోనే ఉంది. బృహత్పలాయన రాజు-జయవర్మ కొండముడి శాసనం కూడా సంస్కృత భాషలో ఉంది. శాలంకాయనులు, ఆనంద గోత్రజుల శాసనాల్లో ప్రాకృతం, సంస్కృతం రెండు భాషలుపయోగించారు. విష్ణుకుండుల శాసనాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి.
సంస్కృత భాషకు రాజాదరణ లభించింది. రాజులు వేదపండితులకు గ్రామాలను, భూములను దానం చేశారు. ఇక్ష్వాకుల కాలంలో ధాన్యకటకం (అమరావతి), నాగార్జునకొండల్లో ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాలు వర్ధిల్లాయి. ఇక్కడికి విద్యార్దన కోసం శ్రీలంక, టిబెట్, నేపాల్ నుండే గాక, మన దేశంలోని అన్ని ప్రాంతాల నుండి బౌద్ధ భిక్షువులు వచ్చేవారని క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఉద్యోతనుడు 'కువలయమాలి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఆచార్య నాగార్జునుని శిష్యుడు ఆర్యదేవుడు 'చిత్తశుద్ధి ప్రకరణం' అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్ష్వాకుల శాసనాల్లో ఖగోళ విజ్ఞానం, వైద్యం, గణితం మొదలైన శాస్త్రాల ప్రసక్తి ఉంది. క్రీశ. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్, శ్రీపర్వత విహారం నిరాదరణకు గురైనట్లు పేర్కొన్నాడు.
వాస్తు కళలు - పరిణామ పురోగతి
క్రీ.శ. 3, 4 శాతాబ్దాల్లో దక్కన్‌లో బౌద్ధ కళలు, వాస్తు పద్ధతి ఉజ్వలంగా వర్ధిల్లాయి. శాతవాహన సామ్రాజ్యం పతనమైనప్పటికి, వాస్తు కళలు అంతరించలేదు. నాగార్జునకొండ తవ్వకాల్లో క్రీ.శ మూడో శతాబ్దానికి చెందిన శతృదుర్భేద్యమైన కోట, కందకం, కోట లోపలి అనేక భవనాలు, బహిరంగ ప్రదర్శనశాల (స్టేడియం) శాంతమూలుని అశ్వమేధ వేదిక, బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు,. ఆరామాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలైనవెన్నో బయల్పడినాయి. క్రీడాస్థలం వివిధ అంతస్తుల్లో నిర్మించబడ్డది. భారత దేశంలో ఎక్కడ ఇటువంటి నిర్మాణం బయల్పడలేదు. దీనిని రోమన్ నిపుణుల సహాయంతో నిర్మించి ఉంటారని, కొందరు పండితుల అభిప్రాయం. నాగార్జునకొండలో సుమారు 30 బౌద్ధఆరామాలుండేవి. బౌద్ధంలో వివిధ శాఖలకు చెందిన వారు వీటిని నిర్మించారు. క్రీ.శ. మూడో శతాబ్దిం నుండి బౌద్ధమతంలో వచ్చిన మార్పులకు నిదర్శనంగా, నాగార్జునకొండ నిల్చింది. బౌద్ధ మతంలోని అపరమహావినశైలీయ, మహావిహారవాసిని, మహీశాసిక, బహుశ్చతీయ శాఖల ప్రభావం అక్కడి వాస్తు శిల్పంపై ప్రసరించింది. బుద్ధుడిని మానవ రూపంలో చూపడం ఇంతకు పూర్వం నిషేధం. కాని, అపరమహావినశైలీయ శాఖ నుండి వచ్చిన ఆదరణ మూలంగా, బుద్దుని విగ్రహాలను అందంగా చెక్కారు.
క్రీశ. మూడో శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్తూపాలు, విహారాలు, తెలంగాణాలో నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) గాజులబండ (నల్గొండ జిల్లా), తుమ్మల గూడెం (నల్గొండ జిల్లా), నందికొండ (నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోలి, చందవరం, దూపాడు, నంబూరు, ఉప్పుగుండూరు, రెంటాల మొదలైన చోట్ల ఉన్నాయి. నాగార్జునకొండలో మూడు రకాలైన స్తూపాలున్నాయి. అవి: 1) బుద్దుడు లేదా ప్రముఖ బౌద్ద భిక్షువు శరీర అవశేషాలైన ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, గోళ్ళు మొదలైన వాటిపై నిర్మించే స్తూపాలు; 2) బౌద్ద భిక్షువులు వాడిన భిక్షా పాత్రలు, వస్తువులు మొదలైన వాటిపె నిర్మించే స్తూపాలు; 3) అస్తికలు, వస్తువులు ఏవి లేకుండా, బుద్ధునిదో, ఆయన శిష్యులదో స్మృతి చిహ్నంగా కట్టిన స్థూపాలు.
అమరావతి శిల్ప నిర్మాణ చివరి ఘట్టం ఇక్ష్వాకుల కాలంలో కూడా కొనసాగింది. అమరావతి శిల్ప సంప్రదాయం నాగార్జునకొండ శిల్ప నిర్మాణంలో ఉన్నత శిఖరాలకు చేరుకొన్నది. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ ఈ శిల్పకళకు కేంద్రమైంది. బుద్ధుడిని చిహ్నాల రూపంలో శిల్పులు మల్చు పద్ధతి ఇంకా ఆగిపోలేదు. బుద్ధుడి జీవితానికి సంబంధించిన పాదాలు, అశ్వం, బోధివృక్షం, ధర్మచక్రం, స్తూపం, త్రిశూలం చిహ్నాలుగా చెక్కబడ్డాయి. బుద్ధుడు, యశోధర, రాహులుడి కలయిక, శిబి జాతకం, మాంధాత జాతకం వంటి కథలు, నాగార్జునకొండ, ఘంటశాల, గుమ్మడిదుర్రు, గోలి, చైత్యములందు మలచబడినాయి. బుద్ధ ప్రతిమలు, శాంతమూలుని స్మారక స్తంభం, వీరపురుషదత్తుని బ్రాహ్మణ మత నిరసన, బౌద్ధ మతావలంబనం, వీరపురుషదత్తుడు తిరుగుబాటునణచడం, మైథున శిల్చాలు మొదలయినవి ఇక్ష్వాకుల శిల్చ కళా ఖండాలు.
శాతవాహనానంతర కాలంలో నిర్మించబడ్డ అతి ముఖ్యమైన స్తూపం నేలకొండపల్లిలో ఉంది. ఒక మహాస్తూపం, చతుశ్శాల రకం విహారాలు, నిలువెత్తు బుద్దుని విగ్రహాలు అనేకం ఇక్కడ బయల్పడ్డాయి. క్రీశ మూడో శతాబ్దం నుండి, క్రీ.శ. ఆరో శతాబ్దం వరకు, ఈ నిర్మాణాలు జరిగాయి. బుద్ధుని కంచు విగ్రహం, పాలరాయిపై చెక్కిన తొమ్మిది బుద్ధ విగ్రహాలు, తవ్వకాల్లో బయటపడ్డాయి. విగ్రహాలు లభించిన చోటుకు సమీపంలోనే పాలరాతి ముక్కలు, నీటి తొట్టెలు బయల్పడటం చేత, అది బుద్ధ విగ్రహాలను తయారుచేసే శిల్చ కర్మాగారమని వి. వి.కృష్ణశాస్త్రి అభిప్రాయం. నేలకొండపల్లి బుద్ధ విగ్రహాలు అమరావతి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. గాజులబండలో బౌద్ధ స్తూపం, బయల్పడ్డాయి. సున్నపు రాయితో చేసిన రెండు సింహాల బొమ్మలు ఇక్కడ దొరికాయి. నందికొండలో కొన్ని బౌద్ధ నిర్మాణాలు బయల్పడ్డాయి.
ఇక్ష్వాకుల కాలంలో హైందవ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. ఎహువల శాంతమూలుని కాలంలో, నాగార్జునకొండలో కార్తికేయ, పుష్పభద్ర, అష్టభుజస్వామి, హారీతి, కుబేర, నవగ్రహ ఆలయాలు నిర్మింపబడినట్లు నాగార్జునకొండ తవ్వకాల్లో బయల్పడిన శిథిలాల ద్వారా తెలుస్తుంది. ఏలేశ్వరం (నల్గొండ జిల్లాలో సర్వ దేవాలయం నిర్మింపబడింది. నాగార్జునకొండలోని దేవాలయాలు, గర్భగుడి, అంతరాళం, మంటపం, ధ్వజస్తంభం, ప్రాకారమనే విభాగాలతో, ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారని తెలుస్తుంది. పౌరాణిక, ఇతిహాస గాథల శిల్పాలను, దేవాలయాల్లో ప్రతిష్టించడం ఇక్ష్వాకుల కాలంలో కొనసాగింది. నాగార్జునకొండ శిల్పాల్లోని స్రీమూర్తుల్లో శృంగారానుభూతి ఎక్కువగా గోచరిస్తుంది. స్త్రీల శిల్పాలు, సన్నగాను, వయ్యారంగాను మలచబడినాయి.
విహారం, చైత్య అవశేషాలు
శాతవాహనుల సామంతులుగా అధికారాన్ని ప్రారంభించిన ఇక్ష్వాకులు, వారి పతనానంతరం స్వతంత్ర పాలన సాగిస్తూ, వారి పాలనా విధానం,సాంస్కృతిక రీతులను కొనసాగించడం జరిగింది. వీరి పేర్లు కూడా, శాతవాహనుల లాగా, ముందు మాతృ నామాన్ని చేర్చడం జరిగింది. సమీప రాజ వంశాల వారితో వైవాహిక సంబంధాలనేర్చర్చుకొని, తద్వారా తమ, అధికార సుస్థిరత, వ్యాప్తికి కృషి చేయడం జరిగింది. ఇక్ష్వాక పాలకులు విస్తారంగా దానాలను నిర్వహించి, వాటిలో భూమితో పాటు, ఎద్దులను, నాగళ్లను, గోవులను కూడా వేల సంఖ్యలో ప్రదానం చేసి, వ్యవసాయాభివృద్ధి పట్ల తమ ఆసక్తిని, ప్రోత్సాహాన్ని కనబర్చారు. ఇదే ఆశయంతో చెరువులు, కాలువల నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది.
వీరి పాలనలో శూద్రులు, స్త్రీలు సామాజిక రంగంలో స్వాతంత్ర్యాన్ని ప్రగతిని పొందగలిగారు. ఆర్థిక రంగంలో వ్యవసాయంతో పాటు చేతి వృత్తుల పరిశ్రమలు, దేశీయ, విదేశీయ వాణిజ్యం వృద్ధి చెందాయి. రోమ్ నగరంతో విదేశీ వ్యాపారం సాగినట్లుగా తెలుస్తుంది. కృష్ణానదీ ముఖద్వారంలో ఉన్న ఘంటసాల ప్రధాన ఓడరేవుగా నిల్చింది. బౌద్ధ, జైనాలు, శైవ, వైష్ణవాల వ్యాప్తి, సంస్కృత భాషా వ్యాప్తికి, వాస్తు, శిల్పాల ప్రగతికి దోహదమైంది. అమరావతి, నాగార్జునకొండ, నేలకొండపల్లి, తుమ్మల గూడెం, గాజులబండ, మొదలగు ప్రదేశాల్లో ఇక్ష్వాకులు నిర్మించిన బౌద్ధ స్తూపాలు, వివారాలు, స్మృతి చిహ్నాలు, శైవ, వైష్ణవ ఆలయాలు, వారి కళాభివృద్ధికి, సాంస్కృతిక సేవకు, నీరాజనం పడుతున్నాయి.
Ancient History of Ikshvaku Dynasty in Telugu, Ikshvaku Dynasty Ancient History in Telugu, Historical monuments of Ikshvaku Dynasty in telugu, Ancient History of Ikshvaku Dynasty notes in Telugu, Ancient History of Ikshvaku Dynasty study material in Telugu, Ancient History of Ikshvaku Dynasty lecture notes in Telugu,who was the first king of Ikshvaku Dynasty,who was the founder of Ikshvaku Dynasty, Ikshvaku Dynasty Founder, Ikshvaku Dynasty first king,the great king of Ikshvaku Dynasty, Ikshvaku Dynasty great king,great ruler of Ikshvaku Dynasty,Ikshvaku Dynasty period, Ikshvaku Dynasty great ruler,list of the kings of Ikshvaku Dynasty, Ikshvaku Dynasty kings list, Ikshvaku Dynasty rulers list,rulers list of Ikshvaku Dynasty,capital of Ikshvaku Dynasty,what was the first capital of Ikshvaku Dynasty,Telangana Ancient history notes,Telangana Ancient history notes in telugu,Telangana Ancient history study material in telugu,The great Empire of the Ikshvaka dynasty